తెలంగాణ
దక్కను పీఠభూమిలో భాగం కాబట్టి ఇక్కడి సమతల భూమి మానవ వికాసానికి, రాజకీయ వికాసానికి ఆలవాలమైంది. ఆయా రాజవంశాలు కట్టించిన కోటలు, దేవాలయాలు ఇప్పటికీ వాస్తు శిల్ప కళలతో అలరారుతున్నాయి. దక్షిణభారతదేశంలో పెద్దవైన గోదావరి, కృష్ణా నదులు కూడా తెలంగాణలోని పర్వత సానువులను చీల్చుకొని ప్రవహిస్తున్నాయి కాబట్టి ప్రకృతి అందాలకు, పర్యావరణ పర్యాటకానికి కూడా తెలంగాణ నెలవైంది. ఆయా పర్యాటక స్థలాలను ఆరేడు మార్గాలద్వారా ఎలా దర్శించవచ్చో వీక్షణం చేద్దాం.
హైదరాబాద్-కుంటల మార్గంలో..
హైదరాబాదుకు ఉత్తరంగా సుమారు 110 కి.మీ. దూరంలో ఉన్న మెదక్‌లో 1914లో పోస్నేట్ అనే క్రైస్తవ మత సన్యాసి కరువు నివారణా చర్యల్లో భాగంగా కట్టించిన చర్చి చూడదగింది. చర్చికి ఎదురుగా ఉన్న మధ్యయుగాలనాటి దుర్గం కోట గోడలు ఎక్కి చూడవలసినవి. మెదక్ సమీపంలో పారే మంజీరానది మీద 1922లో కట్టిన ప్రాజెక్టు, దానిని ఆనుకొని ఉన్న వన్యప్రాణుల ఉద్యానవనం, మంజీర ఏడుపాయలుగా చీలి పారే చోట ఉన్న అమ్మవారి ఆలయం సందర్శించదగినవి.
పోచారం ప్రాజెక్టుకు కొన్ని కి.మీ.దూరంలోనే మంజీరా నది మీదనే 1920ల్లో కట్టిన నిజాంసాగర్ డ్యామ్‌లో నిలిచిన నీళ్ళల్లో చేసే బోటింగ్ అమితానందాన్నిస్తుంది. ఈ ప్రాజెక్టునుంచి కామారెడ్డి వైపు వస్తున్నప్పుడు తాడ్వాయినుంచి పది కిలోమీటర్ల దూరంలో పారే సంతాయిపేట వాగు పాయల మధ్యలో కట్టిన వెయ్యేళ్లనాటి శిల్ప కళా శోభితమైన ఆలయం, చెరువు, ప్రవాహ నడక కొత్త అనుభూతులనిస్తాయి.
కామారెడ్డి నుంచి ఉత్తరదిశగా 44వ జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్నప్పుడు డిచ్‌పల్లిలో క్రీ.శ. 1460 ప్రాంతంలో కట్టిన రామాలయం వాస్తు నైపుణ్యానికి, శృంగార శిల్పాలకు పేరు గాంచింది. డిచ్‌పల్లినుంచి కొన్ని కి.మీ. ప్రయాణం తరువాత పోచంపాడ్ ప్రాంతంలో కట్టిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు సందర్శించవచ్చు. కొయ్యబొమ్మలు ఔత్సాహికులను అలరించేవిగా ఉన్నాయి. నిర్మల్‌నుంచి బాసర మార్గంలో సుమారు 20 కి.మీ. దూరంలో పచ్చని లోయల మధ్య పారే వాగు ఒడ్డునున్న వెయ్యేళ్ళ కిందటి పాపన్నగుడి ప్రశాంతతకు, పరిసరాల రమణీయతకు పెట్టింది పేరు. గోదావరి ఎడమ ఒడ్డున నెలవైన బాసర జ్ఞాన సరస్వతీ దేవాలయం ఇక్కడే గోదావరిని తెలంగాణలోకి ఆహ్వానిస్తుంది. దక్కను రాష్ట్రాల ప్రజలు బాసరలోనే తమ పిల్లలకు విద్యాభ్యాసం చేయిస్తారు. నిర్మల్‌కు తూర్పువైపున జిన్నారం అడవుల్లో పర్యాటకశాఖవారు జిన్నారంలో, కడెంలో వసతి గృహాలు, అటవీ జంతువుల సందర్శన, పడవ విహారం ఏర్పాట్లు చేశారు. నిర్మల్‌కు ఉత్తరంగా ఉన్న కుంటాల జలపాతంతోపాటు చుట్టూ చుట్టుపక్కల పొచ్చెర, ఘనపూర్, కోనకాయి, గాడిదగుండు, కోరెటికల్ ఇతర జలపాతాలనూ సందర్శించి ఆనందించవచ్చు.
