artsతన చిన్నతనంలో మొగ్గతొడిగిన చిత్రకళపట్ల ఆసక్తితో ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఎదుర్కొని, పలువురు, కళా హృదయులు, విజ్ఞుల అండతో ఆర్థిక ఇబ్బందులను సైతం కాలరాచి నగరంలో పెయింటింగ్‌లో డిప్లొమా పూర్తిచేసి, భావస్పోరకమైన బొమ్మలు గీయడంలో ఇతరులెవ్వరూ ఎక్కలేని ఎత్తులకు ఎదిగిన చిత్రకారుడాయన.
1924 జనవరి 7వ తేదీన వరంగల్‌ జిల్లా పెనుగొండలో పుట్టిన శేషగిరిరావు రూపకల్పనచేసిన పోతన, నన్నయ్య, రామదాసు, అన్నమయ్య, వేమన, నాగార్జున, తెలుగుతల్లి, భాగమతి, ఆండాళ్‌ చిత్రాలు ఆయన ప్రతిభావ్యుత్పత్తులకు ఆనవాళ్ళు. ఆయన వేసే రేఖలలో, రంగులలో జీవం తొణికిసలాడుతుంది. అందుకే`ఆయన వేసిన చిత్రాలు పండితులేకాదు, పామరులు చూసినా ఎంతగానో మురిసిపోతారు.

శేషగిరిరావు కేవలం రామాయణగాధను ఆధారం చేసుకుని సుమారు వంద వర్ణచిత్రాలదాకా వేశారు. ఒక్కొక్క చిత్రం ఒక్కో భావానికి పట్టిన అద్దంలాంటిది. ‘‘అశోక వనమున సీత’’, ‘‘బంగారులేడి’’, ‘‘అహల్య శాపవిమోచనం’’, గుహుడు సీతాసమేత రామలక్ష్మణులను నది దాటించడం’’, ‘‘యజ్ఞాశ్వాన్ని లవకుశులు బంధించడం’’లాంటి ఘట్టాలను తన చిత్రాల ద్వారా శేషగిరిరావు చూపరుల కళ్ళకు కట్టారు.

‘‘మహాభారతాన్ని వ్యాసుడు చెబుతుంటే వినాయకుడు లిఖించడం మొదలుకొని యాభై అంశాలపై చిత్రాలను వేశారు. వాటిలో ‘‘పాండవుల వనవాసం’’, ‘‘గీతా బోధన’’, ‘‘విశ్వరూప సందర్శనం’’ ఇత్యా దులు ప్రత్యేకంగా చెప్పుకోదగినవి.

‘‘పోతనకు సీతారాముల సాక్షాత్కారం’’, ‘‘పోతనకు సరస్వతీ సాక్షాత్కారం’’తో ఆరంభించి పది`పదిహేను శ్రీమదాంధ్ర మహాభారత విశేషాలపై వీరు కమనీయమైన చిత్రాలు వేశారు. ‘‘గోపికా వస్త్రాపహరణము’’, ‘‘గోపీకృష్ణ’’ చిత్రాలు బహుజ నాదరణ పొందాయి. ‘‘పోతన చరిత్ర’’పై కూడా వీరి చిత్రం ఆకర్షణీయమైనదే. ఇవికాకుండా ‘‘మను చరిత్ర’’లోని వరూధిని ప్రవరాఖ్యుడు ఉపాఖ్యానం వివరించే బొమ్మలు చూడచక్కగా వేశారు. ‘‘ఆముక్త మాల్యద’’ ఆధారంగా గీసిన ఆండాళ్‌ చిత్రం ‘‘వసు చరిత్ర’’ ఇత్యాది కావ్యాలు. కొన్ని ప్రబంధాలను ఆలంబనంగా చేసుకుని ఎన్నో చక్కని చిత్రాలు రచించారు.

