రాష్ట్రంలో నదులను, వాగులను పునరుజ్జీవింపజేయడానికి వాటిపై అనువైన చోట్ల చెక్ డ్యాంలు నిర్మించాలని, చెక్ డ్యాంలను ఈ వాగులపై, ఎక్కడ నిర్మించాలి, వాటి సాంకేతికాంశాలను అధ్యయనం చేసి అంచనా వ్యయంతో కూడిన ఒక సమగ్ర నివేదికను సమర్పించాలని ముఖ్యమంత్రి కేసిఆర్ సాగునీటి శాఖ అధికారులను ఆదేశించినారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు క్షేత్ర స్థాయి ఇంజనీర్లకు జలసౌధలో ఒక రోజు వర్క్ షాప్‌ను సాగునీటి శాఖ నిర్వహించింది. ఈ వర్క్ షాప్ కు ఈఈ స్థాయి వరకు ఇంజనీర్లు హాజరు అయినారు.
మొదట ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్ వర్క్ షాప్ లక్ష్యాలను, ముఖ్యమంత్రి చేసిన సూచనలను వివరించారు. తెలంగాణ జలవనరుల అభివద్ది సంస్థ ఛైర్మన్ వి. ప్రకాష్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించినారు. ముఖ్యమంత్రి తీసుకున్న ఈ నిర్ణయం చాలా కీలకమైనదని అన్నారు. తెలంగాణ ఉద్యమం జరుగుతు న్నప్పుడు 2000 సంవత్సరంలో మంజీరా నదిపై తాను తిరిగినప్పుడు మహారాష్ట్రా, కర్ణాటక రాష్ట్రాలు మంజీరా, దాని ఉపనదులపై నిర్మించిన చెక్ డ్యాంలు, ఆనకట్టలను చూసినానని, పుష్కలంగా నీటి వనరులు ఉన్న తెలంగాణలో కూడా ఇటువంటి స్థితి ఏర్పడాలని తాను అప్పుడు ఆశించానని, ఇప్పుడు ముఖ్యమంత్రి నిర్ణయంతో అది నిజం కాబోతున్నదని అన్నారు. షేక్ హాండ్ చెక్ డ్యాం లను వీలున్న చోట నిర్మించాలని సూచించారు. జహీరాబాద్ ప్రాంతంలో గొట్టిగానిపల్లే గ్రామంలో గతంలో ఇటువంటి ఒక గొప్ప ప్రయోగం సఫలం అయ్యిందని గుర్తు చేశారు. ఆ గ్రామంలో ఉన్న ఒకే ఒక వాగుపై 12 చెక్ డ్యాంలని నిర్మించినందున ఆ గ్రామంలో నీటి వనరుల లభ్యత పెరిగి ఏటా రెండు పంటలు పండిస్తున్నారని అన్నారు. గొట్టిగాని పల్లెలు రాష్ట్రమంతా ఏర్పడాలని ఆయన ఆకాంక్షించారు.
ఆనంతరం విజయ్ ప్రకాష్ చెక్ డ్యాంల నిర్మాణానికి ఎంపిక చేయాల్సిన వాగులని ఎట్లా గుర్తించాలి, వాటి సాంకేతికాంశాలని ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. NRSA వారి మ్యాపుల ద్వారా విపులంగా చర్చించారు. రాష్ట్రంలోని నదులను, వాగులను మొత్తం 8 స్థాయిల్లో వర్గీకరించామని, చెక్ డ్యాంల నిర్మాణానికి స్థలాలను 4 ఆ పైన స్థాయి కలిగిన నదులపై ఎంపిక చేయాలని సూచించారు. ప్రాజెక్టుల కమాండ్ ప్రాంతాల్లో ఉన్న వాగులను ప్రథమ ప్రాధాన్యత కింద ఎంపిక చేయాలని అన్నారు. ఇప్పటికే నిర్మించబడిన చెరువులు, జలాశయాలకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా తగినంత నీటి లభ్యత ఉన్న వాగులపైననే చెక్ డ్యాంలను ప్రతిపాదించాలని అన్నారు.
చెక్ డ్యాంల మధ్య దూరాన్ని అక్కడి స్టానిక పరిస్థితులను బట్టి నిర్ణయించాలని, ప్రాజెక్టుల కమాండ్ ప్రాంతాల్లో షేక్ హాండ్ చెక్ డ్యాం లు ప్రతిపాదించాలని, కమాండ్ లో లేని వాగులపై అక్కడి స్థానిక పరిస్థితుల ఆధారంగా ప్రతిపా దించాలని సూచించారు. మంచి రాతి పునాది కలిగిన స్థలాలను ఎంపిక చేయాలని అన్నారు. 3 మీటర్ల లోతున భూగర్భ జలాలు లభ్యం అవుతున్న ప్రాంతాల్లో చెక్ డ్యాం లను ప్రతిపాదించరాదని, Over Exploited గ్రామాలకు అధిక ప్రాధాన్యం కల్పించాలని భూగర్భ జల శాఖ డైరెక్టర్ పండిత్ సూచించారు. త్వరలోనే మార్గ నిర్దేశకాలు అందజేస్తామని ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళిధర్ అన్నారు.