‘‘తెలంగాణ సమస్యలపై ప్రధానితో చర్చించేందుకు ఢిల్లీకి
రావాల్సిందిగా’’ కేంద్ర ప్రణాళికా శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం
మే 25 రాత్రి ట్రంక్‌ కాల్‌ ద్వారా ప్రధాని ఆహ్వానాన్ని
డాక్టర్‌ చెన్నారెడ్డికి అందజేశారు.

ప్రధాని ఆహ్వానాన్ని అంగీకరించిన డాక్టర్‌ చెన్నారెడ్డి, మే 26న ప్రజాసమితి ముఖ్య నాయకులతో చర్చలు జరిపారు. ప్రధానితో సమావేశం జరిపి తెలంగాణ సమస్యలకు పరిష్కారాన్ని సాధించడానికి తగిన చర్యలు తీసుకునే పూర్తి అధికారాన్ని ఏప్రిల్‌ మొదటి వారం రెడ్డిహాస్టల్‌లో జరిగిన ద్వైవార్షిక సమావేశంలో ప్రజాసమితి డా॥ చెన్నారెడ్డికి అప్పగించిన విషయం విదితమే.

లోకసభ ఎన్నికలకు ముందే ఈ సంవత్సరారంభంలో ప్రధాని తెలంగాణ సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకుని కొన్ని ప్రతిపాదనలను డాక్టర్‌ చెన్నారెడ్డి ముందుంచారు. చెన్నారెడ్డి మాటల్లో చెప్పాలంటే ప్రత్యేక తెలంగాణకు ఇందిరాగాంధీ సూత్రప్రాయంగా అంగీకరించారు. గత డిసెంబర్‌ 31న ప్రధాని తన ప్రతిపాదనను చొక్కా రావు, చెన్నారెడ్డితో చర్చించారు. ఈ ప్రతిపాదన ప్రకారం అష్ట సూత్ర కార్యక్రమం ఎంతవరకు సక్రమంగా అమలు జరిగేది, ఐదు సంవత్సరాలు (1977 వరకు) వేచి చూసిన తర్వాత అసెంబ్లీలోని తెలంగాణ సభ్యులలో మూడింట రెండు వంతుల మంది సభ్యులు బలపరిస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుంది. అయితే ప్రజాసమితి లోక్‌సభ ఎన్నికల్లో అభ్యర్థులను నిలబెట్టరాదు. కాంగ్రెస్‌ అభ్యర్థులనే ప్రజా సమితి బలపర్చాలి. కాంగ్రెస్‌ పక్షాన కొందరు ప్రజాసమితి నాయకులు పోటీ చేయవచ్చును.

జనవరి 2న ప్రజాసమితి కార్యవర్గ సమావేశంలో ప్రధాని ప్రతిపాదనను నాయకులకు డాక్టర్‌ చెన్నారెడ్డి వివరించారు. ప్రజాసమితి కార్యవర్గం ఈ ప్రతిపాదనపై చర్చించి ‘‘ఐదేళ్లు వేచి చూడకుండా, 1972లో శాసనసభ ఎన్నికల అనంతరం మూడింట రెండు వంతుల మెజారిటీతో తెలంగాణపై నిర్ణయం తీసుకోవాలని’’ ఏకాభిప్రాయం వెల్లడైంది.

ఢిల్లీ ప్రతిపాదనలను అంగీకరించవద్దని చెన్నారెడ్డిపై విద్యార్థుల నుండి ఇతర తెలంగాణ సంఘాల, నేతల నుండి తీవ్రమైన వత్తిడి వచ్చింది. ప్రధాని ప్రతిపాదనలను జనవరి 4న జరిగిన ప్రజాసమితి కార్యవర్గ సమావేశం తిరస్కరించిన సంగతి తెలిసిందే.

