janahithaజనహితలో తనను అభినందించడానికి వచ్చిన వివిధ కులాలు, వర్గాల ప్రతినిధులనుద్దేశించి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు చేసిన ప్రసంగం పూర్తి పాఠంనన్ను అభినందించడానికి వచ్చిన అందరికి నమస్కారాలు, శుభాకాంక్షలు. తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు చాలా పెద్ద వాదన చేసేవాడిని… ఢిల్లీలో కూడా ప్రధానమంత్రి గానీ, వివిధ వ్యక్తులు గానీ…ఎందుకు తెలంగాణ మీకు, దేని కోసం అడుగుతున్నరని చెప్పి అడిగేవారు. మా రాష్ట్రానికి ఆదాయం బాగుంది మేం దోచుకోబడుతున్నాం మా ఆదాయం వేరే చోటికి తరలిపోతావుంది, మా రాష్ట్రం మాకు వస్తే మేము అన్ని విధాల బాగుపడతాం, అన్ని వర్గాల ప్రజలు కూడా బాగుపడతాం మా రాష్ట్రం మాకు కావాలి అని చెప్పి ఆ రోజు మేం మాట్లాడేవారం. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మన బతుకు ఏందో మనకు తెలియదు వాస్తవంగా. ఎందుకంటె అంతకుముందు మనం రాష్ట్రంగా లేము కాబట్టి, ఒక మార్చి నుంచి ఇంకో మార్చికి ప్రయాణం జరిగితే కరెక్టుగా మనకు అవగాహన వస్తది. మన రాష్ట్రం అప్పేంది, ఆదాయం ఏంది, అనేది తెలిసింది దానిమీద ఇంకో విషయం తెలియాల్సి ఉంటుంది. దాని కోసం ఆరు నెలలు వేచి చూసినం. నేను, రాజేందర్‌ ఇద్దరం ఆదాయం పెరిగే రాష్ట్రమా పాజిటివ్‌ క్యారెక్టర్‌ ఉందా స్టేట్‌కు నెగెటివ్‌ ఉంటదా మనం డెఫిసిట్‌ బడ్జెటా, సర్‌ప్లస్‌ బడ్జెటా అనేది తేలాల్సి ఉంటది. ఏదైతే తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమ సమయంలో మనం వాదించినమో, అది నూటికి నూరుశాతం కరెక్ట్‌ అని తేలి ఇండియాలోనే నెంబర్‌ వన్‌ గ్రోత్‌ ఉన్నటువంటి స్టేట్‌గా మనం తయారయ్యాం. ఇప్పుడు ఎంటైర్‌ కంట్రీలో మహారాష్ట్ర కంటే, గుజరాత్‌ కంటే కూడా 21 శాతం పెరుగుదల ఉంది, ఆదాయం ఉంది. ఈటల ఒక లక్షా 49వేల 600 కోట్ల బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. ఇది 2013-14లో మొత్తం 23 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌ కంటే ఎక్కువ. 23 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌ లక్షా 23 వేల కోట్లే ఉండేది. మనం ఎంత అదృష్టవంతులమో అర్థం అవుతోంది ఒక అయిదారు నెలల నుంచి నేను, రాజేందర్‌, మంత్రులు తదితరులు మనకు ఆదాయం బాగుంది మనకు ఏం ఉన్నది ఏం లేదు మునుపటిలా ఉండాల్సిన పనిలేదు పైకి రావాలి డబ్బు ఉంది కాబట్టి స్కీమ్‌లు చేసుకోవచ్చు, బ్రహ్మాండంగా ముందుకు పోవచ్చు, మీకు తెలుసు ఆంధ్రప్రదేశ్‌ లో మనం ఎవరం కూడా లెక్కకు రాలేదు. వాళ్ల లెక్క చుసుకున్నారు తప్ప మన గురించి పట్టించుకోలేదు ఆంధ్రా దోస్త్‌ మాజీ మంత్రి ముత్తా గోపాలకృష్ణ కాకినాడలో ఉన్నాడు చేపలను ఎట్లా పెంచొచ్చు, ఎట్ల పరిశ్రమగా చేయొచ్చు నేను అసెంబ్లీలో చెప్పినా… ఆయన నాకు కాకినాడ నుంచి ఫోన్‌ చేసి నన్ను అభినందించారు…మా ఆంధ్రవాళ్లకు బాగా గర్వం ఉండేది… చేపలంటే మేముకదా మా దగ్గర రేవులు, సముద్రాలు ఉన్నాయి అన్నాడు. తెలంగాణలో ఏం లేకున్నా వేల కోట్ల పరిశ్రమ చేస్తానని చెప్పావు అన్నాడు. మా దగ్గర భగవంతుడు ఇచ్చిన విద్య వుంది, చెరువులు ఉన్నాయి.. ఆంధ్రప్రదేశ్‌ లో సరైన అవకాశం రాలేదు మన దగ్గర మూడు పేర్లతో బెస్తవాళ్ళను పిలుస్తరు.. గంగపుత్రులు, బెస్తవాళ్లు, ఆదిలాబాద్‌ నిజామాబాద్‌ లో గుండోళ్లు అని పిలుస్తరు… వాళ్లతో పాటు మన ముదిరాజ్‌ మిత్రులు… రెండు కులాలు కలిపితే 40 లక్షల జనాభా ఉంది. ఇప్పుడు మనం ఆలోచించే స్కీం ఏదైతే ఉందో… గంగపుత్రులు, బెస్తవాళ్లు, ముదిరాజ్‌లు మీరందరూ కలిస్తే కూడా సరిపోరు మీకందరికీ సరిపోగా ఇంకా పని మిగుల్తది అంత పెద్ద పరిశ్రమగా దీన్ని చేయబోతున్నాం…

