ఆకుపచ్చని-పొద్దు-పొడువాలేకాంగ్రెస్‌ అధిష్టాన వర్గం ఆహ్వానాన్ని తిరస్కరించిన తెలంగాణ ఉద్యమనేతలకు ఢిల్లీ పెద్దలు నచ్చచెప్పి వర్కింగ్‌ కమిటీ సమావేశానికి రావాల్సిందిగా మరోసారి ఆహ్వానించినారు. ‘స్వేచ్ఛగా అభిప్రాయాలు చెప్పడానికి అవకాశ మివ్వగలమ’’ని హామీ ఇచ్చిన మీదట చెన్నారెడ్డి, కొండా లక్ష్మణ్‌ ఢిల్లీికి వెళ్ళారు. చొక్కారావు, నూకల రామచంద్రారెడ్డి కూడా వర్కింగ్‌ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు.

సుమారు రెండున్నర గంటలపాటు చెన్నారెడ్డి, కొండా లక్ష్మణ్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశంలో తెలంగాణపై తమ వాదనలు వినిపించారు.

తెలంగాణలో నెలకొనివున్న పరిస్థితిని వివరించి రాష్ట్రపతి పాలన విధించాలని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సమ్మతించాలని, అవసరమైతే జనాభిప్రాయ సేకరణ జరుపుకోవచ్చునని చెన్నారెడ్డి, కొండా లక్ష్మణ్‌ తెలిపారు.

కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశంలో చెన్నారెడ్డి, కొండా లక్ష్మణ్‌ ప్రసంగాలలోని ముఖ్యాంశాలు:

  • రాష్ట్ర పోలీసుల సహకారంతో సమైక్యవాదులని పిలవబడే వర్గం దాడల వలన హింసాయుత చర్యలు జరిగాయి.
  • మే 16 బంద్‌ ప్రశాంతంగా జరగడానికి కారణం ప్రభుత్వం అనుసరించిన విధానమే.
  • మున్ముందు జరిగే సత్యాగ్రహ ఉద్యమాల్లో లక్షలాదిగా జనం పాల్గొంటారు. క్రమంగా సత్యాగ్రహ ఉద్యమం ఉధృతరూపాన్ని సంతరించుకుంటుంది.
  • తెలంగాణ ఉద్యమంతో పోల్చదగిన ఉద్యమం ఇండియాలో ముందెన్నడూ జరగలేదు.
  • అపూర్వ స్థాయిలో ఉద్యమం కొనసాగుతున్న విషాయాన్ని ముఖ్యమంత్రి ఆమోదించకపోవడం విచిత్రంగా వున్నది.
  • కొన్ని శతాబ్దాలకు పూర్వం తెలంగాణలో స్థిరపడిన అన్య ప్రాంతాల ప్రజల పట్ల సహన భావంతో వ్యవహరించడాన్ని ఆంధ్ర ప్రాంతం వారు విమర్శించడం కూడా విచిత్రంగా వున్నది.
  • మేము ప్రశాంతంగా జీవించాలని ఆకాంక్షిస్తున్నాము. మా ప్రాంతాన్ని అభివృద్ధి పరచాలని అభిషిస్తున్నాము. మాకు మేము అధినాథులుగా వుండాని వాంఛిస్తున్నాము. స్వేచ్ఛగా జీవించాలని కోరుకుంటున్నాము.
  • ద్వితీయ శ్రేణి పౌరులుగా జీవించడం పట్ల మేము విసుగు చెందాము. తెలంగాణా ప్రజలు మేల్కొన్నారు. వారిని ఏ శక్తీ అణచజాదు.

చొక్కారావు, నూకల రామచంద్రారెడ్డితో కలిసి చెన్నారెడ్డి, లక్ష్మణ్‌ సమావేశం నుంచి వెళ్ళిపోయింతర్వాత కూడా వీరు చెప్పిన విషయాలపై వర్కింగ్‌ కమిటీ చర్చించింది. ఈ నేతలతో విడివిడిగా సంప్రదింపు జరిపే అధికారాన్ని నిజలింగప్పకు యిచ్చింది కమిటీ. ఉపప్రధాని మురార్జీ దేశాయ్‌ని కూడా తెలంగాణ నేతలతో సంప్రదింపులు జరపాలని వర్కింగ్‌ కమిటీ కోరింది.

