నగర, పట్టణ ప్రాంతాల్లోని చెరువుల అభివృద్ది, పరిరక్షణ పైన పురపాలక శాఖ మంత్రి కె.టి. రామారావు,సాగునీటి శాఖ మంత్రి హరీష్ రావులు ఏప్రిల్ 10న జలసౌధలో అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. తెలంగాణలోని ప్రతి మున్సిపాలీటీ, జిల్లా కేంద్రాల్లో ఒక్కో చెరువును మెదటి దశలో అభివృద్ది చేస్తామన్నారు. నగర ప్రాంతాల్లోని చెరువులను కబ్జాలకు గురికాకుండా కాపాడేందుకు, వాటిని సుందరీకరించేందుకు సమగ్రమైన ప్రణాళికలతో ముందుకు రావాలని సాగునీటి, పురపాలక శాఖల విభాగాల అధిపతులకు మంత్రులు అదేశాలు జారీ చేశారు.
పురపాలికల్లోని చెరువుల అభివృద్ది చేసేందుకు పురపాలక శాఖ అధికారులు, రెవెన్యూ, సాగునీటి శాఖాధికారులు కలిసి పనిచేయాలన్నారు. చెరువుల పూర్తి స్థాయి నీటిమట్టం (ఎఫ్‌టీఎల్) నిర్ధారించి, సాధ్యమైనంత త్వరగా చెరువులకు ఫెన్సింగ్ వేయాలన్నారు. మరోవైపు చెరువుల భూములపైన ఉన్న కేసుల పరిష్కారానికి మరింత చురుగ్గా ప్రయత్నాలు చేయాలన్నారు.
హైదరాబాద్ నగర పరిధిలో ఉన్న చెరువులపైన ఈ సమావేశంలో ప్రత్యేక చర్చ జరిగింది. నగరంలోని చెరువుల పరిరక్షణ, అభివృద్ది కోసం హెచ్ యండిఏ, జిహెచ్‌యంసి, మెట్రో వాటర్ వర్క్ బోర్డు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, పర్యాటక శాఖల అధికారులు ఒక బృందం ఏర్పాటు చేయాలన్నారు. ముఖ్యంగా చెరువులల్లోకి వచ్చే మురికి నీటికి అడ్డుకట్ట వేసేందుకు మెట్రో వాటర్ వర్క్స్ యస్‌టిపిల నిర్మాణానికి ఉన్న అన్ని అవకాశాలను పరిశీలించాలని, పారిశ్రామిక వ్యర్ధాలకు అడ్డుకట్ట వేసేందుకు పిసిబి పనిచేయాలన్నారు.
మొదటి దశలో నగరంలోని చెరువుల అభివృద్ధి కోసం సూమారుగా వంద కోట్లకు పైగా అంచనాలతో తయారు చేసిన ప్రణాళికలను అధికారులు మంత్రులకు వివరించారు. ఈ ప్రణాళికల తయారీలో భాగంగా దేశంలోని పలు ప్రాంతాల్లోని చెరువుల పరిరక్షణ కోసం చేపట్టిన అత్యుత్తమ విధానాలను అధ్యయనం చేసినట్టు తెలిపారు. నగరంలోని చెరువులు కబ్జా కాకుండా సుమారు 30 చెరువులకు ఫెన్సింగ్ వేశామని, స్థానికుల సహయ సహకారాలతో వాటి రక్షణకు ప్రయత్నాలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. త్వరలోనే జిహెచ్‌యంసి పరిధిలోని చెరువుల పరిరక్షణ కోసం ప్రత్యేక డ్రైవ్ చేపడతామని మంత్రి కె.టి. రామారావు తెలిపారు. చెరువుల్లో వెలిసిన అక్రమ కట్టడాల కేసులను జిహెచ్‌యంసిలో ఏర్పాటు చేయనున్న ట్రిబ్యూనల్ పరిధిలోకి తీసుకుని వచ్చేందుకున్న అవకాశాలను పరిశీలించాలన్నారు. హైకోర్టు తీర్పు, మార్గదర్శకాలకు అనుగుణంగానే తాము చెరువుల పరిరక్షణ చర్యలు తీసుకుంటున్నామని, యఫ్‌టియల్ నిర్మాణాల విషయంలో స్టేలు తీసుకుని రావడం వల్ల ఈ ప్రక్రియకు విఘాతం కలుగుతున్న తీరుని హైకోర్టుకు తెలిపేందుకు ఛీఫ్ జస్టిస్‌ను కలవాలని ప్రిన్సిపల్ సెక్రటరీలకు అదేశాలు జారీ చేశారు.
నగరంలోని ప్రతి చెరువుకు ఒక నోడల్ అధికారిని ఏర్పాటు చేయడం వాటి అభివృద్ధి కార్యక్రమాలను వేగంగా చేయవచ్చన్నారు. ఈ మేరకు అధికారులే స్వయంగా ముందుకు రావాలని మంత్రులు కోరారు. పురపాలికలు, పట్టణాల్లోని చెరువుల అభివృద్ధి కోసం సాగునీటి శాఖ పూర్తి సహకారం అందిస్తుందని మంత్రి హరీష్ రావు తెలిపారు. మిషన్ కాకతీయ గ్రామాల్లో విజయవంతం అయినట్టుగానే పట్టణాల్లోనూ ఈ కార్యక్రమం విజయవంతం అయ్యేలా చూడాలన్నారు. పట్టణాల్లోని చెరువుల అభివృద్ధి కోసం సాధ్యమయినన్ని ఎక్కువ చెరువులను ట్యాంక్ బండ్ తరహాలో అభివృద్ధి చేస్తామన్నారు.
ఈ సమావేశంలో హెచ్ యండిఏ, జిహెచ్‌యంసి, మెట్రో వాటర్ వర్క్ బోర్డు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, పర్యాటక శాఖ, సాగునీటి శాఖ అధికారులు పాల్గొన్నారు.