అపిస్వర్ణమయీలంకా
నయే లక్ష్మణరోచతే!
జననీ జన్మభూమిశ్చ
స్వర్గాదపి గరీయసీ!!
అన్న శ్రీరాముడి మాటల్లో ఆయనకి జన్మ భుమిపట్ల గల భక్తి, గౌరవం, మమకారం అర్థమవుతాయి.
రావణ సంహారం అనంతరం ఆనాటి యుద్ధనీతి ప్రకారం యుద్ధంలో గెలుపొందిన వారికి ఓడినవారి సకల వస్తు, ప్రాంత, వ్యక్తుల మీద హక్కులు సంక్రమిస్తాయి. అందు లక్ష్మణుడు తాము జయించిన లంకానగరపు అద్భుత అందాలకు, విలువైన కట్టడాలకు ముగ్దుడై లంకాపురినిని ఆక్రమించి ఇక్కడే పాలన చుస్తూ వుండపోదాం అంటాడు. అప్పు డు లక్ష్మణుడితో రాముడు ఎంత సువర్ణకాంతులీనే అందమైన నగరమైనా మన జన్మభూమి స్వర్గసీమతో సమానమైనదని, దానిని విడవడం మహాపాపం అనే భావంతో పై శ్లోకం చెబుతాడు.
కేవలం జన్మభూమి ప్రేమికుడిగానే కాక పితృవాక్యపాలకునిగా, ఆదర్శ సోదరునిగా, అన్యోన్యపు భర్తగా, పురాణ పురుషునిగా, ఆదర్శవంతమైన ప్రాంతఃస్మరణీయునిగా భారతజాతికి దొరికిన పుణ్యఫలంగా చెప్పబడే శ్రీరామచంద్రుని జీవిత చరిత్రే రామకథ!
ఎంతమంది వ్రాసినా.. ఎన్నిసార్లు చదివినా ఎన్నాళ్లు విన్నా నిత్యం నూతనత్వం చూపించే చక్కని ఇతివృత్తం దీని సొంతం.
రామాయణం తొలి రచయిత వాల్మీకిగా వాసికెక్కిన రాత్నాకరుడే! వాల్మీకి రామాయణం ఆధారంగానే ఇతర రామాయణాలు వెలువడ్డాయి.
తండ్రిమాట ప్రకారం 12వ ఏటా విశ్వామిత్ర యాగ సంరక్షణార్థం వెళ్లి రాక్షసులను సంహరించి తిరిగివస్తూ మార్గమధ్యలో జనకమహారాజు ప్రకటించిన సీతా స్వయంవరం ఆహ్వానం అందుకొని గురుప్రోత్సాహంతో మిథిలానగరం వెళ్లి శివధనస్సును లేపి బాహుభుజములతో ఎక్కుపెట్టి విజయం సాధించి సీతను భార్యగా పొందుతాడు. మార్గశిర శుద్ధ పంచమి నాడు సీతారాముల కల్యాణం మిథిలానగరంలో అంగరంగవైభవంగా జరిగింది.
అయితే సీతారామకల్యాణం ప్రతి ఏడాది మార్గశిర శుద్ధ పంచమి నాడే చేయడం పదత్ధి. కానీ శ్రీరాముడు అనగానే గుర్తుకు వచ్చే కలియుగ వైకుంఠంగా భాసిల్లుతున్న భద్రాచలంలో మాత్రం శ్రీరాముడి పుట్టిన రోజైన చైత్ర శుక్ల నవమినాడు సీతారామ కల్యాణం చేస్తారు. దీనివెనుక ఒక చారిత్రక కథనం దాగివుంది.
భద్రాద్రి రాముడికి గుడిగోపురాలు, ప్రాకారాలు, బంగారు నగలు చేయించిన రామభక్త శిఖామణి వాగ్గేయకారుడు కంచెర్ల గోపన్న (రామదాసు) క్రీ. శ. 1674 సంవత్సరంలో భద్రాచలంలో రామాలయం నిర్మించారు.
కేరళ ప్రాంతం నుంచి అర్చక స్వాముల కుటుంబాలను తీసుకువచ్చి పూజాదిక ఉత్సవ నియమావళి తదితరాలు ఏర్పాటు చేయించారు. అప్పటి ఉత్సవాల్లో భాగంగా సీతారామకల్యాణం మార్గశిర శుద్ధ పంచమి నాడే జరిపించడానికి నిశ్చయించారు. అయితే అదే ఏడాది చివర్లో రామదాసు గోల్కొండ తానీషా ఆగ్రహానికి గురై బందీ అయ్యారు. దాంతో భద్రాద్రి రామాలయంలో నిత్య పూజలు తప్ప ఉత్సవాలు జరపలేదు.