వర్కింగ్‌ కమిటీ ఆదేశానుసారం కాంగ్రెస్‌ అధ్యక్షుడు నిజలింగప్ప తెలంగాణ నేతలతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. చెన్నారెడ్డితో మురార్జీ విడిగా చర్చించారు. అంతకు ముందు నిజలింగప్ప నివాసంలో బ్రహ్మానందరెడ్డితో విడిగా చర్చలు జరిపారు. ఆ తర్వాత ఇద్దరితో సంయుక్తంగా చర్చించారు.. ఈ చర్చల తర్వాత ఉపప్రధాని పత్రికలవారితో మాట్లాడుతూ ‘‘తెలంగాణా సమస్యకు పరిష్కారం కనుగొనడానికి ఇంకా కొంత వ్యవధి పట్టవచ్చు’’ అన్నారు. గత 12 ఏళ్ళుగా పేరుకుపోయి వున్న సాధకబాధకాల ఫలితంగా ఈ సమస్య ఉత్పన్నమైనదని ఆయన చెప్పారు.
‘‘ముఖ్యమంత్రి రాజీనామా బదులు మరొక సూచన చేయగరా?’’ అని మురార్జీ ప్రశ్నించగా ‘మరొకటి లేదు’ అంటూ స్పష్టం చేశారు చెన్నారెడ్డి.

ప్రధాని ఇందిరతో నిజలింగప్ప సుదీర్ఘంగా తెలంగాణ సమస్యపై చర్చించారు.
తెలంగాణ విషయమై ఢిల్లీి సంభాషణలలో ప్రతిష్టంభన ఏర్పడినదని 1969 జూన్‌ 24న హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయంలో నిజలింగప్ప వెల్లడించారు. బెంగుళూరు వెళ్తూ ఆయన కొద్దిసేపు ఇక్కడ ఆగినప్పుడు పత్రికల వారితో మాట్లాడుతూ ‘‘మురార్జీ తెలంగాణ నాయకుతో జరుపుతున్న చర్చలపై పరిష్కారం ఆధారపడి వుంటుంద’’న్నారు.

‘తెలంగాణ ప్రజల నిజమైన కోర్కెల ప్రాతిపదికపై ఆందోళన బయలుదేరినద’ని నిజలింగప్ప అభిప్రాయ పడినారు. గోడ మీద అసభ్యరాతలు భౌతికంగా హింసించడం కంటె బాధాకరమ’ని ఆయన అన్నారు.

‘‘ఆఫీసర్ల సీనియారిటీ విషయంలోనూ, 1956 ఒప్పందం ప్రకారం తెలంగాణ ప్రాంతంలో మిగులు నిధులను ఖర్చు చేయడంలోనూ అన్యాయం జరిగినందుకు ఈ ఆందోళన ప్రారంభమైనద’’ని నిజలింగప్ప చెప్పారు.
‘‘ఒప్పందాన్ని అమలు జరపనందువల్ల ప్రజల్లో అసంతృప్తి తీవ్ర పరిస్థితికి దారి తీసింద’’ని ఆయన అన్నారు.
‘‘వెంటనే రాష్ట్రపతి పాలన విధించడం లేదా రాష్ట్ర విభజనకు అంగీకరించడం కష్టమని కేంద్రం అభిప్రాయ పడినది’’ అని ఆయన చెప్పారు.

25వ తేదీన హైదరాబాద్‌కు రావలసిన ఉపప్రధాని మురార్జీ దేశాయ్‌ ప్రయాణం రద్దయినట్లు ప్రకటించారు.
ఢిల్లీి నుండి హైదరాబాద్‌కు చేరుకున్న చెన్నారెడ్డి, లక్ష్మణ్‌కు ఘన స్వాగతం భించింది. రాష్ట్రంలో త్వరలో రాష్ట్రపతి పాలన విధించగలరన్న ఆశాభావాన్ని చెన్నారెడ్డి వ్యక్తం చేశారు. చర్చలు కొనసాగుతాయని అన్నారు.