రెండు శాసనసభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో విజయం పొందిన కారణంగానే ప్రజల్లో ప్రజాసమితికి గల ఆదరణను గుర్తించి ప్రధాని పై ప్రతిపాదను చేసిందనేది గమనార్హం.

ఇప్పుడు కూడా చర్చకు డాక్టర్‌ చెన్నారెడ్డిని ప్రధాని ఢిల్లీకి ఆహ్వానించడానికి కారణం 1972లో అంటే మరో ఏడాది కాలంలో రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరిగే అవకాశం ఉంది కాబట్టే. మార్చిలో జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో 47 శాతం ఓట్లను ప్రజాసమితి పొందింది. 14 స్థానాల్లో 10 స్థానాలు గెలిచింది. ప్రజాసమితికి లభించిన ఆదరణ చూస్తే శాసనసభ ఎన్నికల్లో తెలంగాణ ప్రాంతంలోని దాదాపు అన్ని స్థానాల్లో తిరిగి గెలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

పార్లమెంట్‌ ఎన్నికల ఫలితాలు రావడంతోనే ప్రధాని తెలంగాణ సమస్యపై దృష్టి సారించింది. మరోవైపు పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 352 స్థానాలను గెలవడం ద్వారా శ్రీమతి గాంధీ దేశంలోని అత్యంత బలమైన, ప్రజాదరణగల నాయకురాలు అని రుజువైంది. లోక్‌సభలో ప్రతిపక్ష హోదాను ఏ పార్టీ పొందలేదు.

తెలంగాణ రాష్ట్రానికి ఇందిరాగాంధీ వ్యతిరేకం. ఆ ఒక్క డిమాండ్‌ను పక్కన పెడితే మరే విధమైన పరిష్కారానికైనా ఆమె సిద్ధమైందని అందరికీ తెలిసిందే.

‘‘సూత్రప్రాయంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడానికి ప్రధాని అంగీకరించినట్లే’’నని డాక్టర్‌ చెన్నారెడ్డి చెప్తున్నా, ఆయన మాటలను ఎవరూ విశ్వసించడం లేదు. ఆ విషయం ఆయనకు బాగా తెలుసు. తెలంగాణ రాష్ట్రంపై తక్షణమే పట్టుబట్టకుండా ఇతర సమస్యలను పరిష్కరించుకుంటేనే మేలనే నిర్ణయానికి చెన్నారెడ్డి, ఇతర ప్రజాసమితి నేతలు వచ్చారు. అందుకే లోక్‌సభ ఎన్నికల అనంతరం చొక్కారావు చేస్తూ వచ్చిన మధ్యస్థ పరిష్కార మార్గాలను డా॥ చెన్నారెడ్డి బహిరంగంగా వ్యతిరేకించకుండా ‘చర్చకు సిద్ధమే’నని పదేపదే ప్రకటిస్తూ వచ్చారు. ఢిల్లీ నాయకులు తెలంగాణ సమస్యల పరిష్కారానికై ప్రాంతీయ సంఘానికి విస్తృతాధికారాలు ఇవ్వాలని అనుకుంటున్నట్లు, తెలంగాణకు ప్రత్యేకంగా విద్యుశ్ఛక్తి బోర్డును ఏర్పాటు చేయనున్నట్లు, డా॥ చెన్నారెడ్డిని ప్రణాళికా సంఘం సభ్యునిగానో, రాయబారిగానో నియమించబోతున్నట్లు పత్రికల్లో ఎడతెగకుండా ‘గాలి’ వార్త బ్యానర్‌ వార్తల్లాగా వచ్చాయి.

తెలంగాణ సమస్యను ప్రధాని విచక్షణకే వదిలేయాలి అని కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు దామోదరం సంజీవయ్య పలుమార్లు సూచించారు. చొక్కారావుది కూడా ఇదే అభిప్రాయం. కానీ డాక్టర్‌ చెన్నారెడ్డి ఈ అభిప్రాయాన్ని వ్యతిరేకించారు.

