tsmagazineతెలంగాణ భూభాగం నుంచి ఒక్క చుక్క నీరు కూడా జారిపోకుండా, ఎక్కడికక్కడ ఒడిసి పట్టుకుని చెరువులకు మళ్లించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు అధికారులను ఆదేశించారు. 365 రోజుల పాటు తెలంగాణలోని అన్ని చెరువులు నిండు కుండల్లా కళకళలాడాలని ముఖ్యమంత్రి చెప్పారు. కాకతీయుల కాలం నుంచి వారసత్వంగా వచ్చిన అద్భుతమైన గొలుసుకట్టు చెరువులను ఆయువు పట్టుగా మార్చుకుని తెలంగాణలో సాగునీటిని సద్వినియోగం చేసుకోవాలని సీఎం సూచించా రు. భారీ, మధ్య తరహా ప్రాజెక్టుల, కాల్వల ద్వారా వచ్చే నీటి ద్వారా, వర్షం ద్వారా వచ్చే నీటి ద్వారా, పడబాటు (రీ జనరేటెడ్‌) నీళ్ల ద్వారా చెరువులను నింపే వ్యూహం ఖరారు చేయాలని చెప్పారు. పరిగెత్తే నీటికి నడక నేర్పాలని సూచించారు. కాల్వలను చెరువులకు అనుసంధా నం చేస్తూ మండలాల వారీగా ఇరిగేషన్‌ మ్యాపులను సిద్ధం చేయాలని ఆదేశించారు.

‘భారీ, మధ్య తరహా నీటి పారుదల ప్రాజెక్టుల కాలువల ద్వారా గొలుసుకట్టు చెరువుల అనుసంధానం’ అనే కార్యక్రమంపై ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ ఏజన్సీ, ఇస్రో ద్వారా చేయించిన గొలుసుకట్టు చెరువుల మ్యాపింగ్‌ పై నీటి పారుదల శాఖ అధికారులు పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చారు. తెలంగాణలోని వేలాది చెరువులను ఉపయోగించుకుని వ్యవసాయానికి సాగునీరు అందించే అవకాశాలపై ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు.

”మనకు వారసత్వంగా వచ్చిన వేలాది చెరువులున్నాయి. 1974లోనే బచావత్‌ ట్రిబ్యు నల్‌ తెలంగాణలోని చెరువులకు 265 టిఎంసిల నీళ్లను కేటాయించారు. అంటే అంత పెద్ద

మొత్తంలో నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం కలిగిన గొప్ప సంపద మనకు చెరువుల రూపంలో ఉంది. కానీ సమైక్య పాలనలో చెరువులు ధ్వంసం అయ్యాయి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన వెంటనే, మనం మిషన్‌ కాకతీయ కార్యక్రమం ప్రారంభించుకుని చెరువులను పునరుద్ధరించుకున్నాం. ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి ప్రాజెక్టులు నిర్మించుకుంటున్నాం. అలా నిర్మించుకున్న ప్రాజెక్టుల ద్వారా తీసుకున్న నీరు ఒక్క చుక్క కూడా వధా కాకుండా చెరువులకు మళ్లించాలి. గొలుసు కట్టు చెరువులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. ఒక్కో గొలుసుకట్టులో 20 నుంచి 70 వరకు చెరువులున్నాయి. గొలుసు కట్టులో మొదటి చెరువును గుర్తించాలి. ఆ చెరువును ప్రాజెక్టు కాలువకు అనుసంధానం చేయాలి. మొదటి చెరువు నింపుకుంటూ పోతే కింద ఉన్న చెరువులు కూడా నిండుతాయి. దీని కోసం కట్టు కాలువ (ఫీడర్‌ ఛానల్‌), పంట కాలువ (క్రాప్‌ కెనాల్‌)లను సిద్ధం చేయాలి. ప్రతీ మండల ఎఇ దగ్గర ఆ మండల చెరువులకు సంబంధించిన మ్యాపులు ఉండాలి. ఏ కెనాల్‌ ద్వారా ఏ చెరువు నింపాలనే దానిపై వ్యూహం ఖరారు చేయాలి. ఏ చెరువు అలుగు పోస్తే ఏ చెరువుకు నీరు పారుతుందో తెలిసుండాలి. ప్రాజెక్టుల కాల్వల నుంచే కాకుండా, రాష్ట్ర వ్యాప్తంగా నిర్మిస్తున్న వేలాది చెక్‌ డ్యాముల ద్వారా, పడబాటు ద్వారా, వర్షం ద్వారా వచ్చే ప్రతీ నీటి బొట్టును చెరువులకు మళ్లించాలి. తెలంగాణలో నీళ్లు పరిగెత్త కూడదు. అవి మెల్లగా నడిచి వెళ్లాలి. అప్పుడే నీటిని సమర్థ వంతంగా సంపూర్ణంగా వినియోగించుకోగలు గుతాం. నదులు, కాల్వలు, రిజర్వాయర్లు, చెక్‌ డ్యాములు, చెరువులు… ఇలా అన్నింట్లో నిండా నీళ్లుంటే తెలంగాణ వాతావరణమే మారిపో తుంది. వర్షాలు కూడా బాగా కురుస్తాయి. భూగర్భ జలాలు పెరుగుతాయి” అని ముఖ్యమంత్రి వివరించారు.

