bhagirathaహైదరాబాద్‌ నగరవాసులకు పట్టణ భగీరథ ఫలాలు అందుబాటులోకి వచ్చాయి. 12 రిజర్వాయర్లు సిద్ధంగా ఉండగా మొదటి విడతగా గోపన్‌పల్లి, నలగండ్ల, కేపీహెచ్‌బి ఫేజ్‌-4, హుడా మియాపూర్‌ ప్రాంతాల్లోని రిజర్వాయర్లను పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు అరికెపుడి గాంధీ, మాధవరం కృష్ణారావు, డిప్యూటీ మేయర్‌ బాబా ఫసియుద్దీన్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ… సీఎం కేసీఆర్‌ పిలుపు మేరకు అనుకున్న దాని కంటే ముందే పనులు పూర్తి చేసిన అధికారులకు, కాంట్రాక్టర్లకు, సహకరించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. నగరంలో నీటి సమస్య పరిష్కరించడాన్ని సవాలుగా తీసుకున్నాం. ప్రతి మనిషికి 150 లీటర్ల నీరు ఇవ్వడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. రికార్డు సమయంలో రిజర్వాయర్ల నిర్మాణం పూర్తి చేస్తున్నాం. ఆగస్టు, సెప్టెంబర్‌ వరకు రిజర్వాయర్లన్నీ పూర్తి చేస్తాం. హైదరాబాద్‌లో సంమృద్ధిగా వర్షాలు పడితే ప్రతి రోజు నీటి సరఫరా చేస్తామన్నారు.

ఇప్పటికే నగరంలో 160 బస్తీల్లో ప్రతిరోజు నీరు అందిస్తున్నాం. మిషన్‌ భగీరథ ఫలాలు హైదరాబాద్‌కు అందిస్తున్నాం. సమైక్య పాలనలో ఎండాకాలం వచ్చిందంటే హైదరాబాద్‌లో కూడా పవర్‌కట్‌, తాగునీటి సమస్య ఉండేది. ఇప్పుడు రెప్పపాటు కోతలు లేకుండా కరెంటు ఇవ్వగలుగుతున్నాం. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో సమస్యను పరిష్కరించాం. సమగ్రమైన ప్రణాళికతో సీఎం కేసీఆర్‌ పనిచేస్తున్నారు. హైదరాబాద్‌లో అద్భుతమైన శాంతి భద్రతలు ఉన్నాయి. రాబోయే రోజుల్లో రహదారులు, మూసీ అభివృద్ధి చేయ బోతున్నాం. రూ. 1900 కోట్లతో 1800 కి.మీ పైపులైన్లు నిర్మిస్తున్నాం. హైదరాబాద్‌లో జీవన ప్రమాణాలు పెంచేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా కషి చేస్తుంది. హైదరాబాద్‌ అన్ని రంగాల్లో సర్వతోముఖాభివృద్ధి సాధించేందుకు సీఎం కేసీఆర్‌ అహర్నిశలు కృషి చేస్తున్నారు. అందరూ కలిసికట్టుగా ముందుకు వెళ్లాలి. ప్రతి ఒక్కరూ తమవంతు పరిశుభ్రతను పాటించాలి.

56 రిజర్వాయర్లకు 46 రిజర్వాయర్లను రాబోయే రెండేళ్లలో పూర్తి చేస్తామన్నారు. హైదరాబాద్‌ జనాభా ఐదు రెట్లు పెరిగినా సరిపోయేలా 20 టీఎంసీల కెపాసిటీతో శామీర్‌పేటలోని కేశవాపూర్‌ దగ్గర భారీ రిజర్వాయర్‌ నిర్మిస్తున్నాం. ఔటర్‌ రింగ్‌రోడ్డు లోపల ఉన్న ప్రాంతా లన్నింటికీ హెచ్‌ఎండబ్ల్యుఎస్‌ తాగునీరు అందిస్తుంది. ఔటర్‌ లోపల ఉన్న 180 గ్రామాలకు రూ.628 కోట్లతో తాగునీరు అందిస్తామన్నారు. హైదరాబాద్‌ నగరంలో ఎన్ని నల్లా కలెక్షన్లు కావాలన్నా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. నగర ప్రజలకు ప్రతి రోజు నాణ్యమైన నీటి సరఫరాయే ప్రభుత్వ లక్ష్యమన్నారు. హైదరాబాద్‌లో 21 లక్షల కుటుంబాలుంటే కేవలం 9.20 లక్షల నల్లా కలెక్షన్లు ఉన్నాయి. నల్లా కలెక్షన్ల కోసం అవసరమైతే స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహిస్తామన్నారు.

Other Updates