కేంద్రమంత్రులతో, రాష్ట్రపతితో, ఎంపీలతో చెన్నారెడ్డి చర్చలు 1971 మే 27న తెలంగాణకు చెందిన ప్రజాసమితి ఎంపీలతో ఢిల్లీలో డాక్టర్‌ చెన్నారెడ్డి సంప్రదింపులు జరిపారు. ప్రధానితో జరగబోయే చర్చల్లో ఎలాంటి వైఖరి అవలంభిస్తే బాగుంటుందో ఎంపీ అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. అనంతరం మే 28న కేంద్రమంత్రులైన సి. సుబ్రహ్మణ్యం, జగ్జీవన్‌రామ్‌తో డాక్టర్‌ చెన్నారెడ్డి చర్చలు జరిపారు. ప్రధాని అంతరంగాన్ని పసిగట్టే ప్రయత్నం చేశారు. రాష్ట్రపతి వి.వి.గిరిని కూడా డాక్టర్‌ రెడ్డి కలిసి ప్రత్యేక రాష్ట్రం కోసం ఆయన పలుకుబడిని ఉపయోగించాలని కోరినారు.

ప్రధానితో చెన్నారెడ్డి చర్చలు
మే 29న ప్రధాని గాంధీ డాక్టర్‌ చెన్నారెడ్డితో సుమారు అరగంటపాటు ఇతరులెవ్వరూ లేకుండా చర్చలు జరిపారు. ఈ చర్చల్లో ఏమి మాట్లాడిందీ ఇద్దరూ పత్రికలకు వ్లెడించలేదు. ప్రత్యేకమైన ప్రతిపాదనలేవీ ప్రధాని చేయలేదని, సాధారణ విషయాలపైనే మాట్లాడుకున్నాము అని, మరోసారి ప్రయత్నం చేయడానికి అవకాశాన్ని కల్పించాయని డా॥ చెన్నారెడ్డి విలేకర్లకు తెలిపారు.

డా॥ చెన్నారెడ్డి ఆ తర్వాత చేసిన ప్రకటనలో ‘‘ఈ చర్చ ఫలితంగా వెలువడే ప్రతిపాదన ఏదైనా తెలంగాణ ప్రజలకు సంతృప్తిని కలిగించేది గానే
ఉంటుందని విశ్వసిస్తున్నాను’’ అని అన్నారు. ‘‘ఈ చర్చ పర్యవసానాన్ని గురించి ఎవరూ ఊహాగానాలు చేయడం మంచిది కాదని, సంతృప్తికరమైన పరిష్కార మార్గం ఏర్పడగానే దానిని తెలంగాణ ప్రజలకు తెలియజేస్తానని’’ డాక్టర్‌ చెన్నా రెడ్డి తెలిపారు. తనను రాయబారిగానో, ప్రణాళికా సంఘం సభ్యునిగానో నియమించే అవకాశం ఉందని పత్రికల్లో వచ్చిన వార్తలు సత్యం కాదని చెన్నారెడ్డి ప్రకటనలో తెలిపారు. తెలంగాణపై చర్చించడానికే ప్రధాని ఆహ్వానించారన్నారు.

కె.సి. పంత్‌, సుబ్రహ్మణ్యంపై తెలంగాణ బాధ్యత
డాక్టర్‌ చెన్నారెడ్డితో మాట్లాడే ముందు ప్రధాని ఇందిరా గాంధీ కేంద్ర ప్రణాళిక మంత్రి సి. సుబ్రహ్మణ్యంతో తెలంగాణ సమస్యపై చర్చించారు. తెలంగాణ సమస్యపై సంతృప్తికరమైన పరిష్కారమార్గమేదైనా కనుగొనవలసిందిగా ప్రధాని ఆయనపై బాధ్యత పెట్టారు. చెన్నారెడ్డితో కేంద్రమంత్రి సుబ్రహ్మణ్యంను కలుసుకోవాలని ఇందిరాగాంధి సూచించడంతో డాక్టర్‌ చెన్నారెడ్డి, సుబ్రహ్మణ్యంతో చర్చలు జరిపారు.