కాళిదాసు మహాకవి ‘‘అభిజ్ఞాన శాకుంతలం’’లోని ముప్పయి`నలభై ముచ్చటైన ఘట్టాలను ఎన్నుకుని వాటికి నీటిరంగులలో రసరమ్యంగా రూపకల్పన చేశారు. ఈ చిత్రాల నేపథ్యంలో ప్రకృతిని ప్రతిబింబించిన తీరు అరుదైనది.

మహాభారత కర్త నన్నయ్య శ్రీమదాంధ్ర మహాభాగవతకవి, భాగవతోత్త ముడు`పోతన ఇంకా పదకర్తలు అన్నమయ్య, వేమన మొదలైన కవిపుంగవులను మనమెవరమూ చూడలేదు. కాని శేషగిరిరావు తన అంతర్నేత్రంతో దర్శించి వారి రూపురేఖలను ఈ చిత్రాల్లో చూపినతీరు ప్రేక్షకులను కన్నార్పకుండా చేస్తుంది.
అలాగే ` తెలుగుతల్లి, ఆచార్య నాగార్జునుడు, దూర్వాస మహాముని, విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, వ్యాసుడు, వాల్మీకి ఇత్యాదుల చిత్రాల్లో ఆయన ప్రదర్శించిన అసాధారణ ప్రజ్ఞ ప్రస్ఫుటమవుతుంది.

ఎవరూ చూడని దేవతామూర్తులను, పురాణ పురుషులను, మహాకవులను మీరెలా రూపకల్పన చేశారని ప్రశ్నిస్తే`‘‘మన వేదాలు, పురాణాలు, ప్రబోధాలు, మతగ్రంథాలు పఠించడంవల్ల కలిగిన జ్ఞానంతో మనోఫలకంపై ఏర్పడిన ఆకృతినే కాన్వాసుపైకి తెచ్చే ప్రయత్నం చేశాను’’ అనేవారు. ‘‘కొన్ని సందర్భాలలో నేను సాధన చేసిన జ్యోతిర్విద్య ఎంతో దోహదం చేసింది. సాధు శ్రీనివాసశాస్త్రి 1952లో నేర్పిన జ్యోతిర్విద్య ద్వారా కంటితో చూడలేని అనేక ఆకృతులను నేను దర్శించాను. జ్యోతిర్విద్యాసాధన విడువకుండా చేయవలసిందే. చిత్రకళలో నేను నిత్యవిద్యార్థిని. అందుకే వృద్ధాప్యం మీదపడినా ఈ కళను విడవకుండా నిరంతరం కృషి చేస్తున్నాను’’ అని వివరించేవారు.

‘‘అదేమిటో మీరు కొన్ని దేవతామూర్తులను నగ్నంగా వేశారని అడిగితే చిత్రకళలో నగ్నత్వం తప్పుకాదు’’ అనేవారు. ‘‘పైగా నగ్నత్వమే వాస్తవమైంది. బ్రహ్మ సృష్టిలో బట్టకట్టి ఎవ్వరూ పుట్టలేదు. పోయేటప్పుడు కూడా బట్ట తొలగిస్తారు. అందుచేత ప్రాచీనకాలంనుంచి చిత్రకళలో నగ్నత్వం ఉంది. ప్రాచీన దేవాలయ శిల్పాలు చూడండి. భగవానుడికి, భక్తికి నిలయమైన గుడిగోపురాలపై నగ్న చిత్రాలు ఉన్నాయి. ఒకవేళ దుస్తులు ధరించినా అందులోంచి అందాలు కనిపించేలాగా ఆ మూర్తులను తీర్చిదిద్దిన వైనం ఈనాటిది కాదు కదా! ఆధునిక ప్రపంచంలోను నగ్నత్వం దోషంకాదు. అయితే దేవతామూర్తుల నగ్నత్వం సంప్రదాయ లక్ష్మణరేఖను దాటి ఎవరి మనోభావాలను దెబ్బతీయకుండా ఉంటే మంచిదని సోదాహరణంగా చెప్పేవారు.

