చెత్త-సేకరణకు--పక్కా-ప్రణాళికభవిష్యత్‌ అవసరాలను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్‌ నగరాన్ని అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అధికారులకు సూచించారు. స్వచ్ఛ హైదరాబాద్‌ కార్యక్రమంలో నగరంలోని సమస్యలను గుర్తించడానికి ఏర్పాటు చేసిన సబ్‌ కమిటీ నివేదికకు అనుగుణంగా సుందరీకరణకు ప్రభుత్వం నిధులు కేటాయిస్తుందని సిఎం చెప్పారు. నగరంలో చెత్త సేకరణకు పక్కా ప్రణాళిక ఉండాలని, ప్రయోగాత్మకంగా కొన్ని సర్కిళ్ళ వారిగా కొన్ని వాహనాలు తిప్పాలని, ఇండ్లలోని చెత్తతోపాటు షాపులు, దవాఖానాలు, ఫంక్షన్‌హాళ్లు, మార్కెట్లు తదితర ప్రాంతాల్లో చెత్తను తరలించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. జిహెచ్‌ఎంసి, హెచ్‌ఎండిఏ, వాటర్‌ వర్క్స్‌, విద్యుత్‌ తదితర అంశాలపై ప్రజా ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సబ్‌ కమిటీ సమావేశం జూన్‌ 9వ తేదీన ఎంసీహెచ్‌ఆర్డీలో జరిగింది. ఆయా అంశాలపై కమిటీలు సమర్పించిన నివేదికను సీఎం కెసీఆర్‌ సమీక్షించారు.

నగరంలోని వరదనీటి కాల్వల్లో పూడిక తొలగించాలని, విద్యుత్‌ లోఓల్టేజీ సమస్య నివారణకు, ఇండ్లపై హైటెన్షన్‌ వైర్ల తొలగింపునకు తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక సమర్పించాలని విద్యుత్‌ అధికారులను ఆదేశించారు.

ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం మహ్మద్‌ మహమూద్‌ అలీ, మంత్రులు పద్మారావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, రాజ్యసభ సభ్యుడు వి. హన్మంతరావు, ఎమ్మెల్సీలు సలీం, రామచంద్రరావు, ఎంఎస్‌ ప్రభాకర్‌, సయ్యద్‌ అమీన్‌ హసన్‌ జాఫ్రీ, సయ్యద్‌ అల్తాఫ్‌ రజ్వీ, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు తీగల కృష్ణారెడ్డి, మాధవరావు, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యేలు కె. లక్ష్మణ్‌, జి. కిషన్‌రెడ్డి, ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌, చింత రాంచంద్రారెడ్డి, రాజాసింగ్‌, టీడీపీ ఎమ్మెల్యే ఆర్‌ కృష్ణయ్య, ఎంఐఎం ఎమ్మెల్యేలు అక్బరుద్దీన్‌, బలలా, జాఫర్‌ హుస్సేన్‌, కౌసర్‌ మొహినుద్దీన్‌, సయ్యద్‌ ఆహ్మద్‌ పాషా ఖాద్రీ, ముంతాజ్‌ ఆహ్మాద్‌ ఖాన్‌, మహ్మద్‌ ముజాంఖాన్‌, సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగరావు, జీహెచ్‌ఎంసీ కమీషనర్‌ సోమేశ్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

చెత్త సేకరణ….

‘‘పట్టుబట్టినం.. పనిమొదలుపెట్టినం.. సాధించాలె. మంచి ఉద్దేశంతో చేసే ఏదైనా సరే తప్పకుండా విజయం సాధిస్తాం. మహిళలు భాగస్వాములైతే చెత్త సమస్యను నిర్మూలించవచ్చు. హైదరాబాద్‌లో చెత్త దరిద్రాన్ని తరిమేద్దామని’’ ముఖ్యమంత్రి కె. చంద్రశేర రావు పిలుపునిచ్చారు. స్వచ్ఛహైదరాబాద్‌లో భాగంగా జూన్‌ 18వ తేదీన పార్సీగుట్టలో జరిగిన కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు.