ఆంధ్ర-తెలంగాణ మధ్య ప్రణాళికా నిధుల పంపిణీ
ఆంధ్ర-తెలంగాణ ప్రాంతాల మధ్య 1971-72లో ప్రణాళిక నిధుల పంపిణీకి నిర్ణయించిన విధానాన్ని హోంశాఖ సహాయ మంత్రి కేసీపంత్‌ లోక్‌సభలో జూన్‌ 2న వివరించారు. ఏపీ సీఎం, కేంద్ర ప్రణాళిక మంత్రి, తెలంగాణ ప్రాంతీయ కమిటీ అధ్యక్షులు చొక్కారావు సమావేశమై ఈ విధానాన్ని నిర్ణయించారని కే.సీ. పంత్‌ తెలిపారు.

1971-72 సంవత్సరానికి ప్రణాళికా నిధులలో 90 శాతం మొత్తాన్ని ఉభయ ప్రాంతాల జనసంఖ్య నిష్పత్తి ప్రకారం పంపిణీ జరుగుతుందనీ, మిగిలిన 10 శాతం నిధులు ఉభయ ప్రాంతాలో వెనుకబాటుతనం ప్రాతిపదికపై పంపిణీ చేయబడతాయి అని కె.సి. పంత్‌ తెలిపారు.

సర్వీసుల విలీనీకరణ
ఆంధ్రా-తెలంగాణ ప్రాంతాలకు చెందిన ఉద్యోగుల సర్వీసుల విలీనీకరణ సందర్భంలో తమకు అన్యాయం జరిగినట్లు మొత్తం 3594 మంది ఉద్యోగుల కేంద్రానికి వినతిపత్రాను సమర్పించారని, వీటన్నింటినీ ప్రభుత్వం పరిశీలించి తగిన ఉత్తర్వులు జారీ చేసిందని ఒక ప్రశ్నకు సమాధానంగా కే.సీ.పంత్‌ చెప్పారు.


టి. అంజయ్య లేఖకు ప్రధాని సమాధానం
తెలంగాణ సమస్య పరిష్కారం కోసం తెలంగాణ ప్రాంత శాసనసభ్యుడు టి. అంజయ్య ప్రధానికి లేఖ రాయగా, ఆమె తనకు సమాధానం ఇచ్చారని హైదరాబాదులో విలేకరులకు జూన్‌3న తెలిపారు. ‘‘ఈ సమస్యను అతిశీఘ్రగతిన పరిష్కరించడానికి మనమంతా కృషి చేయాలని’’ ప్రధాని తమ సమాధానంలో కోరినట్లు అంజయ్య వెల్లడించారు.

ఈ సమస్యను పరిష్కరించడంలో ప్రధానిపై ఎట్టి వత్తిడు తీసుకుని రాకుండా ఆమెకు స్వేచ్ఛనొసగాలని, అందరూ ఇందుకు ఒప్పుకుంటారని తాను భావిస్తున్నట్లు అంజయ్య అన్నారు. తాను ఢిల్లీలో ప్రధానిని, చెన్నారెడ్డిని, కె.సి.పంత్‌ను కలుసుకున్నట్లు చెప్తూ ‘చెన్నారెడ్డి’ కేంద్ర నాయకుల మధ్య ఇప్పుడు జరుగుతున్న చర్చు ఫలప్రదం కాగలవన్న ఆశాభావాన్ని అంజయ్య వ్యక్తం చేశారు.

సరిగ్గా రెండు నెల క్రితం ఏప్రిల్‌ 3న హైదరాబాద్‌లో జరిగిన ద్వైవార్షిక సమావేశాలో ప్రజాసమితి అనుసరించిన వైఖరిని నిరసిస్తూ ఉపాధ్యక్ష పదవికి టి. ఆంజయ్య రాజీనామా చేశారు. కోశాధికారి టి. గోవింద్‌ సింగ్‌ కూడా అంజయ్యతో బాటే రాజీనామా చేశారు.