ముషీరాబాద్‌ జైలులో సత్యాగ్రహులపై దాడి 

1969 జూన్‌ 24న సాయంత్రం 4 గంటలకు ముషీరాబాద్‌ జైలులో తెలంగాణ సత్యాగ్రహులపై ఆంధ్ర ఖైదీలు దాడి చేసినారు. అన్నంలో పురుగులున్నాయని ఒక హైస్కూలు విద్యార్థి అనడంతో వంటగదిలో బాధ్యతలు చూస్తున్న ఒక ఆంధ్ర ఖైదీ ఆ విద్యార్థిని కొట్టడం, ఆ విద్యార్థి ఎదురు తిరగడంతో ఘర్షణ మొదలైంది. అప్పటికి కొద్ది సేపటి క్రితమే జీవిత ఖైదు అనుభవిస్తున్న శంకర్‌ అనే వ్యక్తి తెలంగాణ వారితో ‘మీ పై దాడి చేయాలని ప్రయత్నిస్తున్నారు. జాగ్రత్తగా ఉండండి’ అని సత్యాగ్రహులను హెచ్చరించారు. సరిగ్గా ఆయన చెప్పిన కాసేపటికే దాడి జరిగింది. ఈ ఘర్షణ 2 గంటలపాటు సాగింది. చాలా మంది దాడిలో గాయపడినారు. పోలీసులు లాఠీచార్జీ చేసినారు. రెండుసార్లు గాలిలోకి కాల్పులు జరిపి పరిస్థితిని అదుపులోనికి తెచ్చారు. ఆంధ్ర ఖైదీలలో ఈశ్వర రెడ్డి అనే గుండా ఉండేవాడు. ‘‘మీకు రాజ్యం కావాల్నా’’ అంటూ కర్రతో దాడి చేయగా నృపతుంగ స్కూల్లో ఉపాధ్యాయునికి తీవ్రంగా గాయాలైనాయి. గాయపడిన వారిని నేలపై పడుకోబెట్టినారు. ఈ సంఘటన తెలుసుకొన్న సంగం లక్ష్మీబాయి వెంటనే జైలుకు వచ్చి అధికారులపై మండిపడ్డారు. డిల్లీ నుండి అప్పుడే వచ్చిన చెన్నారెడ్డి హుటాహుటిన జైలుకు వచ్చి ‘‘ఐదు నిమిషాల్లో గాయాలైన వారిని హాస్పిటల్‌కు పంపకపోతే జైలును కాలబెట్టిస్త’’ అని అధికారులను హెచ్చరించారు. దీనితో వెంటనే గాయపడ్డవారిని, 70 మందిని ఉస్మానియా హాస్పటల్‌కు తరలించారు. ఈ దాడిలో గాయపడిన వారిలో కొండా వెంకటరంగారెడ్డి కుమారుడు రామచంద్రారెడ్డి కూడా ఒకరు.

జైలులో తెలంగాణ సత్యాగ్రహులపై దాడి వార్త తెలియగానే వేలాదిగా ప్రజలు జైలు బయట గుమిగూడినారు. నినాదాలిచ్చారు. సమితి నాయకులైన మాణిక్‌రావు, అంజయ్యలు జైలులోనికి ప్రవేశించి సత్యాగ్రహులను శాంతింప చేసేందుకు ప్రయత్నిస్తే ఎస్‌.బి.గిరి జైలు బయట పరిస్థితి అదుపు తప్పకుండా చూశారు.

ముషీరాబాదు జైలును సందర్శించడానికి వస్తున్న ఎం.పి. జి. వెంకటస్వామి వాహనం జైలు సమీపంలో బోల్తాకొట్టి ఆయనతో సహా 15 మందికి గాయాలైనాయి. స్పృహ కోల్పోయిన వెంకటస్వామిని ఉస్మానియా హాస్పటల్‌కు తరలించారు. తనను చంపడానికి బ్రహ్మానందరెడ్డి కుట్ర చేశారని, తుపాకీతో కాల్చడం వల్ల బుల్లెట్‌ టైరుకు తగలడంతో టైరు పేలి బోల్తా పడిందని వెంకటస్వామి ఆ తర్వాత ప్రకటించారు.