నగరంలో పేదలకు డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లను ఖచ్చితంగా నిర్మిస్తామని సీఎం పునరుద్ఘాటించారు. పార్సీగుట్ట, బౌద్ధనగర్‌లో నాలా విస్తరణలో ఇండ్లు కోల్పోయిన వారికి, ఇండ్లు లేనివారికి ఖాళీ జాగాలలో ఇండ్లు కడతానంటే కొన్ని పార్టీలు రాద్ధాంతం చేస్తున్నాయని విమర్శించారు. ఇక్కడి ప్రజలకోసం చిలకలగూడలోని రైల్వే స్థలాలను తీసుకుని ఇండ్లు కట్టించే ప్రయత్నాలు చేస్తున్నామని, దీనికోసం రైల్వే అధికారులతో చర్చలు జరుపుతున్నామని ఆయన తెలిపారు. పది ఎకరాల స్థలం దొరికితే చాలు ఐదారు అంతస్థలు భవనాలు కట్టిస్తామని, ఎకరానికి ఐదుకోట్ల రూపాయలు ఖర్చయినాసరే వెనక్కు తగ్గేది లేదని, పార్సీగుట్టను అందమైన ప్రాంతంగా తీర్చిదిద్దుతామని కెసిఆర్‌ స్పష్టం చేశారు.

ఐదురోజుల పాటు జరిగిన స్వచ్ఛ హైదరాబాద్‌ కార్యక్రమంలో బస్తీలో ఉన్న సమస్యలు తెలుసుకున్నాం. వాటి పరిష్కారానికి నిర్ణయానికి వచ్చాం, ప్రపంచంలో, దేశంలో గొప్ప పేరున్న హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, హెచ్‌ఎండిఏ క్రమపద్ధతిలో అభివృద్ధి చెందాలన్నారు సిఎం. జిహెచ్‌ఎంసి పరిధిలో 23 మంది ఎమ్మెల్యేలు, ఐదారుగురు ఏంపిలు కూడా స్వచ్ఛ హైదరాబాద్‌లో పాల్గొని పరిస్థితులు తెలుసుకున్నారు. సమస్య పరిష్కారానికి ఏంచేయాలి, వేరే సిటీల్లో ఎలా చేస్తున్నారని చర్చించామన్నారు. ఇండ్ల నుంచి వచ్చే చెత్త సరైన పద్ధతిలో సేకరించి, మన బస్తీలు, నగరం, రోడ్లు చెత్త లేకుండా చేయాలని, నాలాలు కబ్జాలకు గురయ్యాయని, వాటిపై ఇండ్లు కట్టారు, వాటిని తొలగిస్తే చాలా మంది పేదల ఇండ్లు పోతాయి, వారికి ప్రత్యామ్నాయంగా డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు కట్టిస్తామన్నారు.

నాలాల కార్యక్రమానికి రెండేండ్లు పడుతుంది, ఐదారువేల కోట్లు పెడితే సమస్య శాశ్వతంగా దూరమవుతుంది. దీనికి ప్రభుత్వం రెడీగా ఉందన్నారు. మన నగరానికి కృష్ణా, గోదావరి నుంచి నీళ్లు వచ్చినా సరిపోవడం లేదు. ఎన్ని నీళ్లు అవసరం, ఏం చేయాలనేదానిపై అవగాహనకు వచ్చామని ప్రజలకు వివరించారు సిఎం చంద్రశేఖరరావు. త్వరలోనే 45 ఎంజీడి కృష్ణానది నీళ్లు రాబోతున్నాయి ఇవి వస్తే ఇప్పుడున్న సమయం కంటే ఎక్కువ సేపు నీళ్లు ఇచ్చే ఆస్కారం ఉంటుంది, దీంతో నీటి సమస్య తీరుతుందన్నారు.