‘‘ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు కృషి చేయాలనే ఏకైక లక్ష్యం నుండి ప్రజాసమితి వైదొలిగిపోతున్నందుకు’’ ఈ ఇద్దరు శాసనసభ్యుల తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. సమావేశంలో ఆమోదించిన రాజకీయ తీర్మానానికి వీరిరువురూ సవరణలు ప్రతిపాదించారు. తెలంగాణ సమస్య పరిష్కారానికి ప్రధానికి స్వేచ్ఛ ఇవ్వడమో లేక రాష్ట్ర సాధనకు ఉద్యమాన్ని నిర్వహించడమో జరగాలని వీరు సవరణను ప్రతిపాదించగా, దాన్ని సమావేశం చర్చించకుండా దాటవేసిందని వీరు ఆరోపించారు.

తెలంగాణ సమస్య పరిష్కారానికంటూ ప్రతిపాదనేదీ లేదు – బ్రహ్మానంద రెడ్డి
ముఖ్యమంత్రి బ్రహ్మానంద రెడ్డి మే 22న విలేకరులు అడిగిన ప్రశ్నకు జవాబిస్తూ, తెలంగాణ సమస్య పరిష్కారానికంటూ ప్రధాని పరిశీనలో గానీ, తన పరిశీనలో గానీ ప్రత్యేకమైన ప్రతిపాదనేదీ లేదని స్పష్టం చేశారు. మేఘాలయ వలె ఉప రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే ప్రసక్తే లేదన్నారు. గత సంవత్సరం ప్రధాని ప్రతిపాదించిన ‘‘1977 తర్వాత తెలంగాణ శాసన సభ్యుల్లో మూడింట రెండు వంతుల మంది అభిప్రాయాన్ని తీసుకునే’’ ఆలోచన కూడా ఇప్పుడు పనికి రాదని ప్రధాని స్వయంగా తనతో చెప్పారని ముఖ్యమంత్రి అన్నారు.

చెన్నారెడ్డి దిగివస్తున్న సూచన
తెలంగాణ సమస్య పరిష్కారం విషయంలో ప్రజా సమితి అధ్యక్షుడు డాక్టర్‌ చెన్నారెడ్డి ఇటీవ సమావేశంలో చేసిన ప్రకటనల గురించి విలేకరులు ప్రశ్నించగా ‘‘ప్రత్యేక రాష్ట్రమే కావాలని పట్టుబట్టకుండా డాక్టర్‌ చెన్నారెడ్డి ‘ఇప్పుడు దిగి వస్తున్న’ట్లు ఈ ప్రకటన సూచిస్తున్నద’’ని ముఖ్యమంత్రి జవాబిచ్చారు. రాష్ట్రం సమైక్యంగా ఉండే ప్రాతిపదికపై ఎలాంటి రాజీ కుదుర్చుకోవడానికి అయినా తాను సిద్ధమేనని బ్రహ్మానందరెడ్డి అన్నారు.

రాజకీయ సమస్య కాదు: ముఖ్యమంత్రి
తెలంగాణ సమస్య ఏదీ లేదని, రాజకీయ సమస్య అసలే లేదని, తెలంగాణ మిగులు నిధులు తెలంగాణలో అభివృద్ధికై వినియోగించడం, ప్రభుత్వోద్యోగులకు జరిగిన అన్యాయాలను తొలగించడం, తెలంగాణ వెనుకబాటుతనాన్ని నిర్మూలించి అభివృద్ధి చేయడం ఇవే అసలు సమస్యలని సి.ఎం. అన్నారు.

