ఊరెప్పుడు నవ్వుతది? చెర్లు నిండినప్పుడు, చేన్లు పచ్చగున్నప్పుడు, కాలువలు సాగుతున్నప్పుడు, పంటలు పండుతున్నప్పుడు. తెలంగాణ నేల కరువుతో కొన్నేండ్లుగా కొట్లాడింది. కకావికలు చెందింది. నీళ్లు రాలేదు. కండ్లల్లకెల్లి నిప్పులు రాలినయి. ఇప్పుడు చెర్లు నీళ్లతో నిండుతున్నయి. కాలువలు పారుతున్నయి. నదులు నడుస్తున్నయి. నీళ్ళు నిలువ ఉంటన్నయి. బిందెల నిండుతున్నయి. పచ్చని పొలాలు పైరగాలికి ఊగుతున్నయి. ఎవల సంపారం వాల్లు చేసికుంటే ఇట్లనే ఉంటది. ఎవల రాజ్యం వాల్లు ఏలుకుంటే గిట్లనే ఉంటది. అయితే ఊర్లు ఇప్పుడు మస్తు జోరుగ ఉన్నయి. ఊర్లకు అన్ని మిషన్లు వచ్చినయి, యంత్రాలు వచ్చినయి. పనులు సులువుగా అయితన్నయి. ఊల్లల్లకు సిమెంట్ రోడ్‌లు వచ్చినయి. ఇండ్లు వచ్చినయి. బాయిలు నిండినయి. ఇదంతా కాలం మహిమ.
ఊర్లల్ల చెర్లుంటయి. ఆ చెర్లు ఎండిపోయి ఉంటయి. చాపలు దొరకపోయేవి. బేస్తోల్లకు పని లేకుండ ఉండేది. గొర్లకు మ్యాత లేకుండా ఉండే. బర్లకు, ఎడ్లకు, ఆవులకు మ్యాత కష్టంగా ఉండేది. కాలం మారినంక నీళ్ల తడి నేల మీద పడ్డంక అంత పచ్చగా అయితంది. నీళ్ళతోనే ప్రపంచం, నీళ్ళతోనే నాగరికత, నీళ్ళతోనే మొకం తెలివి. అయితే నీళ్ళు రావాలంటే నదులు మలపాలె. నదులనుంచి ఉత్తగ సముద్రంలకు పోయే నీళ్ళకు అడ్డకట్ట ఎయ్యాలె. ఆగబట్టాలె. కొత్తగా కాలువలు తియ్యాలె. తిరిగి తిరిగి నీళ్ళకు మల్ల మన పొలాలకు పారియ్యాలె. మల్ల చెరువులు నింపలె. కుంటలు నింపాలె. చెర్లల్ల, కుంటలల్ల నీళ్ళు ఉంటే బాయిలల్ల పదను ఉంటది. బోర్ బావులు నిండుతయి, నీళ్ళు మీదికి వస్తయి. గోదలు, గొర్లు పచ్చగడ్డి మేస్తయి. జీవాల సంఖ్య పెరుగుతది. బర్లమంద, ఆవుల మందలు పెరుగతయి.మందందరు పాలు తాగుతరు. సల్ల తాగుతరు. సల్లగుంటరు. ఇదంతా కుదరాల్నంటే పర్యావరణ చక్రం సక్కంగా ఉండాలె. చెట్లు పెంచాలె, పచ్చని వాతావరణం ఉండాలె. కొంగలు, పిచ్చుకలు, జింకలు, కాకులు, గద్దలు, పిట్టలు, సకల జీవరాశులు మనుషులతోపాటే సయ్యాటలు ఆడాలె.
మనిషి, సాదుకం జంతువు కల్సి తిరుగాలె. పిట్టలు చెట్లు, గుట్టల మీదనే ఉండాలి. అందుకు లక్షలాది ఏండ్లనుంచి ఉన్న గుట్టలు అట్లనే ఊర్లపక్క పొన్న ఉండాలె. దానిమీద దేవుడు ఉంటడు. గుట్టమీద మొగులు తాగుతది. మొగులుమీదికెల్లి వానపడుతది. ఆ వాన ఒర్రెలనుంచి చెర్లు నిండుతయి. ఆ చెర్ల నీళ్ళు చెరువెనుక పొలం పారుతది. అట్లనే గుట్టమీద పరికిపండ్లు, సీతాపల్కపండ్లు, బల్సుకుపండ్లు, తేనె, చింతపండు ఉంటది. ఇక గుట్ట సొరికెలల్ల కోతులు కొండెంగలు ఆడుకుంటయి. కోతులు కొండెంగలు గుట్టలు కూలిపోతె ఇండ్లల్లకు, ఊర్లల్లకు వస్తయి. గుట్ట, పిట్ట, కాకి, కొంగ, బండ, వానవాగు, వరద, చెరువు మత్తడి, అల్లుగు అన్ని తెలంగాణ పల్లె నవ్వే రూపాలు. ఇందులో నీళ్ళు మలుపుకుంటున్నం. చెరువులు కళకళలాడుతన్నయి. నీళ్ళు ప్రవహిస్తున్నయి. గుట్టలనుంచి కూడా నీళ్ళు వస్తయి. ప్రకృతి పల్లెకు అందం సందం ఇప్పుడు పల్లెలన్నీ పచ్చగా నవ్వుడు మొదలుపెట్టినయి.
అన్నవరం దేవేందర్