chenethaరాష్ట్రంలోని చేనేత కార్మికుల జీవితాల్లో వెలుగు నింపేందుకు కేంద్ర జౌళిశాఖ నిర్ణయం తీసుకున్నది. మరో ఎనిమిది హ్యాండ్లూమ్‌ క్లస్టర్ల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం అనుమతులిచ్చింది. బ్లాక్‌ లెవల్‌ హ్యాండ్లూమ్‌ క్లస్టర్లుగా ఎంపికైన ప్రాంతాలకు జాతీయ చేనేత అభివద్ధి కార్యక్రమం (ఎన్‌హెచ్‌డీపీ) కింద కేంద్రం నిధులు విడుదల చేయనున్నది. ఇప్పటికే రాష్ట్రంలో ఆరు క్లస్టర్లు పనిచేస్తుండగా, తాజాగా కేంద్రం మంజూరుచేసిన వాటితో మొత్తం హ్యాండ్లూమ్‌ క్లస్టర్ల సంఖ్య 14కు చేరింది. కొత్తగా మంజూరైన క్లస్టర్లను నెలకొల్పేందుకు నల్గొండ జిల్లాలోని పోచంపల్లి, చౌటుప్పల్‌, కొయ్యలగూడెం, కుంచగూడెం, వరంగల్‌ జిల్లా మట్టెవాడ, మెదక్‌ జిల్లా సిద్ధిపేట, మహబూబ్‌నగర్‌ జిల్లా గద్వాల, అరగిద్ద గ్రామాలను కేంద్ర ప్రభుత్వం ఎంపికచేసింది. మూడో దశలో ఎనిమిది హ్యాండ్లూమ్‌ క్లస్టర్ల ఏర్పాటుకు అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వ అధికారులు పంపిన ప్రతిపాదనలపై కేంద్రం గతంలోనే సానుకూలంగా స్పందించింది.

వీటి నిర్వహణ కోసం కేంద్రం విడుదలచేసే రూ.10 కోట్ల నిధులతో 2000 మంది చేనేత కార్మికులకు లబ్ధి చేకూరనున్నది. ఈ క్లస్టర్ల ఎంపిక కోసం రాష్ట్రస్థాయి ప్రాజెక్ట్‌ కమిటీ నుంచి వచ్చిన ప్రతిపాదనలను పరిశీలించిన కేంద్రం తమ మార్గదర్శకాలకు అనుగుణంగా ఉన్న గ్రామాలను ఎంపికచేసింది. ఒక్కో క్లస్టర్‌కు కనీసం రూ. కోటి నుంచి రూ.1.5 కోట్ల నిధులు రానున్నాయి. ఈ నిధులతో రాష్ట్రప్రభుత్వం చేనేత కార్మికులకు నైపుణ్యం, సాంకేతిక పరిజ్ఞానంపై శిక్షణనివ్వడంతో పాటు, వారికి మగ్గాల కొనుగోలు తదితర అంశాలపై శిక్షణ ఇస్తారు. క్లస్టర్లుగా ఎంపికచేసిన ప్రాంతాల్లో వర్క్‌షెడ్‌తోపాటు కామన్‌ సర్వీస్‌ సెంటర్‌, కామన్‌ ఫెసిలిటీ సెంటర్‌ నిర్మాణం, చేనేత కార్మికులు అభివద్ధి చెందడానికి అవసరమైన కార్యక్రమాలన్నీ చేపడుతుంది.

రాష్ట్రంలో నెలకొన్న అవసరాల దష్ట్యా ఎక్కువ సంఖ్యలో క్లస్టర్లు మంజూరు చేయాలని గతంలోచేసిన విజ్ఞప్తులపై కేంద్రం సానుకూలంగా స్పందించింది. ఇప్పటికే కరీంనగర్‌ జిల్లాలోని కమలాపూర్‌, నల్గొండ జిల్లా అలేరు క్లస్టర్లను మొదటి దశలో మంజూరు చేశారు. రెండో దశలో కరీంనగర్‌ జిల్లా కనుకుల, నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌, మహబూబ్‌నగర్‌ జిల్లా వెల్టూర్‌, వరంగల్‌ జిల్లా శాయంపేటలను హ్యాండ్లూమ్‌ క్లస్టర్లుగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

Other Updates