చెన్నమనేని,-దత్తన్నలకు-పౌరసన్మానం1తెలంగాణ రాష్ట్ర ముద్దుబిడ్డలు మహారాష్ట్ర గవర్నర్‌ చెన్నమనేని విద్యాసాగర్‌రావు, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయలను రాష్ట్ర ప్రభుత్వం ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని పౌర సన్మానం చేసి తెలంగాణ వాదులందరినీ ఆనందపరవశులను చేసింది.
హైదరాబాద్‌ నెక్లెస్‌రోడ్‌లోని జలవిహార్‌లో విద్యాసాగర్‌రావును ముఖ్యమంత్రి కేసీఆర్‌ నవంబర్‌ 9న సన్మానం చేశారు. సన్మానం అందుకున్న విద్యాసాగర్‌రావు మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ ఏ పనిచేసినా అందులో తనదైన ప్రత్యేకతను కనబరుస్తారని అన్నారు. కొన్ని దశాబ్దాల రాజకీయ జీవితాన్ని గడిపిన తనకు ఈ రోజు జీవితంలో చిరస్థాయిగా గుర్తుండిపోయే రోజని విద్యాసాగర్‌రావు అన్నారు. గోదావరి నది నీటిని మన రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి అందించి రాష్ట్రాన్నంతటినీ సస్య శ్యామలం చేసుకోవాలన్నారు. గోదావరి నీటిలో రాష్ట్రానికి దక్కవలసిన దాదాపు 720 టీఎంసీల నీటిని అందిపుచ్చుకుని అవసరార్థం వాడుకుందామన్నారు విద్యాసాగర్‌రావు.
విద్యాసాగర్‌రావుకు పౌరసన్మానం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాట్లాడుతూ మహారాష్ట్ర గవర్నర్‌గా విదాసాగర్‌రావు గారిని సన్మానించుకోవడం గర్వకారణంగా భావిస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా గతంలో జరిగిన వైనాన్ని వివరిస్తూ… ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రిగా వున్న సందర్భంలో విద్యాసాగర్‌రావు శాసనసభలో తాను ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లును చట్టంగా తీసుకురావడం జరిగిందని ఈ ఘనత దేశ చరిత్రలో ఒక విద్యాసాగర్‌రావుకే దక్కిందని తెలిపారు.
ఇచ్చంపల్లి ప్రాజెక్టు నిర్మాణంలో మహారాష్ట్ర ప్రభుత్వ సహకారం సమకూరే విధంగా చూడాలని కోరారు కేసీఆర్‌. ఇచ్చంపల్లి బహుళార్థక సాధక ప్రాజెక్టని ఇది పూర్తయితే తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలు విద్యుత్తును ఉపయోగించుకునే వీలు వుంటుందని పేర్కొన్నారు.
ఈ విషయంపై స్పందించిన విద్యాసాగర్‌రావు మహారాష్ట్ర ప్రభుత్వం తరఫున పూర్తి సహాయసహకారాలు అందే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించిన మన రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ విద్యాసాగర్‌రావును సన్మానించుకోవడం అనేది రాష్ట్ర ప్రజలకు ఎంతో గౌరవప్రదమైన అంశమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రులు మహమూద్‌ అలీ, రాజయ్య, మంత్రులు జగదీశ్‌రెడ్డి, ఈటెల రాజేందర్‌, హరీశ్‌రావు, పద్మారావు, ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, సీపీఐ నాయకులు చాడ వెంకట్‌రెడ్డి, బీజేపీ నాయకుడు రాజేశ్వరరావు, రాజ్యసభ సభ్యులు రాపోలు ఆనందభాస్కర్‌, వి. హనుమంతరావు, మాజీ గవర్నర్‌ రామారావు, శాసనసభ్యులు తదితరులు పాల్గొన్నారు.
మన దత్తన్న బంగారం: సీఎం
కేంద్ర క్యాబినెట్‌లో ఇప్పటి వరకు తెలంగాణకు ప్రాతినిధ్యం లేని లోటు బండారు దత్తాత్రేయ నియామకంతో తీరిపోయిందని, తెలంగాణ సమస్యలను క్యాబినెట్‌లో వినిపించడానికి బండారు దత్తాత్రేయ మనకు బంగారు దత్తన్నలా దొరికాడని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రశంసించారు.
కేంద్ర క్యాబినెట్‌లో దత్తాత్రేయకు మంత్రిపదవి వచ్చిన సందర్భాన్ని పురస్కరించుకుని నవంబరు 15న భాగ్యనగరంలోని జలవిహార్‌లో ప్రభుత్వం తరఫున ఆయనకు పౌరసన్మానం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం ప్రసంగించారు. ఎన్నో విషయాల్లో పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌ వారు ఇబ్బందుల పాలు చేస్తున్న తరుణంలో తెలంగాణ ప్రయోజనాలను కాపాడేందుకు దత్తాత్రేయ తెలంగాణ గొంతుకగా మారాలన్నారు. అలయ్‌`బలయ్‌ పేరుతో అన్ని వర్గాల ప్రజలను ఒక్క వేదికపైకి తేవటం ద్వారా ఉద్యమానికి ఆయన ఊతమిచ్చాడని కితాబిచ్చారు.
తెలంగాణ అన్ని రంగాలలో అభివృద్ధి సాధించడానికి చిత్తశుద్దితో కృషి చేస్తానని సన్మానాన్ని అందుకున్న కేంద్ర మంత్రి దత్తాత్రేయ హామీ ఇచ్చారు. రాష్ట్రాన్ని కుదిపేస్తున్న కరంట్‌ కష్టాలను తొలగించేందుకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలకు అనుసంధాన కర్తలా ఉంటానన్నారు. మోదీ, కేసీఆర్‌ల మధ్య స్నేహపూర్వక వాతావరణం నెలకొనేలా ప్రయత్నిస్తానన్నారు. తాను కేంద్ర మంత్రిగా నగరానికి ప్రపంచస్థాయి మెడికల్‌ కళాశాలను తేనున్నట్లు ఆయన ప్రకటించారు. రూ. 435 కోట్ల ఖర్చుతో దీన్ని సనత్‌నగర్‌లో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
ఇంకా ఈ కార్యక్రమంలో అసెంబ్లీ స్పీకర్‌ మధు సూదనాచారి, కౌన్సిల్‌చైర్మన్‌ స్వామి గౌడ్‌, సీఎల్పీ నేత జానారెడ్డి, బీజేఎల్పీ నేత డాక్టర్‌ లక్ష్మన్‌, టీడీపీ నేత మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్‌రెడ్డి, పలువురు రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

Other Updates