దేశ రాజధాని ఢిల్లీలో చెత్త నుంచి ఇసుక, కంకర, మహారాష్ట్రలోని నాగపూర్‌లో చెత్త నుంచి కరెంటు ఉత్పత్తి చేస్తున్నారు. నగర ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు వీటిని అధ్యయనం చేశారు. వీటి సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నామని సి.ఎం. తెలిపారు.

నగరంలో చెత్త సేకరణ క్రమపద్ధతిలో జరగాలని, ఇండ్ల నుంచి చెత్తను ఆటో రిక్షా వాళ్లు తీసుకుని, వాటిని సిటీలోని లారీల ద్వారా చెత్త సాఫ్‌ చేసే ప్రదేశానికి వెళ్తాయని అక్కడ ఒకటి ఎరువులు, మరొకటి విద్యుత్‌ తయారు చేస్తామన్నారు. అలాగే పాత ఇండ్లు కూలగొట్టిన వ్యర్థాలను ఎక్కడపడితే అక్కడ పడేస్తున్నారని, అలా కాకుండా మున్సిపాలిటీ వారికి ఫోన్‌ చేస్తే పైసా ఖర్చులేకుండా వారే తీసుకువెళ్లే వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామన్నారు.

రేషన్‌ కార్డులు, ఫించన్లు రానివారుంటే పేర్లు చెప్పాలని బస్తీ వాసులకు సూచించారు. మంచి ఉద్దేశంతో చేసే పని ఏదైనా సరే తప్పకుండా విజయం సాధిస్తామని అందరం కలిసి ముందుకు పోదాం, విజయం సాధిద్దాం, ఈ పనులు కావాంటే అక్కా చెల్లెళ్లు కూడా భాగస్వాములు కావాలని సిఎం సూచించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే, మంత్రి పద్మారావు గౌడ్‌, జిహెచ్‌ఎంసి కమీషనర్‌ సోమేశ్‌ కుమార్‌, ఎమ్మెల్యేలు బాల్కొండ ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, సీఎం కార్యాలయ కార్యదర్శి రాజశేఖర రెడ్డి, తదితర అధికారులు పాల్గొన్నారు.

ఢిల్లీ, నాగపూర్‌లో స్వచ్ఛ్‌ కమిటీ పర్యటన

డిప్యూటీ సీఎం మహమూద్‌ అలీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘స్వచ్ఛ్‌ కమిటీ’ నగరానికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, తదితర ప్రజాప్రతినిధులు, అధికారులతో జూన్‌ 16, 17 తేదీల్లో రెండు రోజుల పాటు ఢిల్లీ, నాగపూర్‌లో పర్యటించారు. ఈ పర్యటనలో సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ పై ప్రధానంగా దృష్టి సారించింది. చెత్తను, ఇండ్ల కూల్చివేత వ్యర్ధాలను రీసైక్లింగ్‌ చేసే విధానాలపై అధ్యయనం చేశారు. స్వచ్ఛ్‌ హైదరాబాద్‌ నిర్మాణంలో బిన్‌ ఫ్రీ హైదరాబాద్‌గా మార్చడానికి నాగపూర్‌లో అమలవుతున్న గేటెడ్‌ కమ్యూనిటీ, ఇంటింటి చెత్త, మురికివాడల్లో చెత్త సేకరణ విధానాన్ని ఈ కమిటీ సంపూర్ణంగా పరిశీలించింది. నాగపూర్‌ మున్సిపాలిటీతో, ఓ ప్రయివేట్‌ సంస్థ సంయుక్తంగా 2008 సంవత్సరంలో బిన్‌ ఫ్రీ సిటీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. ఈ కార్యక్రమం గత ఏడు సంవత్సరాలుగా కొనసాగుతూ వస్తోంది. 75 శాతం చెత్తను ఇంటింటి నుండి సేకరించి సమీపంలో ఉన్న ట్రాన్స్‌ ఫర్‌ కేంద్రాలకు తరలిస్తున్నారు. అక్కడి నుండి భారీ కంటైనర్ల ద్వారా డంప్‌ యార్డులకు తరలిస్తున్నారు. ఈ విధానం ద్వారా రోడ్డుపై వెళ్తున్న చెత్త వాహనాల నుండి చెత్త క్రింద పడకుండా దాని నుండి దుర్వాసన రాకుండా నియంత్రించగలుగుతున్నారు అక్కడి అధికారులు.

