గౌరవ ముఖ్యమంత్రి సూచన మేరకు 532 వంతెనల నిర్మాణంలో సాంకేతికంగా వెసులుబాటు ఉన్న ప్రాంతాలలో చెక్‌డ్యాంలను కూడా పొందుపరచారు. చెక్-డ్యాంల ఆవశ్యకతను గుర్తించిన ప్రభుత్వం, వాటి డిజైన్, నిర్మాణ ప్రక్రియలో మెళకువలు అధ్యయనం చేయటానికి మహారాష్ట్ర కు ఒక ఉన్నత స్థాయి బృందాన్ని పంపింది. ఆ బృందం పలు వంతెనల నిర్మాణాలను పరిశీలించి 174 ప్రాంతాలలో చెక్‌డ్యాంల నిర్మాణానికి అనుకూలంగా ఉన్నాయని నివేదికలు సమర్పించింది.
చెక్‌డ్యాం ప్రత్యేకతలు
నదులు లేదా వాగుల పరీవాహక ప్రాంతాలలో చెక్-డ్యాంలను వర్షపు నీటి సంరక్షణకు ఆనకట్టల మాదిరిగా ఉపయోగించుకోవటం సాధా రణమే. అయితే వంతెనల నిర్మాణంలో చెక్-డ్యాంల ఏర్పాటు వినూత్న ప్రయోగమే అని చెప్పాలి. ముఖ్యమంత్రి సూచనల మేరకు ఈ చెక్-డ్యాంల రూపకల్పన జరిగింది. వంతెనల నిర్మాణక్రమంలో కేవలం 15% అదనపు ఖర్చుతో ఎటువంటి అదనపు వనరుల అవసరం లేకుండా చెక్-డ్యాంలను పొందుపరచవచ్చు. వారధుల కట్టడాలలో నదీ గర్భంలో బల్లపరుపుగా వేసే శ్లాబు నిర్మాణంపై ప్రవాహ దిశకు అడ్డంగా అంటే వంతెనకు సమాంతరంగా కేవలం రెండు లేదా మూడు వరుసల మేసనరి కట్టడం ద్వారా ఈ చెక్-డ్యాంలను నిర్మించుకోవచ్చు.
వంతెనలకు ఎగువ దిశలో నీటి నిలువకు అనుకూలంగా ఉండే ప్రదేశాల ఎంపిక చాలా కీలకం. చెక్-డ్యాం ల నిర్మాణంలో వంపులు లేని ప్రవాహక్రమం, నీటి నిలువ పరిమాణం, వంతెన మరియు ఇరువైపులా ఉండే కట్టలు ముంపుకు గురి కాకుండా ఉండే విధంగా ఆకృతుల నిర్మాణం వంటి అంశాలు ప్రాధాన్యం కలిగి ఉంటాయి.
ఈ చెక్‌డ్యాంల నిర్మాణానంతరం పరిసర ప్రాంతాలలో భూగర్భజలాల పెరుగుదల మెరుగుపడినట్లు దాఖలాలు కనిపిస్తున్నాయి. పశుపక్ష్యాదుల తాగు నీటి కొరత ఎంతోకొంత మేర తీరుతున్నది. చెక్‌డ్యాంల నిర్మాణాలు ఒక ఉద్యమ స్పూర్తితో చేపడితే పచ్చదనం మెరుగుపడి ఆ ఫలాలు ప్రజలకు అందుబాటులోకి వస్తాయి. మున్ముందు చెక్-డ్యాంలతో కూడిన వంతెనలను హరిత నిర్మాణాలుగా రూపకల్పన చేసినట్లయితే గ్లోబల్ వార్మింగ్ వంటి సమస్యలు, కర్బన ఉద్గారాల తీవ్రత తగ్గి పర్యావరణానికి ముందు తరాలకు ఏంతో మేలు చేసినట్లు అవుతుంది.
భూగర్భ జలాల పరిరక్షణ, జంతువుల తాగునీటి అవసరార్ధం, ఇతర నీటి వినియోగ అవసరాలకు ఎంతో ఉపయోగంగా ఉంటాయి ఈ చెక్‌డాంలు. పెద్దనదులపై నిర్మించే ఆనకట్టల వలన కలిగే ముంపు, వన్య ప్రాణుల అంతరింపు వంటి అభ్యంతరాలు లేకుండా, చిన్న చిన్న మొత్తాలలో పలు ప్రాంతాలలో నీటి నిలువ సాధ్యపడుతుంది.మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యక్ష సారధ్యంలో నిరంతర సమీక్షలతో ఈ చెక్-డ్యాంల నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చెక్‌డ్యాంలు ప్రజల అందుబాటులోకి తేవాలనే లక్ష్యంతో రహదారులు భవనముల శాఖ అధికారులు కృషి చేస్తున్నారు అని మంత్రి తుమ్మల అన్నారు.