దేవతామూర్తుల రూపకల్పనలో రవివర్మను ఆదర్శంగా తీసుకున్నారా? అని ప్రశ్నిస్తే`కాదనేవారు. రవివర్మ చిత్రాలలోని వేషభూషణాలు, వస్తువు, వాతావరణం, అలంకరణలు అభ్యంతరకర మైనవనేవారు. ఆయా కాలానుగుణమైన కట్టూ బొట్టూ, అలంకారాలు, నమూనాలు చిత్రాలలో ప్రతిబింబించాలి. ఈ దృష్ట్యా అజంతా చిత్రాలే ప్రామాణికమైనవనే అభిప్రాయాన్ని శేషగిరిరావు వ్యక్తం చేసేవారు.

ఇవేకాకుండా సమకాలీన సంఘటనలపై కూడా శేషగిరిరావు ఆలోచనాత్మకమైన చిత్రాలు వేశారు. అలాంటి వాటిలో ‘‘సంతాపం’’, ‘‘క్షామము’’, ‘‘కోరికలు’’, ‘‘మరణం’’, ‘‘పూసేచెట్టు’’, ‘‘రాయిగిరి రాళ్ళు’’, ‘‘వేళ్ళు’’, ‘‘పూలు’’, ‘‘లతలు’’, ‘‘కోళ్ళు’’, ‘‘నెమళ్ళు’’ మొదలగునవెన్నో సుందరచిత్రాలు గణించదగినవి. ఇంకా ఎన్నో డ్రాయింగ్స్‌ గీశారు. అనేక గ్రంథాలకు ముఖ చిత్రాలు వేశారు. నిజాం నిరంకుశపాలనకు వ్యతిరేకంగా విద్యార్థి దశలోనే ఎన్నెన్నో కార్టూనులు వేశారు. కాకిపడగలు, కాకతీయ శిల్ప విన్నాణము మొదలగు అంశాలపై ఎంతో పరిశోధనచేసి, కొత్తకోణం నుంచి చిత్ర రచనలు చేశారు.

నిజానికి సుప్రసిద్ధ రచయిత, కీర్తిశేషులు వట్టికోట ఆళ్వారుస్వామి దోహదం గనుక లేకపోతే మెహదీ నవాజ్‌జంగ్‌తో పరిచయమే ఏర్పడేదికాదు. ఆ పరిచయభాగ్యం లభించకపోతే మెట్రిక్యులేషన్‌ ముగించిన తర్వాత గుడ్డిగా, వెనకాముందు ఆలోచించకుండా హైదరాబాద్‌ నగరం చేరుకున్న శేషగిరిరావు జీవితం మరొకలా ఉండేది. కాని ఇలా రంగురంగుల రమణీయచిత్రాల సృష్టికర్తగా,తనకంటూ ఒక వినూత్న బాణీని రూపుదిద్దుకున్న అపురూప చిత్రకారుడుగా ఎదిగేవాడు కాదేమో! శేషగిరిరావు సమస్యే తన సమస్యగా పరిగణించిన వట్టికోట ఆళ్వారుస్వామి నిరంతర కృషి ఫలితంగానే నవాజ్‌జంగ్‌ శేషగిరిరావును చేరదీసి స్కూల్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌లో చేర్పించి ఐదేండ్లపాటు చిత్రకళ చెప్పించాడు. ఫస్ట్‌క్లాస్‌లో ఫస్ట్‌గా డిప్లొమా పరీక్షలో ఉత్తీర్ణుడుకావడంతో నవాజ్‌జంగ్‌ ఒక యేడాదిపాటు చిత్రకళలో శిక్షణకోసం ‘‘శాంతినికేతనం’’ పంపించారు.