హైదరాబాద్-కాళేశ్వరం మార్గంలో..
హైదరాబాద్‌నుంచి సుమారు వంద కి.మీ. దూరంలో ఉన్న సిద్ధిపేట పరిసరాల్లో ఉన్న కోటిలింగేశ్వరాలయం చూసి, సమీపంలో ఉన్న కోమటి చెరువులో పడవ ప్రయాణం చేసి, ఆ తరువాత రహదారిపైన కొన్ని కి.మీ. ప్రయాణం తరువాత కనిపించే కొమురవెల్లి మల్లన్న గుహాలయాన్ని దర్శించుకొని కరీంనగర్ వెళ్దాం.
కరీంనగర్‌కు పడమటివైపున ఎలగందులకోటలో కొంత ట్రెక్కింగ్ చేసి, అక్కడినుంచి వేములవాడ వెళ్ళి అక్కడ వెయ్యేళ్ళ కిందట వేముల వాడ చాళుక్యరాజులు కట్టించిన రాజరాజేశ్వరాలయం, భీమన్నగుడి, బద్దిపోచమ్మగుడి చూద్దాం. తెలంగాణ హిందువుల్లో ఎములాడ రాజన్నను దర్శించనివారు ఎవరూ లేరంటే అతిశయోక్తి కాదు. కరీంనగర్‌కు 40 కి.మీ. దూరంలో ఉన్న పెద్దపల్లి సమీపంలో సుమారు 15 కి.మీ. పొడవునా విస్తరించిన రామగిరి ఖిల్లా అనేక రకాల పర్యాటక విశేషాలకు నెలవు. గిరిపైనున్న కోటగోడలు ప్రాంగణాలు, అంతఃపురాలు, ఆలయాలు, మంటపాలు, జైళ్ళు, ఫిరంగులు, ఏటవాలు ప్రదేశాల్లో ఉన్న జలపాతాలు, ఏకాంత ప్రదేశాల్లో గుహశిల్పాలు, చిత్రాలు-ఇలా ఎన్నో విశేషాలను ఇప్పటికీ స్థానికులు మాత్రమే శ్రావణ (ఆగస్టు) మాసంలో దర్శిస్తున్నారు. రామగిరికి అల్లంత దూరంలో ఉన్న మంథనిలో శీలేశ్వర, సిద్ధేశ్వర ఆలయాలను చూసుకొని గోదావరికి వెళ్లి ఒడ్డునే ఉన్న 12వ శతాబ్దంనాటి గౌతమేశ్వర ఆలయ వాస్తుశిల్ప సౌందర్యాలను ఆస్వాదించండి. మంథని బ్రాహ్మణ ప్రధానమైన గోదావరి తీరస్థ పట్టణం కాబట్టి ఇక్కడ పెద్దలకు పిండప్రదానాలు చేస్తారు.
