uru

శ్రీ అన్నవరం దేవేందర్‌

”చెరువంటే ఆకలి తీర్చే బువ్వకుండ

అది దూప తీర్చే నీళ్ళగోలెం

వడ్లిత్తులు పండిచ్చి

పిడికెడు మెతుకులు నోట్లెకు తెచ్చే ఆవారం”

ఊర్లల్ల చెర్లు పూడిక తీసే కాలం కండ్ల ముందు కానస్తంది. వానలు పడంగనే చెర్లు నిండి నీళ్లగోలెం లెక్క అయే కాలం కండ్లముందున్నది. ఇప్పుడు పుట్టి బుద్ధి ఎరిగినోల్లు ఎవలు చెర్లల్ల గడ్డపార ఏసి తవ్వంగ చూల్లేదు. వాళ్ళ కన్న ముందే తవ్విచ్చిన చెర్లు ఇవన్ని. వీటికి ఇప్పుడు లోతు తీసుడు నిండిపోయిన మన్ను తీసుడు జరుగుతంది. అసలు చెర్లు సక్కగ నిండిందెన్నడు. చెరువెనుక పొలం నిండుగ పారిందెన్నడు. చెర్లన్ని పూడికతో నిండుడు, కట్టుకాలువల నీళ్లు రాకుంట అవుడు కట్టలు కుంగిపోయిన రోజులే ఇన్నొద్దులు కన్పించే, ఇగనన్న చెర్లకు నీళ్ల కళ వస్తదని ఊర్లల్ల సంబురపడుతండ్రు. ఒక్క చెరువు ఉంటే ఊరందరికి మొఖం తెలివి. ఎవుసం చేసుకునేటోల్లు మొఖంల నవ్వు చూస్తం. బట్టలు ఉతికేటోల్లకు నీళ్ల కరువు లేకుంట అయితది. చాపలు పట్టేటోల్లకు పండుగే పండుగ. ఇగ చెర్లల్ల నీళ్ళుంటేనే శాదబాయిల్ల నీళ్ళుండేది ఎన్కట. ఇప్పుడు శాదబాయిలు లేవుగని సుట్టు పక్కల నీళ్ళ బాయిలు బోర్లల్లకు నీళ్ళు వస్తయి. ఊరికి పెద్ద చెరువు ఉంటే అండ్లనే పోరగాండ్లు ఈత నేర్చుకుంటరు. ఇప్పుడున్న ఇరవై ముప్పై ఏండ్ల పడుసు పోరలకు ఊర్లల్ల ఈత రానేరాదు. ఎందుకంటే వానలు యాడ కొట్టే! చెర్లు యాడనిండె? అందుకే ఈత నేర్సుకోలేదు. చెర్లు లేకుంటే బాయిలు ఉంటుండే, అవ్విసుత లేకుంట అయిపోయినయి. ఇగ ఈత రాని తరం మిగిలిపోయింది.

చెరువు ఎనుక ఎవుసం అంటే అల్కగ. ఎందుకంటే దున్ని నాటేస్తే ఇక అంత నీళ్లపారకం చిన్న కాలువ ద్వారా అదే పారుతుంది. పంట చేతిక చ్చినంక కోసుకోని అమ్ముకునుడే ఉంటది.