చిన్ననాట దీనదయాళ్‌నాయుడు గీసే చిత్రాల ప్రభావానికిలోనై, ఆ తర్వాత మజూరుద్దీన్‌ నాటకాల పరదాలపై గీసే వర్ణచిత్రాలతో ప్రేరేపితమై, పిదప అజంతా చిత్రాల ప్రతులు రూపొందించిన జలాలుద్దీన్‌వద్ద అభ్యాసం చేసిన పద్ధతికి, శాంతినికేతనంలో నందన్‌లాల్‌ బోస్‌, అవనీంద్రనాథ్‌ ఠాగూర్‌ల ముద్రపడిరది. వీటన్నింటి కలయికవల్ల శేషగిరిరావులో తనదైన ఒక విశిష్ట బాణీ అవతరించింది.

‘‘కేవలం కల్పన కథలు కృత్రిమ రత్నములు’’ అన్న అల్లసాని పలుకులను దృష్టిలో ఉంచుకుని తన చిత్రకళా జీవనయాత్రను శేషగిరిరావు కొనసాగించారు. అందుచేత వాస్తవికతకు ప్రాధాన్యమిచ్చి చూపరులను ఆకర్షించడానికి వీలుగా కొంత మసాలా జతజేశారు. సంగీత విద్వాంసుడు కోకిల పాటను యధాతథంగా వినిపిస్తే ఆకట్టుకోదని, ఆ స్వరాన్ని మెరుగుపరిచి కర్ణపేయంగా ఎలా వినిపిస్తాడో, ఏ కళ అయినా వాస్తవాన్ని విస్మరించకుండా ఆకర్షణీయమైన తరహాలో అందించాలనేది ఆయన మతం.

ప్రకృతి అందాన్ని చూసి ప్రేరణపొందినప్పుడు, సమకాలీన జీవితంలో అనేక సంఘటనలుచూసి ప్రభావితుడయినప్పుడు కూడా తన చిత్రాలను కేవలం ఛాయాచిత్రాల మాదిరిగా కాకుండా ఆలోచనకు పురికొలిపేవిధంగా, సృజనాత్మక కళారూపాలుగా తీర్చిదిద్దాననేవారు.

చారిత్రక అంశాలపై చిత్రం వేసినప్పుడు ఆనాటి కట్టూబొట్టూ, అప్పటి అలంకారాలు, సంప్రదాయాలు ప్రతిబింబించాలనేది ఆయన పద్ధతి.

పౌరాణిక సంబంధమైన చిత్రాలు వేసినప్పుడు కేవలం ఊహాశక్తికే రెక్కలు కట్టకుండా, ఆయా అంశాలు గ్రంథాలలో ఎలా పొందుపరచడం జరిగిందో పరిశీలించి, వాటిని దగ్గరగా చిత్రించేవారు.

డ్రాయింగ్స్‌ వేయడంలో చేయి తిరిగిన చిత్రకారుడు కాబట్టి శేషగిరిరావు నీటిరంగుల చిత్రాలు వేసినా, తైలవర్ణ చిత్రాలు గీసినా పలువురిని ఆకట్టుకున్నాయి. వాష్‌ పద్ధతిలో చిత్రాలు వేయడంలో వీరు సిద్ధహస్తులు. టెంపెరా రీతిలోను వీరు అనేక చిత్రాలు వేశారు.

నీటిరంగులలో చైనా, జపాన్‌ సరళిలో కుంచె నడిపి ‘‘ఎక్వా టెక్నిక్‌’’ను శేషగిరిరావు తెలుగు చిత్రకళలో ప్రవేశపెట్టారు. ఈ టెక్నిక్‌లో కోతిని వేస్తే దాని బొచ్చు నిజంగా బొమ్మలా కనిపిస్తుంది. కుందేలైనా, ఉడతైనా, పక్షుల ఈకలైనా ఈ పద్ధతిలో చక్కగా ద్యోతకమవుతాయి. చెట్టుపై బెరడు, రాయి దళసరితనం, ఇత్యాదులు కూడా ఈ టెక్నిక్‌తో వేసే చిత్రాలలో అమోఘంగా అమరుతాయి. అయితే కుంచె వేగంగా నడపడంతో సాఫీగా చేయి సాగితే ఈ పద్ధతి చిత్రాలు గీయడం సాధ్యం లేదా ఈపద్ధతి అనితరసాధ్యం.