ప్రధానితో చెన్నారెడ్డి రెండో దఫా చర్చలు…
మే 29 న ప్రధానిని కలిసిన నాటినుండి డాక్టర్‌ చెన్నారెడ్డి ఢిల్లీలోనే మకాం పెట్టి కేంద్రమంత్రులను, ఎంపీలను, చొక్కారావును కలుస్తూనే ఉన్నారు.
జూన్‌ 6న రాజ్యసభ సభ్యురాలు శ్రీమతి యశోదా రెడ్డి పార్లమెంట్‌ సభ్యులకు ఇచ్చిన విందులో ముఖ్య అతిథిగా డాక్టర్‌ చెన్నా రెడ్డి పాల్గొన్నారు. కేంద్ర మంత్రులు కే.సీ. పంత్‌, సి. సుబ్రహ్మణ్యం ఈ విందుకు హాజరయ్యారు. ఈ విందులో ఇష్టాగోష్టి తెలంగాణ విషయమై జరిగింది. ఈ మంత్రులతో పలుమార్లు చర్చించిన డా॥ చెన్నారెడ్డి తెలంగాణ సమస్యకు కేంద్ర ప్రభుత్వమే స్వయంగా పరిష్కారం ఒకటి సూచించనున్నదని, చర్చతో ఇక కాలయాపన జరగనీయదనే అభిప్రాయానికి వచ్చారు.

చర్చలన్నీ సీఎంను దించడానికేనా?
కేంద్ర మంత్రి కె.సి.పంత్‌ విడివిడిగా ఎనిమిది మంది ఎంపీలతో కలిసి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు.
‘‘ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర అవకాశం లుప్తమయి అటు మేఘాలయ విధానానికి కూడా అడ్డంకి రావడంతో ప్రాంతీయ సంఘానికి అధికారాలు పెంచడం అన్న ప్రతిపాదనకే బలం చేకూరింది సమితి సభ్యులు ప్రత్యేక రాష్ట్ర వాంఛను అణచుకొన్నా పూర్తిగా తమ వాదాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేరు. అందుచేత రాష్ట్ర నాయకత్వంలో మార్పు రావాలని కోరుతున్నారు. కేంద్రం (చొరవ తీసుకొని ప్రతిపాదనలు చేయాలని కోరటంలో) అంతరార్థం ఇదే’’నని జూన్‌ 7న ఆంధ్రప్రభ దినపత్రిక ఢిల్లీ ప్రతినిధి ఒక వార్తను ప్రచురించారు.

ప్రాంతీయ కమిటీ అధ్యక్షుడు చొక్కారావు, మాజీ కేంద్రమంత్రి ఎం.ఆర్‌. కృష్ణ, శాసనసభ్యుడు టి. అంజయ్య, ఎంపి. జి. వెంకటస్వామి ప్రధాని ఇందిరా గాంధీ కనుసన్నలో తెలంగాణ ప్రజా సమితి నాయకత్వాన్ని ఒప్పించడానికి పావులు కదుపుతున్నారు. కేంద్ర మంత్రులు కె.సి. పంత్‌, సి. సుబ్రహ్మణ్యం పై ఈ బాధ్యతను ప్రధాని పెట్టినట్లు ఉన్నారు. చర్చ సూత్రధారులు వీరే!

జూన్‌ 8న రావుతో ప్రధాని 45 నిమిషాల పాటు తెలంగాణ విషయమై చర్చలు జరిపారు. అంతకుముందు హోంశాఖ సహాయ మంత్రి కే.సీ. పంత్‌ను చొక్కారావు కలిశారు.

జూన్‌10న డా॥ చెన్నారెడ్డి ప్రధానిని కలిసి అరగంటకు పైగా చర్చలు జరిపారు. తెలంగాణ సమస్యను పరిష్కరించడానికి సంబంధించిన ప్రతిపాదనలపై ప్రధానితో చర్చించారు. కేంద్ర మంత్రి కే.సీ. పంత్‌తో డా॥ చెన్నారెడ్డి ముందురోజు రాత్రి సుమారు రెండుగంటలపాటు చర్చలు జరిపారు.

