రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ జీవనరీతి, సంప్రదాయాల పరిరక్షణలో మరో ముందడుగు వేసింది. రాష్ట్ర ప్రత్యేకతలను ప్రపంచానికి చాటి చెప్పడానికి, స్థానిక జీవనంలో విశిష్టమైన పాత్రను పోషించే జమ్మిచెట్టు (వృక్షం), పాలపిట్ట (పక్షి), తంగేడుపువ్వు (పుష్పం), జింక (పసురం)లను రాష్ట్ర అధికారిక చిహ్నాలుగా ఎంపిక చేసింది.ఈ నాలుగు చిహ్నాలు ఇకముందు రాష్ట్రానికి అధికారిక చిహ్నాలుగా ఉంటాయని రాష్ట్ర ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు నవంబర్ 17న ప్రకటించారు. తరిచి చూస్తే ఈ నాలుగు చిహ్నాల పాత్ర, చరిత్ర, సాహిత్యరంగాలలో అపారం.
తంగేడు పువ్వు
మహిళల పండుగైన బతుకమ్మ, తెలంగాణ ఆడపడుచుగా వినతికెక్కిన ఎల్లమ్మ పేరుమీద జరిగే పండుగలో తంగేడుచెట్టుది, పువ్వుది ప్రధాన పాత్ర, తంగేడుపువ్వు, దాని బెరడుతో చర్మకారులు జంతు చర్మాలను శుద్ధి చేసి వాటిని గ్రామీణ వ్యవసాయ రంగపు పనిముట్లతయారికి ఉపయోగిస్తారు. చర్మాన్ని తంగేడు బెరడుతో ఊరవేసే గోళాన్ని వారు లందె అని పిలుస్తారు. తెలంగాణ సమాజంలో ఎల్లమ్మ పండుగను చేయని గ్రామమంటూ లేదు. తంగేడుకు ఔషధమొక్కగా గుర్తింపు ఉన్నది. బతుకమ్మ పండుగలో తంగేడు పువ్వులు ప్రశస్తమైన పాత్ర వహిస్తాయి.
ఏడు తంతెలుగా పేర్చే బతుకమ్మలో రెండవ వరస తంగేడు పూలదే. మొదటి వరస గునుగుపూలది. ఇవి కంచె భూములలో ఎక్కువ పెరగడం వీటి ప్రత్యేకత.ఈ రకంగా ఇటు అట్టడుగు వర్గాలు, మహిళల జీవితంలో ప్రధాన పాత్ర వహించే తంగేడుపువ్వును రాష్ట్ర చిహ్నాంగా ఎంపిక చేసి ప్రభుత్వం చాలా న్యాయబద్ధమైన నిర్ణయం తీసుకున్నది. అడవిలో సహజసిద్ధంగా పెరిగే తంగేడుపువ్వు ప్రకృతికే అందాన్ని తెస్తుంది. తంగేడుపూలను ఆడపడుచులు తమ సౌభాగ్యాన్ని కాపాడే విశిష్ఠ పుష్పంగా భావిస్తారు.
జమ్మిచెట్టు
భారతీయ జీవన రీతికి ప్రతీక, మహా భారతంలో చేరి తెలంగాణ జనం గుండెలలో యుగయుగాలుగా శాశ్వత స్థానం పొందిన ఈ జమ్మిచెట్టు దసరా పండుగలో ప్రధాన పాత్ర వహిస్తున్నది. జమ్మిపూజ విజయానికి, శుభసూ చనకు చిహ్నం. ఇంతేకాదు ఈచెట్టు పూజతోనే పండుగ మొదలు కావడం ప్రత్యేకత.తర్వాత పాలపిట్టను చూడడం, తాము కోరుకున్న కోర్కెల సాఫల్యానికి కాగితం మీద రాసి జమ్మి కొమ్మలకు అంటించడం ఆనవాయితి. స్థానికంగా మూకుమ్మడిగా జరుపు కునే పండుగలలో ఇదొకటి.కొన్ని వర్గాలకు కులపురాణమైన పాండవులకథలో కూడా ఈ జమ్మిఘట్టం ప్రముఖంగా ఉన్నది.
పాల్కుర్కి సోమన ప్రస్తావించిన ఈ పండుగకు మరోపేరు విజయ దశమి. ఈపేరుతో భారతదేశమంతా చెలామణిలో ఉన్నది. ఏటా జరిగే మైసూరు దసరా ఉత్సవాలు చాలా ప్రసిద్ధిగాంచాయి. నిజాముల కాలంలో అవి గద్వాల, వనపర్తి పట్టణాలలో మైసూరుతో సమంగా జరిగేవన్నది ప్రతీతి.