మంథని గౌతమేశ్వరాలయం దగ్గరినుంచి పడవలో వివహరిస్తూ సుమారు మూడు కి.మీ. దూరంలో ఉన్న ఎల్ మడుగు (లంజమడుగు) చేరుకోవచ్చు. ఆ మడుగు మొసళ్ళ పెంపక కేంద్రం. మడుగు ఎడమ ఒడ్డున మంచిర్యాల జిల్లా పరిధిలో రెండు గుహాలయాల సముదాయాలున్నాయి. సముద్రతీర ప్రకృతిని మరిపించే ఎల్ మడుగులో ఇప్పుడు అటవీశాఖ వారు పడవ నడుపుతున్నారు. మంథనినుంచి సుమారు 50 కి.మీ. దూరం ఆహ్లాదకరమైన అడవులగుండా ప్రయాణించి త్రిలింగ క్షేత్రమైన కాళేశ్వరం చేరుకోవచ్చు. ఇక్కడి ప్రధానాలయంలో ఒకే పానపట్టు మీద ముక్తికాళేశ్వర పేరున రెండు శివలింగాలున్నాయి. ముక్తేశ్వర లింగం మీద పోసే అభిషేక జలం దాని మధ్యలో ఉన్న రంధ్రంగుండా గోదావరి ప్రాణహిత నదుల సంగమ స్థానానికి పారి ఆ ప్రాంతాన్ని త్రివేణి సంగమం చేస్తుంది.
హైదరాబాద్-మల్లూరు మార్గంలో..
హైదరాబాద్‌నుంచి 45 కి.మీ. దూరంలో ఉన్న భువనగిరిలో ప్రపంచంలో పెద్దదైన స్నానబండ ఉంది. దానిమీద 3వేల సంవత్సరాల క్రితంనుంచి ఐదువందల సంవత్సరాల క్రిందటి వరకు కట్టిన కట్టడాలు న్నాయి. భువనగిరికి కూతవేటు దూరంలో ఉన్న యాదగిరి (యాదాద్రి) వెయ్యేళ్ళ చరిత్ర గలిగి తెలంగాణ తిరుమలగా వృద్ధి చెందుతున్నది. ఇక్కడికి సుమారు 30కి.మీ.దూరంలో ఉన్న కొలనుపాక అద్భుత శిల్పకళతో ఒప్పారుతున్న జైనాలయాలను, సోమేశ్వరాలయాన్ని చూడవచ్చు.
హైదరాబాద్-పాపికొండలు మార్గంలో..
హైదరాబాద్-భద్రాచలం మార్గంలో హైదరాబాద్‌నుంచి 40 కి.మీ. దూరంలో వచ్చే కోయలగూడెం నుంచి కుడివైపు పది కి.మీ. ప్రయాణించి రాచకొండను చేరుకోవచ్చు. ఇక్కడి గుట్టల్లో కొత్త రాతియుగం, బృహత్ శిలా యుగపు చిత్రలేఖనాలతోపాటు 14, 15 శతాబ్దాలలో తెలంగాణను పాలించిన రేచర్ల పద్మనాయక రాజులు కట్టించిన పదులకొద్ది దేవాల యాలు, కోటగోడలు, తవ్వించిన దిగుడు బావులు ఇప్పటికీ శిథిల సౌందర్యంతో వెలుగొందుతున్నాయి. భద్రాచలం రహదారిలోనే వచ్చే సూర్యాపేటకు కొంచెం ముందున్న పిల్లలమర్రి 800 ఏళ్ళ కిందట కాకతీయుల సామంతులైన రేచర్ల రెడ్లకు రాజధాని. ఆ రాజులు కట్టించిన ఎరకేశ్వర, నామేశ్వర దేవాలయాలు శిల్పకళాశోభితాలు. ప్రధాన ఆలయం మంటప దూలాలపై చిత్రించిన రామరావణ యుద్ధం, క్షీరసాగర మథనం చిత్రలేఖనాలు చాలా అరుదైనవి.
భద్రాచలం చేరడానికి ముందు ఎడమవైపు కొన్ని కి.మీ. దూరంలోనే కిన్నెరసాని ప్రాజెక్టు ఉంది. ఆ ప్రాజెక్టు మధ్యలో ఉన్న పచ్చని ద్వీపాల అందాలను చూస్తూ పడవల్లో ప్రయాణించడం మధురానుభూతినిస్తుంది.
