magaనేతన్నల కష్టాలు, వారి జీవన స్థితిగతుల గురించి ప్రభుత్వానికి సంపూర్ణ అవగాహన ఉన్నందున వారి సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తోందని రాష్ట్ర ఐటీ, చేనేత శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఇందులో భాగంగా చేనేత కార్మికులకు ‘చేయూత’ పొదుపు పథకం కింద ప్రభుత్వం రూ.75కోట్లను కేటాయించిందన్నారు. ఈ నిధులతో నేతన్నల కష్టాలను తీర్చే అవకాశముంటుందన్నారు. జూన్‌24న భూదాన్‌ పోచంపల్లిలో ‘నేతన్నకు చేయూత పొదుపు’ పథకాన్ని మంత్రులు ఈటెల రాజేందర్‌, జగదీష్‌రెడ్డి, జోగు రామన్నలతో కలిసి చేనేత, జౌళి, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ, చేనేత రంగానికి పుట్టినిల్లు అయినటువంటి పోచంపల్లి నుంచే ఈ పొదుపు పథకం ప్రారంభించడం ఆనందంగా ఉందని అన్నారు. పోచంపల్లి చేనేత కళాకారులకు అంతర్జాతీయంగా గుర్తింపు ఉందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకునే ప్రతినేత కార్మికుడి సంక్షేమం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. ఈ నేపథ్యంలో నూలు, అద్దకాల మీద 50శాతం సబ్సిడీని త్వరలోనే ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. హైదరాబాద్‌లో నూతన డిజైన్లు, అధునిక సౌకర్యాలు, వస్త్రాలతో భారీ షోరూంను దసరా, దీపావళి నాటికి ప్రారంభిస్తామని వెల్లడించారు. నేత కార్మికులకు నెలకు రూ.15వేల వేతనం లభించేలా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రం నుంచి సూరత్‌, భీవండి, షోలాపూర్‌లాంటి ప్రాంతాలకు దశాబ్దాల క్రితం వలసలు వెళ్లారని, వారందరినీ తిరిగి తీసుకువచ్చేందుకు త్వరలోనే వరంగల్‌ మెగా టెక్స్‌టైల్‌ పార్కుకు శంకుస్థాపన చేస్తామని తెలిపారు. హైదరాబాద్‌లోని శిల్పారామం తరహాలో పోచంపల్లిలో నేతబజారు ఏర్పాటు చేయబోతున్నట్టు చెప్పారు. నేతన్నల కష్టాలను చిన్ననాటినుంచి తెలిసిన వ్యక్తిగా కనివీనీ ఎరుగని రీతిలో బడ్జెట్‌లో నిధులను సీఎం కేసీఆర్‌ కేటాయించారన్నారు. గతేడాది చేనేత జౌళి శాఖకు రూ.70 కోట్లు కేటాయిస్తే ఈ ఏడాది పొదుపు పథకానికే రూ.75 కోట్లు కేటాయించారని, మొత్తంగా నేతన్నలకు రూ.1283 కోట్లు కేటాయించి చరిత్రలో నిలిచారన్నారు.

చేనేత సమూహాల ఏర్పాటుకు కృషి :

గద్వాల, నారాయణపేట, దుబ్బాకలో చేనేత సమూహాల ఏర్పాటుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. పోచంపల్లిలో ఆధునిక నేత బజారును త్వరలో ఏర్పాటు చేస్తామని ఆయన ప్రకటించారు. బజార్‌ నిర్మాణానికి స్థల సేకరణ కూడా ఇప్పటికే పూర్తి అయిందని, రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా పోచంపల్లికి వచ్చి బట్టలు కొనేలా చేస్తామన్నారు. సోసైటీల్లో ఉన్నా, లేకున్నా నేతన్నకు చేయూత పథకం వర్తిస్తుందని ఆయన స్పష్టం చేశారు. కొత్తగా వస్తున్న ఫ్యాషన్‌లను చేనేత కార్మికులు అందిపుచ్చుకోవాలని మంత్రి కేటీఆర్‌ సూచించారు. అలాగే చేనేత ఉత్పత్తులకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చేందుకు విస్తృతంగా ప్రచారం చేయాల్సిన బాద్యత ప్రతిఒక్కరిపై ఉందన్నారు. బహుముఖమైన వ్యూహంతో చేనేతను ఆదుకునేందుకు ముందుకుసాగుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.

చేనేతపై జీఎస్టీ రద్దు చేయాలి :

చేనేతపై జీఎస్టీని రద్దు చేయాలని కేంద్రానికి సీఎం కేసీఆర్‌ ఇప్పటికే లేఖ రాశారని, తాను ఇటీవల జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలోనూ ఈ విషయాన్ని ప్రస్తావించానని కేటీఆర్‌ తెలిపారు. చేనేతకు నష్టంచేసే ఈ నిర్ణయం రద్దుకు ఆర్థిక మంత్రి ఈటల కూడా పోరాడుతున్నారని అన్నారు. సిరిసిల్లలోని పవర్‌లూంలను అధునీకరించడానికి నిధులు కేటాయించామన్నారు. రూ.30కోట్లతో సిరిసిల్లలో అపరెల్‌ పార్కు ఏర్పాటు చేస్తున్నామన్నారు. సమైక్య రాష్ట్రంలో థ్రిప్ట్‌ ఫండ్‌ కోసం తెరాస పక్షనా పెద్దఎత్తున పోరాటం చేసిన విషయాన్ని మంత్రి కేటీఆర్‌ గుర్తు చేశారు. థ్రిప్టు ఫండ్‌ కోసం గతంలో అనేక సార్లు ఆనాటి ప్రభుత్వాలతో కొట్లాడమన్నారు. థ్రిప్ట్‌ ఫండ్‌ విధానాన్ని కొనసాగించాలని డిమాండ్‌ చేశామని కేటీఆర్‌ తెలిపారు. అమెరికా, జపాన్‌లాంటి ఇతర దేశాల్లో పర్యటించినప్పుడు చేనేత శాలువాలతో అక్కడి ప్రముఖలను సన్మానిస్తే, వారు వాటి గురించి తెలుసుకొని ఆశ్చర్యపోయేవారని కేటీఆర్‌ చెప్పారు.

Other Updates