జూన్‌ 11న ఢిల్లీలో చెన్నారెడ్డి విలేకరులతో మాట్లాడుతూ, ‘‘తెలంగాణ సమస్య పరిష్కారానికి ప్రధానమంత్రితోనూ, ఇతర కేంద్ర నాయకులతోనూ జరిపిన చర్చ సరళి సంతృప్తి కలిగించింద’’ని అన్నారు.

జూన్‌ 12న చొక్కారావు హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ, ‘‘తెలంగాణ సమస్యపై శాశ్వత పరిష్కార మార్గాన్ని కనుగొనడానికి ప్రధాని, డాక్టర్‌ చెన్నారెడ్డి మధ్య ఢిల్లీలో మరింత విస్తృత ప్రాతిపదికపై మరోమారు చర్చలు జరిగే అవకాశం వుంద’’ని అన్నారు.

రెండు వారాలు ఢిల్లీలో గడిపి జూన్‌ 13న హైదరాబాద్‌కు చేరుకున్న చెన్నారెడ్డి విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ సమస్య పరిష్కారం ఇంకెంతో దూరంలో లేదు. రెండు మూడు వారాలలోగానే ప్రధాని నిర్దిష్టమైన ప్రతిపాదనలు చేయవచ్చును. వీటి ప్రాతిపదిక పైనే కొత్త ఏర్పాటు ఉండవచ్చున’’ని ఆశాభావం వ్యక్తం చేశారు.

చొక్కారావు గానీ, చెన్నారెడ్డి గానీ చర్చలు ఏ అంశాలపై, ఏ ప్రాతిపదికపై జరుగుతున్నాయో చెప్పాలని పలుమార్లు విలేకరులు గుచ్చి గుచ్చి అడిగినా ఎవరూ నోరు మెదపడం లేదు. పొడి పొడి మాటలతో దాట వేస్తుండటం తెలంగాణ వాదుల్లో పలు అనుమానాలు రేకెత్తించాయి.

‘‘ప్రజాసమితి లక్ష్యాలకు విరుద్ధమైన అంశం ఎప్పుడు ఏ దశలో ఉత్పన్నమైనా వ్యతిరేకిస్తానని’’ చెన్నారెడ్డి ఒక విలేకరి ప్రశ్నకు సమాధానంగా అన్నారు. చెన్నారెడ్డి మరొక ఆసక్తికరమైన విషయాన్ని విలేకరులకు తెలిపారు.

‘‘ఢిల్లీలో ఆంధ్ర ప్రాంత పార్లమెంటు సభ్యులు తరచుగా నన్ను కలిశారు తెలంగాణ ఎంపీలు దూరంగా ఉన్నారని’’ డాక్టర్‌ చెన్నారెడ్డి అన్నారు. (దీని అంతరార్థం సెప్టెంబర్‌ నాటికి గాని తెలంగాణ ప్రజలకు అర్థం కాలేదు.)

లోక్‌ సభలో తెలంగాణపై ప్రధాని
జూన్‌ 24న ఆంధ్రప్రదేశ్‌ సాంఘిక, ఆర్థిక అభివృద్ధి కార్యక్రమాలలో తెలంగాణ ప్రజలకు ఇతోధికంగా ప్రాతినిధ్యం కల్పించడానికి కేంద్రం కృషి చేస్తున్నదని ప్రధాని లోక్‌సభలో తెలిపారు ఈ విషయమై ఇందుకు సంబంధించిన వారితో సంప్రదింపులు జరుపుతున్నామని, సమస్యలు సత్వరం పరిష్కారం కావాలని తాము ఆతృతతో ఉన్నామని ప్రధాని చెప్పారు.
వచ్చే సంచికలో….
తెలంగాణపై ప్రధాని
తుది నిర్ణయం

Other Updates