భద్రగిరి చుట్టూ మూడువైపులా హొయలు పోతూ పారుతున్న గోదావరిలో స్నానం చేసి, మూడున్నర శతాబ్దాల కిందట భక్త రామదాసుచే నిర్మించబడిన శ్రీ సీతా రామాలయంలో కోదండ రామ స్వామిని దర్శించుకుని, ఇక్కడికి 40 కి.మీ. దూరంలో సీలేరు గోదావరితో సంగమించే చోట ఉన్న సీతారాములవార్ల పర్ణ శాలను, అక్కడి అందమైన ప్రకృతిని చూద్దాం. భద్రాచలానికి తూర్పువైపున 40 కి.మీ. దూరం ప్రయాణించి కుకునూర్-పేరంటాలపల్లి నుంచి గోదావరిలో పాపికొండల మధ్య చేసే పడవ ప్రయాణం దేశంలోనే పేరుగాంచిన పర్యటన.
హైదరాబాద్-నల్లమల మార్గంలో..
హైదరాబాద్-శ్రీశైలం మార్గంలో 130 కి.మీ. ప్రయాణం తరువాత నల్లమల అడవులు ప్రారంభమవుతాయి. ప్రారంభ క్షేత్రం ఉమామ హేశ్వరం ప్రకృతికి పరాకాష్టగా నిలిచే ప్రశాంత వాతావరణంలో 14వ శతాబ్దంలో రేచర్ల పద్మనాయకరాజు మాదానాయునిచే నిర్మింపబడిన గుహాలయాన్ని దర్శించుకుని, మన్ననూరు మీదుగా 24 కి.మీ. దూరం ప్రయణించి లొద్ది చేసుకుందాం. వేయి అడుగుల లోతున్న లొద్దిలో వంద అడుగుల పైనుంచి దూకుతున్న జలపాతంకింద గుండంలో ఈత కొట్టి సమీపంలో వేయిన్నర సంవత్సరాల కిందనే కట్టించిన గుహాలయంలో ‘మల్లయ్య’స్వామిని దర్శించుకుందాం.
లొద్దినుంచి 8 కి.మీ.దూరంలో ఉన్న ఫరహాబాద్‌గేట్‌నుంచి అటవీశాఖ వారి జీపులో టైగర్ సఫారీకి వెళ్తూ దట్టమైన అడవుల్లో కనిపించే జంతువులను చూస్తూ వేయి అడుగుల ఎత్తైన కొండ అంచుకు వెళ్ళి అక్కడి వ్యూపాయింట్ నుంచి పచ్చనిలోయ అందాలు చూస్తూ పిల్లగాలులను ఆస్వాదించవచ్చు. ఫరహాబాద్ నుంచి రాంపూర్ చౌరస్తా మీదుగా 12 కి.మీ. దూరం ప్రయాణించి చైత్ర పౌర్ణమినాడు జరిగే చెంచు గిరిజనుల సలేశ్వరం జాతరను చూడవచ్చు. ఇక్కడ వేయి అడుగుల లోతైన లోయలో 170 అడుగులు ఎత్తు నుంచి దూకే జలపాతం కింద స్నానం చేసి సమీపపు వేయిన్నర ఏండ్లకిందటి గుహాలయాలను దర్శించవచ్చు.
ఫరహాబాద్‌నుంచి 15 కి.మీ.దూరంలో ఉన్న అరుదైన ఆహ్లాదకరమైన మల్లెలతీర్థం జలపాతాన్ని వటవర్లపల్లి మీదుగా ప్రయాణించి చేరుకోవచ్చు. 300 అడుగుల లోయలో వంద అడుగుల ఎత్తునుంచి దూకుతున్న ఈ జలపాతం ఎండాకాలంలో కూడా ఎండిపోకపోవడం విశేషం.