ఇకపోతే ప్రెస్‌కో కుడ్యచిత్రాలు వేయడంలోను శేషగిరిరావు ఒకానొక విశిష్ఠ ధోరణి. ఈ బాణీలో ఈయన శిక్షణ కూడా పొందారు. అయితే ఆ మధ్య అందుబాటులోకి వచ్చిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆధారంగా చేసుకుని ఒకానొక అపురూప ధోరణిలో చిత్రాలు వేశారు. బెక్‌లైట్‌ హైలమ్‌వారు ఉత్పత్తిచేసిన ‘‘హెరిటేజ్‌్‌ గ్రాన్యుల్స్‌’’తో కూడా చిత్రాలు వేసి ప్రయోగాలు చేసి విజయవంతమయ్యారు. అమీర్‌పేట్‌లో హుడా భవన సముదాయం మైత్రీవనంలో 19 అడుగుల పొడవు, ఎనిమిది అడుగుల ఎత్తుతో ‘‘విశ్వరూప సందర్శనం’’, ‘‘యజ్ఞాశ్వబంధం’’, కుడ్య చిత్రాలు తొట్టదొలుతవేసి తన ప్రత్యేకతను చాటారు. ఆ తర్వాత భారతీయ విద్యాభవన్‌ 35/10 అడుగల నిడివిగల భారతీయ ఐహిక వారసత్వానికి, ఆధునిక భారతదేశంలో ప్రగతిని ప్రతిబింబిస్తూ కుడ్యచిత్రాలు వేశారు. ఆ పిదప సి.ఐ.డి. కార్యాలయ భవనంపై ప్రత్యేక ధోరణిలో 43 అడుగుల పొడవు, 6 అడుగుల వెడల్పు చిత్రాన్ని వేశారు. ‘వీణాపాణి’ చిత్రం హెరిటేజ్‌వారు ఉత్పత్తిచేస్తున్న ఇసుక రేణువులతో ప్రయోగం చేశారు. డబ్బున్నవారు కేవలం రంగులపొందికకోసం మాత్రమే తమ భవనాలలో హెరిటేజ్‌ గ్రాన్యూల్స్‌వాడకుండా, సృజనాత్మక చిత్రకారులతో ఇంటిముందు, లేదా లోపల చూడచక్కని చిత్రాలు వేయించుకునే అభిరుచిని పెంచడానికి శేషగిరిరావు ఎంతగానో పాటుపడ్డారు.

తన ఆరోగ్యం చెడిపోతున్న దశలోనూ హైదరాబాద్‌` సికిందరాబాద్‌ జంట జగనరాల పరిసరాలలోగల శిలల అమరికను సృజనాత్మకంగా అద్దంపట్టే చిత్రాలెన్నింటినో ఆయన యువ చిత్రకారులతో పోటీపడుతూ గీస్తూనే కాలం గడిపారు. యువ చిత్రకారులు వృద్ధిలోకి రావా లంటే బుద్దిగా అభ్యాసం చేయాలనేవారు. సాధన, ఏకాగ్రత వర్ధమాన చిత్రకారులకు ఎంతో అవసరం. కృషి లేకుండా అప్పటికప్పుడు ఫలితాలు ఆశించడం హాస్యాస్పదమనేవారు. ఇలా ఖచ్ఛితమైన అభిప్రాయాలుగల కొండపల్లి శేషగిరిరావు 2012 జూలై 26వ తేదీన తనువు చాలించారు.

Other Updates