మరో ప్రక్క ఆబిడ్స్‌లోని బృందావన్‌ హోటల్లో ఆంధ్ర ప్రాంతం నుండి తెచ్చిన గుండాలను దాచారని తెలియడంతో శ్రీధర్‌ రెడ్డి నాయకత్వాన విద్యార్థులు, యువకులు హోటల్‌పై దాడి చేసినారు. ఈ దాడిలో గోడ దూకి తప్పించుకోవాలనుకున్న భవనం వెంకట్రామ్‌ కాలు విరగ్గొట్టుకున్నారు. జీవితాంతం ఆయన కుంటుతూనే వున్నారు.

జూన్‌ 25న తెలంగాణ బంద్‌

ముషీరాబాద్‌ జైలులో సతాగ్రహులపై జరిగిన దాడికి నిరసనగా జూన్‌ 25న తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చారు చెన్నారెడ్డి, శ్రీధర్‌ రెడ్డి. ఆంధ్రప్రజలపై ప్రతీకార దాడులకు దిగవద్దని, శాంతియుతంగా జరపాలని వారు ప్రజలకు విజ్ఞప్తి చేసినారు.

ప్రతిరోజు వేలాదిగా తెలంగాణ ఉద్యమ కారులు అరెస్టవుతున్నారు. ఎన్‌.జి.ఓ. సమ్మె కొనసాగుతూనే ఉన్నది. రోజు రోజుకూ సత్యాగ్రహుల సంఖ్య పెరుగుతూనే ఉన్నది. లక్షలాది మంది సత్యాగ్రహాల్లో పాల్గొనాలని నేతలు పిలుపునిచ్చారు.

నేతల అరెస్టు – రాజమండ్రి జైలుకు తరలింపు

జైలులో గాయపడిన వారిని హాస్పిటల్‌కు చేర్చి ఢల్లీి చర్చల తీరును సహచరులకు వివరించి, తెల్లవారి బంద్‌కు సన్నాహాలు చేసి అర్థరాత్రి నారాయణగూడలోని మిత్రుని ఇంట్లో విశ్రాంతి తీసుకోబోతున్న చెన్నారెడ్డిని, తన ఇంట్లో నిద్రిస్తున్న కొండా లక్ష్మణ్‌ బాపూజీని పోలీసులు అరెస్టు చేశారు. తెలంగాణా ప్రాంతీయ సంఘం మాజీ అధ్యక్షుడు అచ్యుత్‌ రెడ్డిని, సోషలిస్టు పార్టీనేత బద్రీ విశాల్‌ పిట్టీ, శాసనసభ్యులు హాషీం, మాణిక్‌రావు, కార్మిక నాయకులు అంజయ్య, హెచ్‌.ఎం.ఎస్‌. నేత ఎస్‌.బి. గిరి మొదలైన వారిని ఆ రాత్రి అరెస్టు చేశారు.

ప్రివెంటివ్‌ డిటెన్షన్‌ చట్టం కింద ఈ నేతలను అరెస్టు చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు. నిర్భంధించిన 18 మంది నాయకులను రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు 25వ తేదీ సాయంత్రానికి తీసుకువెళ్ళారు పోలీసులు. దారిలో విజయవాడకు 40 మైళ్ళ దూరంలో ఉన్న షేర్‌ మహమ్మద్‌పేట రహదారి బంగ్లాలో మధ్యాహ్న భోజన ఏర్పాట్లను కృష్ణాజిల్లా ఎస్‌.పి. ప్రభాకర్‌రావు చేసినారు.

ముందస్తు పథకం ప్రకారమే తెంగాణా నేతలను అరెస్టు చేసినట్లు ప్రజలు, ఉద్యమ నేతలు భావించారు. పదిహేను రోజు క్రితమే వీరి కోసం రాజమండ్రి జైలులో కొన్ని గదుల్లోని ఖైదీలను ఇతర గదులకు తరలించి ఆ గదులకు సున్నం వేసినారని పత్రికలు రాసినవి. 24 రాత్రి తెలంగాణ నేతలను అరెస్టు చేస్తున్న విషయం తెలిసే మురార్జీ దేశాయ్‌ 25న హైదరాబాద్‌ ప్రయాణాన్ని రద్దు చేసుకున్నారు. ఈ నేతల అరెస్టుకు ఆదేశాలిచ్చే ప్రధాని ఇందిర ముందుగానే జపాన్‌ పర్యటనకు వెళ్ళినారు.

Other Updates