వటవడ్లపల్లినుంచి పది కి.మీ. ప్రయాణించి కుడివైపు కనిపించే అక్కమహదేవి గుహల మలుపునుంచి 6 కి.మీ. నడక నడిచి ఆ గుహలను చేరుకోవచ్చు. లేదంటే శ్రీశైలం నుంచి రోప్‌వేలో ప్రయాణించి పాతాళగంగలో దిగి, అక్కడినుంచి పర్యాటకశాఖ నడిపే పడవల్లో 22 కి.మీ. దూరం శ్రీశైలం ప్రాజెక్టు బ్యాక్‌వాటర్‌లో ప్రయాణించి చేరుకోవచ్చు. ఈ గుహల్లో 12వ శతాబ్దంలో అక్కమహాదేవి తపస్సు చేసి శివుణ్ణి ప్రత్యక్షం చేసుకున్నది. ఆమె పూజించిన శివలింగాన్ని గుహలో 108 అడుగులు నడిచి చేరుకోవచ్చు. గుహపైనున్న ఏకశిలాతోరణం ప్రపంచంలో పెద్దకోటల్లో ఒకటి. సమీపంలో ఉన్న కదళీవనం, దత్తాలయ ఆశ్రమాలను పుట్టిలో చేరుకోవచ్చు. సమీపపు ఆదిమానవ చిత్రాలను ఆసక్తిగలవారు దర్శించవచ్చు.
హైదరాబాద్-ఆలంపూర్ మార్గంలో..
హైదరాబాద్-బెంగళూరు రహదారిలో 200 కి.మీ. దూరం ప్రయాణించిన తరువాత వచ్చే కృష్ణానది మధ్యలో ఒక ద్వీపం మీద గద్వాల సంస్థానపు రాజుల కోటగోడలు, మధ్యలో రామాలయం చూడదగి నవి. వీటిని కృష్ణా నీటిలో పుట్టిల్లో ప్రయాణించి చేరుకోవడం ఆహ్లాదాన్నిస్తుంది. కృష్ణా ఆవలి తీరంలో 16వ శతాబ్దంనాటి బీచుపల్లి ఆంజనేయస్వామి ఆలయం మహిమాన్వితమైనదిగా చెప్తారు. కృష్ణదాటి తుంగభద్ర/కర్నూలువైపు ప్రయాణించి ఎడమవైపు తీసుకుని ఆలంపూర్‌లో ఉన్న అత్యంత ప్రాచీనమైన (7వ శతాబ్దంనాటి) నవ బ్రహ్మ ఆలయాలను చూసి, తుంగభద్ర ప్రాజెక్టులో పడవ ప్రయాణం చేయవచ్చు.
కృష్ణానది దగ్గరి పెబ్బేరు నుంచే ఎడమవైపు ప్రయాణించి 17వ శతాబ్దంలో వనపర్తి సంస్థానపు రాజులు కట్టించిన శ్రీరంగాపురం ఆలయాన్ని, దానిచుట్టూ పరివేష్టితమైన తటాకాన్ని చూసి వెల్గొండ మార్గంలో వచ్చే జటప్రోలు, కొల్లాపూర్‌లలో కొల్లాపూర్ ప్రభువులు కట్టించిన 16, 17 శతాబ్దాలనాటి ఆలయాలను, వాటి వాస్తు కళా నైపుణ్యాలను కీర్తిస్తూ, కొల్లాపూర్‌కు పది కిలో మీటర్ల దూరంలో కృష్ణాతీరంలో ఉన్న సోమశిల దగ్గర నదీ స్నానం చేసి వచ్చి ఒడ్డున ద్వాదశ జ్యోతిర్లింగ ఆలయాలను దర్శించి వెయ్యేళ్ళనాటి శిల్ప కళా నైపుణ్యాలను వేనోళ్ళ కీర్తించవచ్చు. సోమశిలనుంచి శ్రీశైలం వరకు శ్రీశైలం ప్రాజెక్టు బ్యాక్‌వాటర్‌లో బోటు విహారం చేయవచ్చు. ఓపికున్న వారు సమీపంలో ఉన్న అమరగిరిపై ఆదిమానవ చిత్రాలు చూడొచ్చు.
