sun

వెలుతురు తలమీద ఏర్పడిన
విపరీత ఛాయావరణం
తన వేళ్లతో తడిమి చూసుకున్న
వెలుతురుకు
అదేమిటో అంతుపట్టలేదు.
అది తన తలను జాడిరచి చూసింది
ఏమీ రాలిపడలేదు
వెలుతురు చూపులను
ఏదో కమ్మేసినట్టనిపించింది
కళ్లు నులుముకుని చుట్టూ చూసింది
బాహిర ప్రకృతి
మసక మసకగా అగుపించింది.
అచంచల మనస్కతతో
ఆ వెలుతురు
సమస్యా పరిష్కారాన్ని ప్రతీక్షించింది
అంతలోనే వాతావరణం మలుపుతిరిగింది
వెలుతురు తలమీది ఛాయావరణం
తొలగిపోయింది
తన సహజ సముజ్వలత్వం
ఎప్పటిలాగే తనను చేరుకున్నందుకు
వెలుతురు తనువంతా తరగలెత్తింది
ఈ పరిణామాలను
సన్నిహితంగా పరిశీలిస్తున్న మానవ జీవితం
ఇవి మాకు తెలియనివి కావు
అనునిత్యం జరుగుతున్నవే అని
తన మనసు నింపుకున్నది
ఔను
ఇది సార్వకాలీన యధార్థం
వెలుగులున్నప్పుడే కదా నీడలు ఆక్రమించేది
ప్రమోదాలున్నప్పుడే కదా బాధలు ఆవరించేవి.

Other Updates