kcr‘మిషన్‌ కాకతీయ’ ద్వారా చందుపట్ల చెరువుకు మహార్దశ పట్టనున్నదని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ప్రకటించారు. నల్లగొండ జిల్లా నకిరేకల్‌ మండలంలోని చందుపట్ల గ్రామంలోని చెరువు పూడికతీత పనులను ఏప్రిల్‌ 26న పలుగు, పారపట్టి ఆయన ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో సి.ఎం. మాట్లాడారు. చందుపట్ల చెరువు 102 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నదని, ఈ చెరువులో పూడికతీయడానికి ఇప్పటికే 55 లక్షల రూపాయలు మంజూరు చేశామని, మరో కోటి యాబై లక్షల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.

ఈ చెరువులో పూడిక తీయడంవలన చెరువు క్రింద 7 గ్రామాలలోని వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని ఆయన తెలిపారు. ఈ చెరువుకు యస్‌.యల్‌.బి.సి. కెనాల్‌కు ఫీడర్‌ ఛానల్‌ కనెక్షన్‌ ఇవ్వడంవలన ఈ ప్రాంతంలో ఎప్పుడూ నీరు ప్రవహించే అవకాశం ఏర్పడుతుందని ఆయన తెలిపారు.

ఈ చెరువు పనులను త్వరితగతిన పూర్తి చేయించినట్లయితే నకిరేకల్‌ ఎం.యల్‌.ఏ.కు నియోజకవర్గ అభివృద్ధి కొరకు 5 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరుగుతుదని, ఈ చెరువు పనులను నకిరేకల్‌ యం.యల్‌.ఏ. వీరేశం ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి సూచించారు. నల్లగొండ జిల్లాలో 4,767 చెరువులలో మిషన్‌ కాకతీయద్వారా చెరువుల పూడికతీసి అభివృద్ధి చేస్తామని సి.ఎం. తెలిపారు. 1974లో బచావత్‌ అవార్డు క్రింద గోదావరి, కృష్ణా బేసిన్‌ద్వారా 265 టి.యం.సి.లనీరు కేటాయించినదని, ఈ నీటిద్వారా రాష్ట్రంలోని 46వేల చెరువులు నిండినట్లయితే 3 సంవత్సరాల వరకు కరువు దరి చేరదని ఆయన తెలిపారు. గత పాలకుల నిర్లక్ష్యంవల్ల ప్రతి చెరువులో పూడికలు పెరిగిపోయాయని, పూడికలు తొలగించి తెలంగాణను సస్యశ్యామలం చేస్తామని ఆయన తెలిపారు.

ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయడంతోపాటు కాకతీయ తోరణంను నిర్మించి ప్రతి సంవత్సరం ఉత్సవాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కె.సి.ఆర్‌. ప్రకటించారు. చందుపట్ల చారిత్రక ప్రాధాన్యత కలిగిన గ్రామమని రుద్రమదేవి ఈ ప్రాంతములో యుద్ధం చేసి మరణించినట్లు శిలాశాసనం ఉన్నదని ఆయన తెలిపారు. కాకతీయులు 11వ శతాబ్దంలోనే వాటర్‌షెడ్‌ల ద్వారా నీటిని నిల్వచేసి ఉపయోగించుకొనే పరిజ్ఞానాన్ని కలిగిఉన్న రాజులని ఆయన కొనియాడారు.

విద్యుత్‌శాఖమంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ, భారతదేశంలోనే ఊహించని విధంగా తెలంగాణలో పాలన జరుగుతోందని, 10 నెలల కాలంలోనే అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. విద్యుత్‌శాఖ, నీటిపారుదల శాఖలలో ఇప్పటికే పనులు జరుగుతున్నాయని, వీటితోపాటు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌, సాంఘిక సంక్షేమ వసతి గృహాలకు సన్నబియ్యం సరఫరా పథకాలను ప్రవేశపెట్టి భారతదేశంలోనే ఉన్నతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కె.సి.ఆర్‌. కృషి చేస్తున్నారని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమములో శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్‌ నేతి విద్యాసాగర్‌, జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ బాలునాయక్‌, భువనగిరి పార్లమెంటు సభ్యులు బూర నర్సయ్యగౌడ్‌, నకిరేకల్‌ యం.యల్‌.ఏ. వేముల వీరేశం, పార్లమెంటరీ కార్యదర్శి గాదరి కిశోర్‌, భువనగిరి శాసనసభ్యులు ఫైళ్ళ శేఖర్‌రెడ్డి, మునుగోడు శాసనసభ్యులు ప్రభాకర్‌రెడ్డి, యం.యల్‌.సి. పూల రవీందర్‌, జిల్లా కలెక్టర్‌ పి. సత్యనారా యణరెడ్డి, మాజీ యం.యల్‌.సి.లు., యం.యల్‌.ఏ.లు., స్థానిక ప్రజాప్రతినిదులు తదితరులు పాల్గొన్నారు.