చెర్లు ఎండిపోయి మస్తు రోజులైంది. దానికి మరమ్మతు ఏమోకని వాటి తెరువుకు పోయినోల్లే లేరు. ఇప్పుడు కథ వేరు. మన కథ, మన చెర్లు, మన నీళ్ళు. పోయినేడు వానలు పడలేదు గని ఈ యేడు వానలు పడుతె బొంబాటుగ నీళ్ళు వస్తయి. పంటలు పండుతయి. వానలకు అనుకూలంగా చెర్లు దురుస్తు అయితన్నయి. ఇయ్యాల రేపు ఊర్లల్ల చెర్లు, కుంటలు నీళ్ళతోని నవ్వుతున్నయి. చెర్ల ర్యాగడి మట్టి ఎవుసం చేసుకునేటోల్లు తీసుక పోతండ్రు. ర్యాగటి అంటే జావ, పురాగ బలం అన్నట్టు. చెర్లు నిండినంక ఊరంత జలకళ వస్తది. వానలు పడ్డంక నీళ్ళు వచ్చేతందుకు కట్టుకాలువలు సాపు అయితన్నయి. నీళ్ళు ఎక్కడికో ఎల్లి పోకుంట సర్రున వచ్చేటట్టు కాలువలు అయితన్నయి. గని అక్కడక్కడ చెర్ల పక్కనపొన్న గుట్టలు మాయం అయితన్నయి. గుట్టలమీంచే వాన నీళ్ళు వస్తయి. గుట్టల కిందనే చెర్లు కుంటలు ఓదాని కింద ఒకటి గొలుసుల లెక్క ఉంటయి. గుట్ట మాయం అయితే అక్కడ బొందల గడ్డ లెక్క కయ్యలు అయితయి. నీళ్ళురావు మనగుట్టలు అట్లనే ఉండేటట్టు ఉంటే చెర్లు సుత మస్తు నిండుతయి. ఎవసాయదారులు ఒక్క ఫసలు కాదు రెండు ఫసలు వడ్లు పండిచ్చుకుంటరు. చెర్లు నింపేతందుకు నీళ్ళకు సుత కాలువలు తయారైతన్నయి. గోదాట్ల నుంచి ఎకాఎకిన మన చెర్లల్లకు నీళ్ళు వచ్చి పడుడంటే మామూలు ముచ్చట కాదు. ఎన్కట ఎవ్వలు అనుకోలేదు ఎక్కన్నో గోదారినీళ్ళు మన ఊల్లెకు వచ్చుడు అయితదని, ఊర్ల్ల ముసలోల్లు ముడిగోళ్ల కాన్నుంచి అందరు సంబుర పడుతండ్రు.

చెర్లు కుంటలు నింపుడేం సంగతి ఇంటికి నల్లలు వస్తున్నయన్న ముచ్చట్లు సుత రచ్చబండ కాడపెట్టుకుంటుండ్రు. ఎక్కడ గోదావరి ఎక్కడి క్రిష్ణా నది, ఎక్కడి మానేరు ఇట్లాంటి వాగుల్ల కెల్లి వరదలు వరదలుగ మంచినీళ్లు పైపులైన్లల్ల వచ్చి మన వాకిట్ల నల్లల కెల్లి మన బిందెల పడుడంటే ఏంది. ఇది అయితె మహా గొప్ప సంబురం. సుక్క నీళ్ళులేని కాన్నుంచి ఇంటింటికి నీళ్ళు తెచ్చుకునుడు ఊరూరి చెరువు నాపుడు అయితందంటే మనది మనం రాజ్యం చేసుకుంటే గిట్లనే ఉంటది. లేకుంటే ఎట్లుంటది. ఎన్కటి కెల్లి చూడలేదా!

ఎల్లకాలం కరువుకు కొట్లాడిన మన పల్లెలకు నీళ్ళ సుక్కలు రాబోతున్నాయి. ఎవుసానికి, మంచినీళ్ళకు రానున్న రోజుల్ల రంధి లేకుంట అయితది. చెరువు అంటే ఈతకొట్టొచ్చు, చాపలు పట్టొచ్చు, బట్టలు పిండుకోవచ్చు, చెరువు కట్ట పొంట నడిచి పోవచ్చు, కట్టపొంటి ఉన్న ఈత వనంల కూకొని తియ్యటి కల్లు తాగొచ్చు.

చెరువునిండితేనే ఎవుసం పండుగ

మత్తడి దుంకుతె మనిషి నవ్వు

చెరువు సబ్బండ కులాలకు పాణాపాణం.

 

Other Updates