cm2తెలంగాణలో బలహీనవర్గాలు ఎక్కువ సంఖ్యలో ఉన్నందున అందుకునుగుణంగా రిజర్వేషన్లు పెంచుకోవాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అన్నారు. తమిళనాడు తరహాలో ప్రత్యేక చట్టం తెచ్చి ముస్లింలకు జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లు కల్పిస్తామని స్పష్టం చేశారు. ఎస్టీలకు జనాభా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలనేది రాజ్యాంగ నిబంధన కాబట్టి, అందుకునుగుణంగా తెలంగాణలో ఎస్టీల రిజర్వేషన్‌ పెంచే విషయంలో తగు చర్యలు తీసుకుంటామని సిఎం వెల్లడించారు. ఎస్టీలు, మైనారిటీల సామాజిక, ఆర్థిక స్థితిగతులపై అధ్యయనం జరిపిన చెల్లప్ప, సుధీర్‌ కమిషన్లు ఆగస్ట్‌ 12న క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రికి నివేదికలు అందచేశాయి.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లుడుతూ, తమిళనాడు తరహాలో తెలంగాణలో కూడా అవసరమైన మేరకు రిజర్వేషన్లు కల్పించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణలో ముస్లింలకు అత్యంత పేదరికంలో ఉన్నారు కాబట్టి, వారికి విద్య, ఉపాధి అవకాశాలు కల్పించడానికి రిజర్వేషన్లు తప్పనిసరి అని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించే విషయంలో త్వరలోనే కేబినెట్‌ సమావేశం ఏర్పాటు చేస్తామని, తర్వాత ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు కూడా నిర్వహించి ప్రత్యేక చట్టం తెస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు. షెడ్యూల్‌ తెగల వారికి జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని రాజ్యాంగమే చెబుతున్నదని, దాని ప్రకారం తెలంగాణలో ఎస్టీలకు రిజర్వేషన్లు పెంచాల్సి ఉందన్నారు. సమైక్య ఆంధ్రప్రదేశ్‌ లో ఎస్టీలకు ఆరు శాతం రిజర్వేషన్లు దక్కాయని, దీనివల్ల తెలంగాణ ఎస్టీలు నష్టపోయారని సిఎం అన్నారు. తెలంగాణలో ఎస్టీలకు జనాభా ప్రకారం రిజర్వేషన్లు కల్పించడానికి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. చెల్లప్ప, సుధీర్‌ కమిషన్లు సమర్పించిన నివేదికను సమగ్రంగా పరిశీలించి ముస్లింలు, ఎస్టీల జీవన ప్రమాణాలు పెంచే చర్యలు తీసుకుంటుందని సిఎం చెప్పారు.

ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ అలీ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్‌, హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌ శర్మ, ఎజి రామకృష్ణారెడ్డి, సిఎం ముఖ్య కార్యదర్శి ఎస్‌. నర్సింగ్‌ రావు, ప్రత్యేక కార్యదర్శి భూపాల్‌ రెడ్డి, సుధీర్‌ కమిషన్‌ సభ్యులు ఎంఎ భారి, డాక్టర్‌ అమీరుల్లాఖాన్‌, ఎ. షాబూన్‌, చెల్లప్ప కమిటీ సభ్యులు కె. జగన్నాథరావు, హెచ్‌.కె. నాగు పాల్గొన్నారు.

Other Updates