హైదరాబాద్-అనంతగిరి
హైదరాబాద్‌కు సుమారు 70 కి.మీ. దూరంలో వికారాబాద్ జిల్లాలో ఉన్న అనంతగిరి కొండలు పచ్చని అడవులు, లోయలు, చెరువులతో శోభిల్లుతున్నాయి. ఈ కొండలపైన 400 ఏళ్ళ క్రితం కట్టిన అనంత పద్మనాభస్వామి, నరసింహాస్వామి గుహాలయాలున్నా యి. ఇక్కడున్న నీటిగుండం, పాలగుండాల నీటికి కుష్ఠువ్యాధిని నివారించే శక్తి కలదని గుర్తించి గత శతాబ్దంలోనే ఇక్కడ ఆనాటి నిజాం ప్రభువు కుష్ఠు నివారణా కేంద్రాన్ని కట్టించాడు. గత దశాబ్దంలో పర్యాటకశాఖ ఇక్కడ వ్యాలీవ్యూ వసతి గదులను, రెస్టారెంట్‌ను కట్టించింది.
హైదరాబాద్-నాగార్జునసాగర్..
తెలంగాణలో నాగార్జునసాగర్ చాలా పేరొందిన పర్యాటక కేంద్రం. ఇక్కడ కృష్ణానది పై కట్టిన డ్యామ్ ప్రపంచంలోని శిల్ప నిర్మిత ప్రాంతాల్లో పెద్ద ప్రాజెక్టు. మధ్యలో ద్వీపం మీద పురావస్తు మ్యూజియాన్ని పడవలో ప్రయాణించి చూడడం ఆహ్లాదాన్నిస్తుంది. సమీపంలో 275 ఎకరాల్లో బుద్ధవనం ప్రాజెక్టును అభివృద్ధి చేస్తున్నారు. ఇక్కడ ప్రపంచంలోని ప్రధాన బుద్ధ స్థూపాల ప్రతిరూపాలు, శిల్పాలు, బౌద్ధజ్ఞాన శిల్పాలు, అష్టాంగమాడ, పార్క్ అలరిస్తాయి. సమీపంలోని నెల్లుట్ల వాచ్ టవర్‌నెక్కి కృష్ణానది, సాగర్, అటవీ జంతుజాల అందాలు చూడవచ్చు.
ఇక హైదరాబాద్‌లోని చార్మినార్, గోల్కొండ కోట, కుతుబ్‌షాహి సమాధులు (టూంబ్స్), పైగా టూంబ్, మక్కా మసీదు, చౌమొహల్లా ప్యాలెస్, ఫలక్‌నుమా ప్యాలెస్, సాలార్‌జంగ్ మ్యూజియం, గత 4, 5 శతాబ్దాల కిందటి మహమ్మదీయ వాస్తు నైపుణ్యాలకు నిదర్శనాలుగా అలరించగా, హుస్సేన్‌సాగర్, దుర్గం చెరువు, సరూర్‌నగర్ చెరువు, నెహ్రూ జంతు ప్రదర్శనశాల, కాసుబ్రహ్మానందరెడ్డి పార్క్, వెంగళ్రావు పార్కు, రామోజీ ఫిలింసిటీ, హరిణ వనస్థలి పార్కు, చిలుకూరు పార్క్, పర్యావరణ పర్యాటక అనుభూతులను పంచేవిగా ఉన్నాయి. ఇలా ఒక సముద్రతీర (బీచ్) పర్యాటకం తప్ప అన్నిరకాల పర్యాటక వనరులు తెలంగాణలో అందుబాటులో వున్నాయి. ఇంకా కూడా కొన్ని పర్యాటక స్థలాలు అందుబాటులోకి రావలసి వుంది.
డా|| ద్యావనపల్లి సత్యనారాయణ