రాబోయే రెండు నెలల్లో గొలుసుకట్టు చెరువులన్నీ నింపే వ్యూహం ఖరారు చేయాలని, ఏడాదిలోగా అన్ని చెరువులు నింపడానికి అవసరమైన కాల్వల నిర్మాణం చేపట్టాలని, దీనికోసం అవసరమైన నిధులు వెంటనే విడుదల చేస్తామని సీఎం చెప్పారు. వచ్చే ఏడాది జూన్‌ నుంచి కాళేశ్వరం నుంచి పుష్కలంగా నీళ్లు వస్తాయి కాబట్టి, అలా వచ్చిన నీటిని సద్వినియోగం చేసుకోవాలంటే ఈ చెరువుల అనుసంధానం పని పూర్తి కావాలని సీఎం చెప్పారు. ఈ పనిని అత్యంత ముఖ్యమైన పనిగా నీటి పారుదల శాఖ గుర్తించాలని కోరారు. చెరువులను, కట్టు కాలువ, పంట కాల్వలను పునరుద్దరించడంతో పాటు అవి కలకాలం బాగుండేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

గతంలో ఆయకట్టుదారులే కాల్వలు, తూముల మరమ్మత్తులు చేసుకునే వారని, ఎండాకాలంలో చెరువు మట్టిని తోడడం ద్వారా ఎప్పటికప్పుడు పూడిక తీసేవారని చెప్పారు. మళ్లీ ఆ పాతరోజులు రావాలని, దీనికోసం గ్రామాల ప్రజల్లో అవగాహన, చైతన్యం కలిగించాలని’ సీఎం చెప్పారు.

”నేలను విడిచి సాము చేయడం మంచి పద్దతి కాదు. వాస్తవిక దక్పథంతో వ్యవహరిం చాలి. ప్రాధాన్యతలను గుర్తించాలి. వాటి ఆధారంగా పనిచేసుకుపోవాలి. తెలంగాణలో 65 శాతం మంది వ్యవసాయ రంగం మీద ఆధారపడి జీవిస్తున్నారు. వీరే మనకు ప్రధానం. ఇంత వరకు వ్యవసాయాన్ని అప్రాధాన్యతా రంగంగా చూశారు. అది దురదష్టకరం. యూరప్‌, అమెరికా దేశాల్లో రైతుకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తారు. ఉత్పత్తి, ఉత్పాదకత పెంచడానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు. కానీ మన దగ్గర, ముఖ్యంగా సమైక్య పాలనలో రైతులు చాలా దారుణంగా వంచించబడ్డారు. తెలంగాణ వచ్చిన తర్వాత రైతు సంక్షేమం కోసం, వ్యవసాయాభివద్ది కోసం అనేక చర్యలు తీసుకుంటున్నాము. తెలంగాణలో అమలు చేస్తున్న రైతు బంధు కార్యక్రమానికి దేశ వ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయి. ఆర్థిక వేత్తలు అభినందిస్తున్నారు. రైతుబంధు పథకాన్ని ఒక మార్గదర్శకంగా అరవింద్‌ సుబ్రహ్మణ్యం అభివర్ణించారు. వాస్తవిక దక్పథంతో ఆలోచించ బట్టే ఇంత మంచి పథకాల రూపకల్పన జరిగింది” అని ముఖ్యమంత్రి చెప్పారు. ”నీటి పారుదల వ్యవస్థను మెరుగు పర్చడానికి మనం అత్యంత ప్రాధాన్యత ఇచ్చాం. ఇప్పటికే గోదావరి, కష్ణా నదుల్లో మనకున్న వాటాను సంపూర్ణంగా వినియోగించుకొవడానికి వీలుగా నీటి పారుదల ప్రాజెక్టులు నిర్మిస్తున్నాం. ఇంకా ఎక్కడెక్కడ నీటిని సమర్థంగా వినియోగించుకోవడానికి అవకాశం ఉందో గుర్తించండి. అక్కడ అవసరమైన లిఫ్టులు, కెనాల్స్‌, రిజర్వాయర్లు నిర్మించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. తుమ్మిడి హట్టి బ్యారేజి నిర్మాణం చేపట్టాలి. కడెంకు బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ గా ఉండే కుప్టి ప్రాజెక్టుకు వెంటనే టెండర్లు పిలవాలి. దీని ద్వారా కుంటాల జలపాతానికి కూడా నీటి వనరు ఏర్పడుతుంది. కష్ణాలో కూడా కావాల్సినంత నీరు ఉంది. ఈ నీటిని కూడా సమర్థంగా వినియోగించుకునే వ్యూహం అమలు చేయాలి” అని ముఖ్యమంత్రి చెప్పారు.

కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రులు మహమూద్‌ అలీ, కడియం శ్రీహరి, మంత్రి టి. హరీశ్‌ రావు, ఎంపిలు కె. కేశవరావు, బి. వినోద్‌ కుమార్‌, ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్‌ రెడ్డి, మర్రి జనార్థన్‌ రెడ్డి, ఏనుగు రవీందర్‌ రెడ్డి, గువ్వల బాలరాజు, దివాకర్‌ రావు, విప్‌ పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌ శర్మ, సిఎంఓ కార్యదర్శి స్మితా సభర్వాల్‌, నీటి పారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్‌, సీఇలు, ఎస్‌ఇలు పాల్గొన్నారు.

Other Updates