ఛత్తీస్‌గఢ్‌తవిద్యుత్‌-బంధం1రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణలో విద్యుత్‌ సమస్య తప్పదని, అయితే దానిని అధిగమంచేందుకు చర్యలు తీసుకుంటామని ఎన్నికల ముందే పలు సభలలో చెప్తూ వచ్చారు. ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఇప్పుడు విద్యుత్‌ సమస్య పరిష్కారం దిశగా పలు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా మన పొరుగు రాష్ట్రం ఛత్తీస్‌గఢ్‌లో నవంబర్‌ 2,3 తేదీల్లో పర్యటించి విద్యుత్‌ ఒప్పందం చేసుకువచ్చారు.
కాకతీయుల పాలనాకాలంలో ఈ రెండు రాష్ట్రాలు ఒకే రాజ్యపాలనలో పాలింపబడ్డాయి. ఇందుకు సాక్ష్యం కాకతీయుల వంశీయులు ఇప్పటికీ ఛత్తీస్‌గఢ్‌లో నివసిస్తుండడమే ఈ అనుబంధానికి ప్రతీకగా కాకతీయ కీర్తితోరణం ప్రతిమలను చత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి ఇతర మంత్రులకు అందజేశారు కేసీఆర్‌.
14యేళ్ళ నాడు ఏర్పడ్డ ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రానికి, అప్పుడున్న సమస్యలే, ప్రస్తుత తెలంగాణ రాష్ట్రానికీ వున్నాయని ముఖ్యమంత్రి అన్నారు. కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రానికి ప్రస్తుతం కరెంట్‌ కష్టాలు పుష్కలంగా వున్నాయని వాటిని తీర్చుకోవడానికే ఛత్తీస్‌గఢ్‌ వచ్చానని పేర్కొన్నారు ముఖ్యమంత్రి. వెయ్యి మెగావాట్ల విద్యుత్‌ తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చేందుకు అంగీకరించిన ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్‌ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు కేసీఆర్‌. విద్యుత్‌ కొనుగోలు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసుకున్న సందర్భంగా రాయపూర్‌లో ఏర్పాటు చేసిన సభలో మన ముఖ్యమంత్రి హిందీలో ప్రసంగించడం అక్కడివారందరినీ ఎంతో ఆకట్టుకున్నది.
ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్‌ మాట్లాడుతూ రెండు రాష్ట్రాలు పరస్పరం సహకరించుకోవాలని ఈ బంధాన్ని మరింత బలోపేతం చేసుకుందామని అన్నారు. తెలంగాణకు ఇచ్చే కరెంట్‌ను సరఫరా చేయడంకోసం ట్రాన్స్‌మిషన్‌ లైన్లు తొందరగా నిర్మింపజేయమని తాను కేంద్ర విద్యుత్‌శాఖ మంత్రిని కోరానని తెలిపారు ముఖ్యమంత్రి రమణ్‌సింగ్‌.
ఈ సభలో ఛత్తీస్‌గఢ్‌ మంత్రులు, అధికారులు మాట్లాడుతూ దక్షిణభారతదేశంలో ప్రజలకు హిందీ స్పష్టంగా మాట్లాడడం అంతగా తెలియదనుకున్నామని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావుగారు హిందీలో ప్రసంగించడం చూసిన తర్వాత తమ అభిప్రాయం మార్చుకుంటున్నామని ఆనందంతో అన్నారు.
వ్యవసాయ క్షేత్రాల సందర్శన
ఛత్తీస్‌గఢ్‌ పర్యటన ప్రథమ ప్రాధాన్యం విద్యుత్తే. అయినా, పర్యటనను ఒక్క పనికే పరిమితం చేయకుండా అక్కడ వ్యవసాయ క్షేత్రంలో జరిగే అభివృద్ధిని అందిపుచ్చుకోవాలని నిశ్చయించుకున్నారు కేసీఆర్‌.