దీంతో పాటు వ్యర్ధాల పునర్వినియోగంపై పలు ఆసక్తికరమైన అంశాలను గుర్తించింది. ఇందులో రోడ్డుపై చెత్త డబ్బాలు లేకుండా ఇంటింటి చెత్త సేకరణ, చెత్తను పూర్తిగా విద్యుత్‌ తయారీకి ఉపయోగించడం ద్వారా డంపింగ్‌ కేంద్రాలకెక్కువ భూమి అవసరం ఉండదని కమిటీ అభిప్రాయపడిరది.

రోజు రోజుకు అభివృద్ది చెందుతున్న నగరాల్లో ఇంటి నిర్మాణ వ్యర్ధాలు ఒక సమస్యగా మారింది. ఈ వ్యర్ధాలను
గుట్టలు గుట్టలుగా పోయడం, వీటి ద్వారా నాలాలను, చెరువులను పూడ్చడం, కొన్ని ప్రాంతాల్లో రోడ్లపై వేయడం వల్ల ట్రాఫిక్‌కు సైతం ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. దీంతో పర్యావరణానికి నష్టం జరగడంతోపాటు, సహజ వనరులు కనుమరుగవుతున్నాయి. ఈ ఇబ్బందులను ఎదుర్కొనడానికి ఢల్లీి తరహాలో రీ సైక్లింగ్‌ విధానాన్ని అమలు చేయాలని కమిటీ భావించింది. ఢిల్లీలో నిర్మాణ వ్యర్ధాల ద్వారా ఇసుక, ఇటుకలు, ఫుట్‌ పాత్‌కు వాడే టైల్స్‌ లాంటివి ఉత్పత్తి చేస్తున్నారు. ఇదే విధానాన్ని హైదరాబాద్‌లో సైతం అమలు చేయాలని నిర్ధారించారు.

చెత్తతో విద్యుత్‌ తయారీ చేసే అంశంపై దృష్టి సారించింది గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌. ఢిల్లీలో చెత్త నుంచి విద్యుత్‌ తయారీ మంచి ఫలితాలను ఇస్తున్నట్లు గుర్తించిన జిహెచ్‌ఎంసి అధికారులు నగరంలో వెలువడుతున్న 3800 మెట్రిక్‌ టన్నుల చెత్తలో 1100 మెట్రిక్‌ టన్నుల చెత్తతో బీబీనగర్‌లోని విద్యుత్‌ ప్లాంటులో విద్యుత్‌ తయారు చేయాలని భావిస్తోంది. మిగిలిన చెత్త కోసం మరిన్ని విద్యుత్‌ ప్రాజెక్టులను ఏర్పాటు చేయాలని ప్రణాళికలు రూపొందిస్తున్నారు అధికారులు. నగరంలో వెలువడుతున్న వ్యర్థాలను పూర్తిస్థాయిలో విద్యుత్‌ తయారీకి వినియోగించాలని నిర్ణయం తీసుకున్నారు. కొత్తగా ఏర్పాటు చేసే విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలను హైదరాబాద్‌ నలువైపులా ఏర్పాటు చేయాలని స్వచ్ఛ్‌ కమిటీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది.

వివిధ అంశాలపై అధ్యయనం చేసిన స్వచ్ఛ్‌ కమిటీ నగరంలోని పారిశుధ్యాన్ని మెరుగుపరిచేందుకు ‘టార్గెట్‌ 100 డేస్‌’ కార్యక్రమానికి రూపకల్పన చేస్తున్నారు.

Other Updates