తిరిగి రామదాసు క్రీ. శ. 1686లో కారాగార శిక్ష నుండి విడుదలై భద్రాచలం వచ్చేసరికి మార్గశిర పంచమి గడిచిపో యింది. దాంతో క్రీ. శ. 1687 చైత్ర శుద్ధ నవమి నాడు శ్రీరాముడి జన్మదినోత్సవాన్నే కల్యాణం చేయడం ప్రారంభించారు.
అదే ఆనవాయితీ నేటికీ భద్రాచలంలో కొనసాగుతోంది. రామదాసు గురువైన రఘునాథ్ భట్టార్ నిర్ణయం మేరకు ఆగమ శాస్త్రాన్ని అనుసరించి భద్రాచలంలో సీతారామచంద్రస్వామి వార్ల కల్యాణం నిర్వహించబడుతుంది.
భారతదేశంలో ఎన్ని రామాలయాలున్నా భద్రాచల రామాలయానికే ఇంతటి ప్రాధాన్యత రావడానికి కారణం రాముడు వనవాసం చివరి కాలంలో రెండు సంవత్సరాల పాటు భద్రాచల ప్రాంతపు దండ కారణ్యంలో సంచరించడం. భద్రాచలానికి
సమీపంలో పంచవటిని నిర్మించుకుని గోదావరి తీరంలో నివసించడం. అక్కడే సీతాపహరణ జరగడం. తదితర చారిత్రక పౌరాణకి ఆధారాలు వుండటంతోపాటు ఒక సాధారణ భక్తునిచే దేవాలయం నిర్మించబడటం, మరో రామభక్తుడైన భద్రుని తపస్సుకు మెచ్చి రాముడు నారాయణ అవతారంలో చతుర్భుజుడై అవసవ్య శంఖు చక్రధారిగా అవతరించడం మొదలైన ప్రత్యేక కారణాలతో భద్రాచలానికి ఇంతటి ప్రాధాన్యత వచ్చింది.
ఇక రాముని జన్మభూమి అయిన అయోధ్యానగరం కూడా ప్రాముఖ్యత సంతరించుకుంటే అతిపురాతన నగరాలలో ఇది కూడా ఒకటి. ఇక్ష్యాకులచే రాజ్యపాలన చేయబడి 63 తరాల పాటు ఏక కుటుంబ పాలన చేయబడ్డ రాజ్యంకూడా ఇది ఒకటే అని చెప్పాలి.
వాల్మీకి రామాయణం అయోధ్యానగరం కోసల రాజ్యానికి రాజధాని. ఇది సముద్ర మట్టానికి 305 అడుగుల ఎత్తులో వుండి 250 చ.కి. వైశాల్యంతో (90 మైళ్లు) ఏర్పడ్డ అందమైన అద్భుత నగరం. 63వ ఇక్ష్యాకుల సూర్యవంశ రాజు అయిన దశరథునిచే పాలించబడ్డ ఈ రాజ్యాన్ని రాముడు పాలించింది కొద్ది కాలమే గాని సుపరి పాలనకు గుర్తుగా రామరాజ్యం అనే పేరుపొందింది.
ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని ఫైజాబాద్ జిల్లాలోగల అయోధ్య అనబడే రామజన్మభూమి సరయూనది తీరంలో జిల్లా కేంద్రానికి ఆరు కి.మీ. దూరంలో వుంది. ఒకప్పుడు దీనిని సాతేపురం అని పిలిచేవారు. ఇది అతి ప్రాచీన నగరం. సుమారు 9 వేల సంవత్సరాలకు పూర్వం ఉన్నట్టు చారిత్రక ఆధారాలున్నాయి. చైనా యాత్రికుడు హూయంత్సాంగ్ క్రీ.శ. 636లో తన భారతదేశ యాత్రలో భాగంగా ఈ నగరాన్ని సందర్శించి దీనిని అయోధ్యగానే పేర్కొన్నాడు.
భద్రాద్రికి పెళ్లికళ
ఖమ్మం జిల్లా భద్రాచలంలోని మిథిలా స్టేడియంలో
ఏప్రిల్ 15న శ్రీరామ నవమి రోజున నిర్వహించే శ్రీ సీతారామ
కల్యాణానికి ఇటు అర్చక స్వాములు, అటు ప్రభుత్వ యంత్రాంగం
సకల సన్నాహాలు చేస్తున్నారు.
మార్చి 23న శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో
వసంతోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. కల్యాణోత్సవానికి పనులు
ప్రారంభించి తలంబ్రాలు కలిపారు.