తన మొదటి రోజు పర్యటనను పంటపొలాలు, వ్యవసాయ క్షేత్రాలు, గ్రీన్‌హౌజ్‌, పాలిహౌజ్‌ల పరిశీలనలతోనూ ఆధునిక వ్యవసాయ పద్ధతుల విషయాలన్నింటినీ తెలుసుకునే ఉద్దేశంతోనూ విత్తన పరిశోధకులతో మాట్లాడడం రైతులతో ముఖాముఖిగా మాట్లాడటం వంటి వ్యవహారాలలో బిజీబిజీగా గడిపారు.
విమానాశ్రయం నుంచి బయలుదేరి గోమ్చీలోని వి.ఎస్‌.ఆర్‌. సీడ్స్‌ రీసెర్చి స్టేషన్‌కు చేరుకున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్‌. అక్కడ రీసెర్చి స్టేషన్‌ ఎండి విమల్‌చౌదాతో పాటు ఇతర నిపుణులు, విత్తన ఉత్పత్తి, పండ్లు, కూరగాయాల తోటలసాగు లాంటి వివిధ అంశాలపై పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ను ఏర్పాటుచేసి విస్తారంగా వివరాలను అందించారు. ఈ సందర్భంగా అక్కడి నిపుణులతో చర్చించి కొన్ని సందేహాలను నివృత్తి చేసుకున్నారు. రీసెర్చిస్టేషన్‌ మొత్తాన్ని తిరిగి నిశితంగా పరిశీలించారు. విత్తనంపెట్టిన దగ్గరినుండి చెట్టు మొలకెత్తే వరకు అన్ని దశలను క్షుణ్ణంగా పరిశీలించారు మన ముఖ్యమంత్రి కేసీఆర్‌. అధిక దిగుబడులు సాధించే క్రమంలో మంచి విత్తనాలను ఉత్పత్తి చేయడానికి అక్కడ పాటిస్తున్న పద్ధతులను అడిగి తెలుసుకున్నారు.
తెలంగాణలో ఎఱ్ఱనేలలు, నల్లనేలలు, చౌడుభూములు ఉన్నాయి. ఇవన్నీ వివిధరకాల విత్తన ఉత్పత్తికి ఎంతో అనుకూలమైనవని కేసీఆర్‌ అక్కడి అధికారులతో చెప్పారు. ఇందుకు జవాబుగా అక్కడి వ్యవసాయ నిపుణులు, ఛత్తీస్‌గఢ్‌ మాదిరిగానే తెలంగాణ రాష్ట్రంకూడా విత్తన ఉత్పత్తికి ఎంతో అనుకూలమైనదని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశ విత్తన భాండాగారంగా మార్చాలన్నది ధ్యేయం అని తన అభిప్రాయాన్ని వాళ్ళకు తెలియజెప్పారు ముఖ్యమంత్రి కేసీఆర్‌.
అటు తర్వాత దుర్గ్‌ జిల్లాలోని మాల్‌పురి గ్రామ పరిధిలో వందలాది ఎకరాల్లో సాగు చేస్తున్న కూరగాయ, పండ్ల తోటలను పరిశీలించారు. ఆ తర్వాత బెమెత్రా జిల్లాలోని కోహిడియా గ్రామ పరిధిలోని గ్రీన్‌హౌజ్‌, పాలిహౌజ్‌ కల్టివేషన్‌ను కూడా సందర్శించారు.
వాతావరణ ప్రతికూల పరిస్థితులను, ఉష్ణోగ్రతల హెచ్చుతగ్గులను, ఈదురుగాలుల వంటి వైపరిత్యాలను తట్టుకొని మొక్కలు పెరగడం గ్రీన్‌హౌజ్‌ కల్టివేషన్‌ ద్వారా మాత్రమే సాధ్యమని ఎప్పుడూ చెప్పే ముఖ్యమంత్రి ఈ విషయానికి సంబంధించి మరిన్ని కొత్త పద్ధతులను కూడా అధ్యయనం చేశారు.

Other Updates