తరలివస్తున్న బతుకమ్మలు, బోనాలు

bathukammaనల్లగొండ జిల్లాలో ‘మిషన్‌ కాకతీయ’ పనులు ఊపందుకున్నాయి. పార, పలుగుపట్టి తరలివచ్చే జనంతో పల్లెలు నిండిపోతున్నాయి. సాంప్రదాయ బతుకమ్మలు తరలివస్తున్నాయి. బోనాలు, పీర్ల ఊరేగింపులు, కోలాటాలు, యక్షగానాలతో, డప్పుల వాయిద్యాలతో పల్లెల్లో పండుగ వాతావరణం కనిపిస్తోంది.

ప్రతి చెరువువద్ద ప్రజా ప్రతినిధులు, ప్రముఖులు, ప్రజలు రెట్టించిన ఉత్సాహంతో చెరువుల పునరుద్ధరణ కార్యక్రమంలో పాల్గొంటున్నారు.

జిల్లాలో ప్రతి ప్రజా ప్రతినిధి ఏదో ఒక చెరువు పనులలో పాల్గొంటుండటంతో స్థానిక ప్రజలనుంచి మంచి స్పందన లభిస్తోంది.అన్నెపర్తి, కంచనపల్లి చెరువులలో ‘మిషన్‌ కాకతీయ’ పనులను రాష్ట్ర విద్యుత్‌శాఖమంత్రి జగదీశ్‌రెడ్డి, పార్లమెంటరీ కార్యదర్శి గాదరి కిశోర్‌, జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ బాలునాయక్‌లు ప్రారంభించారు.

ప్రతి చెరవువద్ద పండుగ వాతావరణం కనిపిస్తోంది. రైతులు తమ పొలాలకు చెరువుమట్టి తరలించేందుకు ట్రాక్టర్లతో ముందుకు వస్తున్నారు. చెరువుల పునరుద్ధరణ ద్వారా ప్రతి నీటిబొట్టును సద్వినియోగం చేసుకోవచ్చని, రానున్న రోజుల్లో నీటి కొరత ఉండదని, ప్రతి పల్లె, ప్రతి గ్రామం కళకళలాడాలనే లక్ష్యంతో చెరువుల పూడికతీత పనులలో ప్రజలు స్వచ్ఛంధంగా పాల్గొంటున్నారు.

నల్లగొండ జిల్లాలో 655 చెరువుల పునరుద్ధరణకు సుమారు 253 కోట్ల రూపాయలతో పరిపాలనా అనుమతి లభించింది.

జిల్లాలో ‘మిషన్‌ కాకతీయ’ కార్యక్రమం అమలవుతున్న తీరుపై కలెక్టర్‌ పి.సత్యనారాయణరెడ్డి ప్రతివారం జిల్లాస్థాయి అమలు, పర్యవేక్షణ, మూల్యాంకణ కమిటీల సమావేశాలు నిర్వహించి, పనులను పర్యవేక్షిస్తున్నారు.
వర్షాలు కురిస్తే, చెరువుల పునరుద్ధరణ పనులకు ఆటంకం కలుగుతుందన్న ఉద్దేశ్యంతో, త్వరితగిన చెరువుల పునరుద్ధరణ పనులు చేపట్టి, పూర్తి చేయాలని జిల్లా అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. నీటిపారుదల శాఖ సిబ్బంది ‘మిషన్‌ కాకతీయ’ పనులలో భాగస్వాములై చిత్తశుద్ధితో పని చేయాలని ఆదేశించారు.

నకిరేకల్‌లో చెరువుల పునరుద్ధరణ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర విద్యుత్‌ శాఖామంత్రి జి. జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ గత పాలకుల కాలంలో తెలంగాణలోని చెరువులు నిర్లక్ష్యానికి గురయ్యాయని, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ‘మిషన్‌ కాకతీయ’ కార్యక్రమంతో రాష్ట్రంలోని చెరువులన్నింటినీ పునరుద్ధరించడానికి కంకణం కట్టుకున్నారని చెప్పారు. ‘మిషన్‌ కాకతీయ’తో పల్లెలకు జలకళ రావడంతోపాటు, రైతుల అభ్యున్నతికి కృషి చేస్తున్న ప్రభుత్వానికి పల్లెపల్లెన ధన్యవాదాలు వ్యక్తం చేస్తున్నారు.

Other Updates