భారతదేశంలో ఆర్థికంగా బలమైన యాదవులు, ముదిరాజ్‌, చేనేత వర్గాలు ఇతర వర్గాలు ఎక్కడున్నారంటే తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పేవిధంగా మనం తయారుకావాలి. అందుకు ప్రభుత్వం వద్ద కావాల్సినన్ని నిధులున్నాయి. నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. కష్టపడి పనిచేసి పైకి రావాలి. వెనుకబడిన వర్గాలను వేల కోట్ల శ్రీమంతులను చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇందుకు అన్ని విధాలుగా సహకరిస్తాం. బీసీల్లో అనేక కులాలు దళితుల కంటే అధ్వాన్నంగా ఉన్నారు. వెనుకబడిపోయిన వర్గాలను వదిలిపెట్టేది లేదు. తెలంగాణ వచ్చేదాకా ఎట్లనైతే కొట్లాడిన్నో వెనుకబడినవర్గాల విషయంలో కూడా అంతే. పైకి వచ్చేదాకా వదిలిపెట్టేది ఉండదు. కేసీఆర్‌ ఒకసారి పట్టుపట్టిండు అంటే ఆ పని అయ్యేదాకా వదులడు. తెలంగాణనే సాధించుకున్న మనకు ఇదేమీ పెద్ద విషయం కాదు. సామాజిక వర్గాలను పైకి తీసుకురావడంలో ఇది ప్రారంభం మాత్రమే. పథకాల అమలు సొసైటీల ద్వారానే జరుగుతుంది. కులాలవారీగా చేసిన నిధులపై ప్రతి రెండుమూడు నెలలకు ఒకసారి సమీక్షా సమావేశం నిర్వహిస్తాం.

ఆరెకటికలు వారి మటన్‌ షాపులు ఆధునీకరించుకోవడానికి నిధులు ఇస్తాం. మన అవసరాలకే కాదు ఇక్కడి నుంచి గల్ఫ్‌ దేశాలకు మటన్‌ ఎగుమతి చేసే స్థాయిలో మటన్‌ షాపులను నిర్వహించుకుందాం. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రభుత్వ పథకాల కోసం లబ్ధిదారులు ఎవ్వరు కూడా ఒక్క పైసా ప్రభుత్వ అధికారులకు కానీ, దళారులకు కానీ ఇవ్వొద్దు. మీ ఇండ్ల దగ్గరికే అధికారులు వచ్చి లబ్ధిదారులను ఎంపిక చేస్త్తరు. వాటిని అందిస్తరు. బీసీల్లో ఇంకా ఏమైనా సామాజిక వర్గాలకు నిధుల కేటాయింపు మిగిలిపోయి ఉంటే సీఎంగా నా దగ్గరున్న స్పెషల్‌ డెవలప్‌మెంట్‌ ఫండ్‌ ద్వారా ఒక్క సంతకంతో నిధులు కేటాయిస్తా. కానీ.. అందరు కలిసి కష్టపడి పనిచేసుకోవాలి.. పైకి రావాలి. బ్రాహ్మణుల్లోనూ వెనుకబడినవారున్నారు. వారికోసం రూ.వంద కోట్లు కేటాయించినం. తెలంగాణలో ప్రతి మనిషి చిరునవ్వుతోటి, గర్వంతోటి కాలరెగరేయాలి.

నేను ఇదంతా ఓట్ల చిల్లర రాజకీయాల కోసం చేయడంలేదు. ప్రజలకు మంచి చేస్తే.. తమకు మంచి జరిగిందని భావిస్తే వారే ఓట్లు వేస్తరు. ఇదే సంగతిని సిద్ధిపేట ఎన్నికల్లో అనేకమార్లు ప్రత్యక్షంగా చూసిన.

