chandravadanఈ మధ్య ఒక వార్త నాకు ఎంతో ఆశ్చర్యాన్ని, ఆనందాన్నీ కలిగించింది. అది అవయవదానం గురించి. బ్రెయిన్‌డెడ్‌ అయిన ఒక యువకుని శరీరం నుంచి సేకరించిన కొన్ని అవయవాలను డాక్టర్లు, మరో ఐదుగురు రోగులకు అమర్చి ప్రాణదానం చేశారు. ఒకప్పుడు రక్తదానం చేయడం చాలా గొప్ప విషయం. రెడ్‌క్రాస్‌ వంటి సంస్థలు దీనిని ప్రోత్సహించేవి. ఆ తరువాత ప్రజలలో రక్తదానంపట్ల అవగాహన పెరగడంతో ‘రక్తనిధులు’ (బ్లడ్‌బ్యాంకులు) ఏర్పాటుకు కూడా పలు స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చాయి. ప్రస్తుతం రక్తదాతలకు, రోగులకు అవసరమైన రక్త నిధులకు అంతగా కొరత లేదు.
ఆ తరువాతి పరిణామంలో ‘నేత్రదానం’ ప్రాధాన్యత సంతరించుకుంది. ఎంతోమంది తమ మరణానంతరం ‘నేత్రదానం’ చేస్తామని ముందుకువచ్చి తమపేర్లు నమోదు కూడా చేయించు కుంటున్నారు. ఇప్పుడు వైజ్ఞానికంగా, సాంకేతికంగా సాధించిన అభివృద్ధి ఫలితంగా మానవ శరీరంలోని పలు అవయవాలను దాతలనుంచి వేరుచేసి అవసరమైన రోగులకు అమర్చే ప్రక్రియ అమలులోకి వచ్చింది. ఇది నిజంగా మృత్యుముఖంలో ఉన్నవారి పాలిట వరంగా పేర్కొనవచ్చు.

అయితే, ఇక్కడ వచ్చిన సమస్య దాతలు ఎవరు? అన్నది.

మనిషి మరణిస్తే, ఆ భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించడం తప్ప, మరో ప్రయోజనం లేదన్నది ఇంతకాలం మనకున్న అవగాహన. కానీ, మనిషి మరణించిన తరువాత కూడా కొన్ని గంటలపాటు అతని శరీరంలోని కొన్ని అవయవాలు సజీవంగానే ఉంటాయి. ఆ సమయంలోగా వాటిని సేకరించి అవసరమైన రోగులకు వాటిని అమరిస్తే ఆ రోగులు మరో 10నుంచి 15 సంవత్సరాలు జీవించే అవకాశం వుంటుంది.

ఈ విధంగా గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, పాంక్రియాస్‌, కిడ్నీలువంటి అవయవాలను మృతుని శరీరంనుంచి సేకరించి మరికొంతమందికి పునర్జన్మ ఇవ్వవచ్చు. ఇందుకు మృతుని కుటుంబ సభ్యుల సహకారం అవసరం. రక్తదానం, నేత్రదానంలాగానే అవయవదానంపై కూడా దాతలు ఉదారంగా ముందుకు రావాల్సి ఉంది. అందుకు ప్రజలలో పూర్తి అవగాహన కలిగించే విస్తృత ప్రచారం జరగాలి.

ఇప్పుడు గుండెతోసహా, వివిధ అవయవాల మార్పిడి జరుగుతోంది. త్వరలోనే తలలు మార్చడం కూడా సాధ్యమేననని ఇటలీకి చెందిన శాస్త్రవేత్తలు చెపుతున్నారు.

మనిషి మరణానంతరం అతని మృతదేహానికి అంత్యక్రియలు జరిపేముందు మృతుని శరీరంలోని అవయవాలను దానం చేసేందుకు ఆ వ్యక్తి కుటుంబసభ్యులు ముందుకు వస్తే, ప్రాణాపాయ స్థితిలో ఉన్న మరికొంతమందికి ప్రాణభిక్ష పెట్టిన వారవుతారు. ఉదాత్తమైన ఈ అంశంపై నెలకొన్న కొన్ని అపోహలను సమూలంగా తొలగించాల్సిన ఆవశ్యకత ఉంది. ఈ దిశగా ప్రగతిశీల దృక్పథంతో మనం చొరవగా భాగస్వామ్యాన్ని స్వీకరించాలి.
అవయవదానంతో మృతులు కూడా చిరంజీవులుగా మిగిలిపోతారు.

డాక్టర్‌ ఆర్‌.వి. చంద్రవదన్‌, ఐఎఎస్‌
కమీషనర్‌ & పబ్లిషర్‌

Other Updates