మన శరీరంలో ‘చెయ్యి’ ఒక మహాద్భుతమైన అవయవం. అది శ్రమకు సంకేతం. సకల రకాల పరికరాలు మానవుడు తన చేతులతోనే సృష్టిస్తున్నాడు. మన భాస్వంతమైన సంస్కృతి నిర్మాణంలో చెయ్యి పాత్ర తిరుగులేనిది. సర్వవిధాల పనుల్ని ఈ చేతులే చక్కగా చేసి పెడుతున్నాయి. తెలంగాణ భాషలో చేతులకు సంబంధించిన పదాలూ, పదబంధాలూ ప్రత్యేకంగా వున్నాయి.

డా|| నలిమెల భాస్కర్‌

తెలుగులో ‘ఆఘమేఘాలమీద అతన్ని ఆసుపత్రికి తరలించారు’ అనే అభివ్యక్తి ఒకటి ఉంది. దీనికి సమానార్థకంగా తెలంగాణలో ‘చేతులమీద చేతులమీదనే వాన్ని దవాఖానల శెరీక్‌ చేసిండ్రు’ అనే వాక్య పద్ధతి ఉంది. రెండురకాల వాక్యాల సారమూ వెంటనే ఆసుపత్రిలో చేర్చారనే! అయితే తెలంగాణ వ్యవహారంలో చేతులమీద అని రెండు పర్యాయాలు అనడమూ, ఆఘమేఘాలమీద అనే సహజత్వానికి దూరమైన అతిశయోక్తి లేకపోవడమూ విశేషం. ‘వాడు చేయి తిరిగిన రచయిత’ అని తెలుగులో వుంది ఓ జాతీయం. దీనికి అర్థం అతడు ప్రసిద్ధుడైన నిపుణుడైన రచయిత అని. అయితే తెలంగాణలో ‘చెయ్యి తిరిగిన’ అంటే అర్థం వేరు. ‘నాకు కొద్దిగా చెయ్యి తిరిగితే ? అప్పు కడుత తియ్యి’ అంటున్నారు తెలంగాణ ప్రాంతంలో. ఇక్కడ డబ్బుల విషయంలో కాస్త వెసులుబాటు కావడం అని అర్థం. ఏ మాత్రం అవకాశం వున్నా డబ్బులు తిరిగి చెల్లిస్తానని చెప్పడం.

‘చేతి చమురు బాగా వదిలింది’ అని తెలుగులో నుడికారం. ఈ సందర్భంలో చమురు అంటే పైకం, డబ్బులు అని అర్థం. దీన్ని తెలంగాణలో ‘ చేతిల గల్ల మైల పోతే పోయింది తియ్యి’ అనే పద్ధతిలో వాక్యవ్యవహారం వుంది. తెలుగులోని చమురు ఇక్కడ మైల అయ్యింది. నిజానికి తెలంగాణ నుడికారం జీవితానికి దగ్గరగా వుంది. అందరి చేతులకి చమురు వుండే అవకాశం లేదు. పైగా వున్నా అది రాసుకుంటేనే వుంటుంది. అయితే అందరి చేతులకూ యింతో కొంతో మైల మాత్రం వుండే అవకాశం వుంది. అందుకే ఇది జీవితానికీి వాస్తవానికీ దగ్గర.

ఈ చేతులకు సంబంధించిన మరికొన్ని పదాలు చూద్దాం: ఉడుకుతున్న అన్నం కలియబెట్టడానికి తెలంగాణలో ‘చెయ్యి చెంచె’వుంది. ఇది చేతి ఆకారంలో వెడల్పుగా లోతు తక్కువగా ఉన్న చెంచా. మరి ‘చెయ్యి చెంచా’ను తెలంగాణేతర ప్రాంతాల్లో ఎలా వ్యవహరిస్తారో తెలియదు. తెలంగాణలో పూర్వం పండ్లను తెనుగువాళ్ళు గంపల్లో పెట్టుకుని ఇల్లిల్లూ తిరుగుతూ అమ్మేవాళ్ళు, మనం ఓ పది పండ్లను కొంటే, వాళ్ళు ఐదేసి పండ్లు మనకు యిస్తూ ‘ఇగో రెండు చేతుల పండ్లు ఇచ్చిన. చూసుకో అవ్వా’ అనేవా ళ్ళు. పదిహేను పండ్లకు మూడు చేతులు. అదీ వాళ్ళ లెక్క. చేతికి ఐదు వేళ్ళు ఉంటాయి కనుక చాలా సులభమైన గణితం వాళ్ళది.

కుడిచేతిని తెలంగాణలో ‘బువ్వచెయ్యి’ అంటారు. కుడిచెయ్యి అంటే ‘కుడిచే చెయ్యి’ అని అర్థం. అంటే తినేది అని. అట్లాగే ‘బువ్వ చెయ్యి’ అంటే బువ్వ తినే చెయ్యి అని. ఎడమ చెయ్యిని ‘పుర్ర చెయ్యి’ అంటారు. పుర్రు అంటే పలుచని మానవ మలం. దాన్ని కడుక్కునే చెయ్యి ‘పుర్రది’. ఇంకా ‘తొంట చెయ్యి’ అనికూడా అంటారు. ‘తొంట’ అంటే ‘తొల్లిట’ అని అర్థం.