వెనుకబడినవర్గాలకు మంచి జరుగాలన్నదే నా లక్ష్యం. వెనుకబడిన కులాలను పైకి తీసుకరావడానికి నిధులు కేటాయించినం. ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి పది వరకు రోజుకు మూడు నాలుగైదు కులాల చొప్పున ఆయా కులాలకు సంబంధించిన ముఖ్యులను పిలిపించి మాట్లాడుతం. వారి సామాజికవర్గానికి కేటాయించిన నిధులను పారదర్శకంగా, లబ్ధిదారులకు చేరే విధంగా చర్యలు తీసుకుంటం. పుట్టినప్పటి నుంచి కాటికి వెళ్లేదాకా ప్రభుత్వంలో ఏదో ఒక పథకం ఉంది. మే నెల నుంచి పథకాలు మొదలు కావాలె.

వెనుకబడిన సామాజిక వర్గాలు, ఎంబీసీ వర్గాల్లోని అనేక కులాలకు చట్టసభల్లో అవకాశాలు రాలేదు. వారి వాయిస్‌ చట్టసభల్లో లేకుండా పోయింది. వారు ఎన్నికల్లో నిలబడినా తక్కువ సంఖ్యలో జనాభా ఉన్నందున గెలిచే అవకాశాలు తక్కువగా ఉంటాయి. దీంతో ఈ వర్గాలకు రాబోయే రోజుల్లో ప్రత్యక్ష ఎన్నికల్లో కాకుండా ఎమ్మెల్సీ పదవులతోపాటుగా ఇతర పదవులు ఇస్తాం. అయితే దీనికి కొంత సమయం పడుతుంది. అప్పటివరకు వేచి ఉండాలి. బోయవాళ్లను ఎస్టీలలో చేరుస్తం.

రాష్ట్రంలో ప్రస్తుతం 45లక్షల వరకు గొర్రెలున్నాయి. వీటికి అదనంగా 88లక్షల గొర్రెలను 75 శాతం సబ్సిడీతో అందిస్తాం. రెండు సంవత్సరాల్లో ఒక గొర్రె మూడు ఈతలు ఈనుతుంది. నాలుగున్నర కోట్ల గొర్రెలయితయి. వీటిలో నాలుగు కోట్లను లెక్క వేసుకుని ఒక్కో దాన్ని రూ.5వేలకు అమ్మినా రూ.20వేల కోట్లవుతయి. వీటి ద్వారా రాబోయే రోజుల్లో యాదవులు రూ.20వేల కోట్లు ఆర్జించగలుగుతారు. శ్రీమంతులవుతారు. హైదరాబాద్‌కు ప్రతిరోజు ఇతర రాష్ట్రాల నుంచి 350 లారీల గొర్రెలను తెప్పించుకుంటున్నం. తెలంగాణ ప్రాంతం మొత్తానికి 600 లారీల గొర్రెలు తెచ్చుకుంటున్నం. ఇకపై గొర్రెలు వచ్చుడు బంద్‌ కావాలి.. ఇక్కడి నుంచి పోవుడే ఉండాలి. గొర్రెలకు అవసరమైన గడ్డిని పండ్ల తోటల్లో పెంచుకొని, మేపడానికి అనుగుణంగా రెండుమూడు రోజుల్లోనే జీవో ఇస్తాం. యంత్రాలు రావడంతో వస్త్రాల చేనేత కార్మికులకు పనితగ్గింది. అదే సమయంలో ప్రభుత్వాలు వారి గురించి పట్టించుకోవడం మరిచినయి. వాళ్ల ఆకలిచావులను, ఆత్మహత్యలను నిరోధించేందుకు తెలంగాణ రాష్ట్రంలో కనీవినీ ఎరుగని రీతిలో రూ.1200 కోట్లు కేటాయించినం. ఉమ్మడి రాష్ట్రంలో 23 జిల్లాలకు కలిపి కూడా ఇంత పెద్ద ఎత్తున నిధులు కేటాయించలేదు.

గ్రామాల్లో చెరువు గట్లమీద, చెట్ల కింద గడ్డం గీసుకోవడం, కటింగ్‌ చేయించుకోవడానికి యువత ఎవరూ ఆసక్తి చూపడంలేదు. పట్టణాలకు, మండల కేంద్రాలకు వెళ్లి సెలూన్లలోనే కటింగ్‌ చేయించుకుంటున్నారు. ప్రతి విలేజ్‌లో బ్రహ్మాండమైన మాడ్రన్‌ సెలూన్‌ రావాలె. దీనికోసం నాయీ బ్రాహ్మణులకు వంద శాతం సబ్సిడీతో 30వేల సెలూన్లు మంజూరు చేస్తాం. బ్యాంకులు, వేటితో సంబంధంలేకుండా ఇస్తాం. దేవాలయాల్లో తలనీలాలు తీసే నాయీబ్రాహ్మణులను దేవాదాయ శాఖ రెగ్యులర్‌ ఉద్యోగులుగా చేస్తాం.

Other Updates