‘తొల్లిట’ అంటే మొదటిది అని. ఎడమచేయి తర్వాతే కుడిచేయి వుంటుంది కదా! ఎడమచేయి పూర్వం. కుడిచేయి పరం. ఎడమచేయిని తెలంగాణలో ‘రొడ్డ చెయ్యి’ అని కూడా వ్యవహరిస్తున్నారు. ‘రొడ్డు’ అంటే పులుపు అని అర్థం. కానీ ఈ ‘రొడ్డ’కి అర్థం ఏమిటో మరి! ‘ఇక పెద్ద దిక్కును కోల్పోయాం, కుడి భుజం విరిగినట్లయింది’ అనే తెలుగులోని వాక్యాలకు సరిగా తెలంగాణలో ‘చెయ్యి ఇరిగినట్లయింది’ అని అంటున్నారు. డబ్బులకు ఇబ్బంది ఉన్నప్పుడు ‘నా చెయ్యి తంగయింది’ అనేది తెలంగాణ వ్యవహారం. ‘తంగ్‌’ హిందీ పదం. ఇతర ప్రాంతాల వ్యవహారంలో ‘డబ్బులకు టైట్‌గ ఉంది’ అనే అభివ్యక్తి ఉన్నట్లుంది. ‘తంగ్‌’ అయినా, ‘టైట్‌’ అన్నా అర్థం ఒకటే! తెలంగాణలో తౌరక్యాంధ్రం, ఇతర ప్రాంతాల్లో ఆంగ్లాంధ్రం.’అతనిది ఎముకలేని చెయ్యి’ అనేది చేతులకు సంబంధించిన మరో జాతీయం. ఇది దానగుణానికీ, దాతృత్వానికి, వితరణ శీలానికి, ఉదారత్వానికి గుర్తు. తెలంగాణలో మాత్రం ‘వానిది పెద్ద చెయ్యి’ అంటారు. ఏది పెట్టినా, దేన్ని ఇచ్చినా పెద్ద మొత్తంలోనే ఉదారంగా ఉంటుంది అని చెప్పడం. ‘ఎముకలేని చెయ్యి’ అనడం కొంత అసహజంగా ఉంది. మనిషి వెన్నెముక గల ప్రాణి కదా! ‘పెద్ద చెయ్యి’ అనడం సులువుగా సహజత్వానికి సమీపంగా ఉంది.

ఇక సంచులు రకరకాలుగా ఉంటాయి. చిన్న సంచులూ, పెద్ద సంచులూ, బొడ్లె సంచులూ మొదలైనవి. ఇట్లాంటి వాటిల్లో ‘చెయ్యి సంచి’ ఒకటి. అది బజారుకు వెళ్ళినపుడు, ప్రయాణాలు చేసినపుడూ వాడుతూ వుంటాం. ముఖ్యంగా గుడ్డసంచి అది. ఇప్పుడు రకరకాల సంచులు అంటే ప్లాస్టిక్‌ సంచులు, జ్యూట్‌ సంచులు, రబ్బర్‌ సంచులు, పాలితీన్‌ బ్యాగులు వచ్చినా పూర్వం బట్ట సంచులే ఉండేవి. చెయ్యి సంచికైతే చేతులతో పట్టుకోవడానికి వీలుగా రెండు నాడలు ఉండేవి. ఈ చెయ్యి సంచిని తెలుగులో ‘చేసంచి’ అని అంటున్నారు.

‘తాళం చెయ్యి’ అనేది మరొక మాట. నిజానికి ఇది తాళం చెవి. ఉచ్ఛారణాత్వరలో చెవి చెయ్యిగా మారింది. బహువచనంలో తాళం చేతులు అని కూడా అంటారు కొందరు తెలంగాణలో. ఆధునిక ప్రమాణభాషలో ‘తాళాలు’ అంటున్నారు. నిజానికి తాళం వేరు-తాళం చెవి వేరు.

విసుర్రాయికి పై బిళ్ళకి ‘రాచెయ్యి’ ఉంటుంది. దీన్ని పట్టుకునే విసుర్రాయి తిప్పుతారు-విసురుతారు. ‘రాచెయ్యి’ అంటే రాతికి ఉన్న చెయ్యి’ అని అర్థం. మరి దీన్ని ఆంధ్ర, రాయలసీమ తెలుగులో ఏమంటున్నారో తెలియదు. తెలంగాణలో ‘చెయ్యి పట్టుకొని పి.. (మానవ మలం) తొక్కిస్తాడు’ అని సామెత. అంటే బలవంతంగా ఎదుటి వ్యక్తితో తప్పు చేయించడం, మోసగించాడు, మాట తప్పాడు అనే అర్థంతో ‘వాడు నాకు చెయ్యిచ్చిండు’ అంటున్నారు. తెలుగు ‘హస్తవాసి’కి బదులు తెలంగాణలో ‘చేతిగుణం’; స్వయంకృ తాపరా ధానికి బదులుగా ‘చేజేతుల చేసుకునుడు’ అనే వాక్యరీతులు తెలంగా ణలో వున్నాయి. తెలంగాణలో కొంతమంది ‘చేతులమీద’ రొట్టె చేస్తారు. ఈ రొట్టెలు రుచికరంగా వుంటాయి. పిండిని పీటమీద వేసి ఒత్తి చేయకుండా రెండు చేతులమీద, అరచేతులమీద వేసుకుని చేస్తారు. ఒకరి బాధ్యతలన్నీ మరొకరు నెత్తిన వేసుకున్నప్పుడు ‘చేతవ ట్టుడు’ అంటారు. సేవ చేస్తున్నప్పుడు ‘శాత’ అని వ్యవహరిస్తారు. ఇదీ చెయ్యికి సంబంధించిన వ్యవహారం తెలంగాణలో.

Other Updates