మహాభారతంలో పాండవులు అజ్ఞాతవాసానికి వెళ్లినకాలం వినసొంపైనది. పాండవులు అజ్ఞాతవాసానికి వెళ్లేముందు తాము ఎల్లవేళలా భద్రంగా చూసుకునే ఆయుధాలు జమ్మి చెట్టుపై దాస్తారు. అన్యుల వశం కాకుండా అవ్విటిని శవంవలే కనపడేలా చేస్తారు. అజ్ఞాతచెర నుంచి బాజాప్త బయటపడి తిరిగి జమ్మి చెట్టుకు పూజ చేసి దానిపై దాచిన ఆయుధాలను తీసుకుని అమ్ముల పొదిలో దాచు కుంటారు. వాటిని దాచుకునే సంప్రదాయం దసరాపండుగ నుంచే వ్యాప్తి కొచ్చింది.
కాకతీయుల కాలంలో పన్నులకు నిరసనగా ప్రతా పరుద్రునితో యుద్ధం చేసి వీరమరణం పొందిన సమ్మక్క, సారక్క, జంపన్నల గురించి తెలిసిందే. జంపన్న చనిపోతూ ఆయుధాలను జంపన్న వాగులోని జువ్విచెట్టువద్ద దాస్తాడు. ఆనాటి భారతంలో పాండవులవలే తాము దాచిన ఆయుధాలు తీసుకుని తమ వారసులు తిరిగి శత్రువుపై విజయం సాధిస్తారన్న గొప్ప విశ్వాసం ఇందులో ఇమిడి ఉన్నది.అధికసంఖ్యాకులైన కౌరవులను ఓడిరచడంలో తక్కువ సంఖ్యలో ఉన్న పాండవులకు జమ్మిచెట్టునుంచి శక్తి, ఆశీర్వాదం లభించాయి. తెలంగాణ రాష్ట్రానికి జమ్మిచెట్టు ఆశీర్వాదం కావాలని, మన రాష్ట్రానికి మేలు చేస్తుందని, దీనిని అధికారిక చిహ్నంగా ఎంపికచేశారు.
పాలపిట్ట
దసరా పండుగ రోజు జమ్మి పూజ ముగిసిన తరువాయి పాలపిట్టను చూడడం గ్రామ గ్రామాన ఆచారం. పాల పిట్టను దర్శించు కున్న తర్వాతే రాముడు లంకపై దాడికి వెళ్లి విజయం సాధించారన్నది నమ్మకం.ఈ కథ అవాల్మీకమైనా జనశ్రుతిలో చాలకాలంగా ఉన్నది. నెమలి తర్వాత చాలా అందమైన పిట్ట పాలపిట్ట. నీలిరంగు రెక్కలతో వాటిపై చుక్కలతో కనిపించే ఈ పక్షి మన ఊర్లలో మస్తుగా కనిపిస్తుంది. ఊరపిచ్చుకలు, గోరింకలు, గొయికలు, చిలకల తర్వాత ఎక్కువ కనిపించే పిట్టలలో ఇదొకటి.దాని రెక్కలలో కనిపించే నీలిరంగు దక్కనీ చిత్తర్వులకు ఆయువుపట్టు. మధ్యయుగాలలో వ్యాప్తిలోకి వచ్చిన ఈ చిత్రకళలలో రంగుల ఎంపిక ముఖ్యమైంది. మొగల్ చిత్రకళకు ఆకుపచ్చ, తమిళంలో తెలుపు, రాజస్థానీలో లేత గులాబీ రంగు ప్రముఖంగా కనిపిస్తాయి.ఒక రకంగా పాలపిట్ట రెక్కలలోని నీలిరంగే దక్కనీ చిత్రకళకు స్పూర్తి.ఆరంగులో గాజులు, గాజుకుప్పెలు తయారీ చేసే పరిశ్రమ ఇప్పటికీ పాతబస్తీలో ఉన్నది.
తెలంగాణ గ్రామీణ సమాజంలో పాలపిట్టల పాత్ర మరొకటికూడా ఉన్నది. అడవి, పంటభూమి, కంచెలలో పాములు కనిపిస్తే కేర్ కేర్ మంటూ లొళ్లి పెట్టి తమ చుట్టు పక్కల జీవరాశిని సోయికి తెేస్తాయి. ఎంతటిపామైనా వాటి లొళ్లికి పారి పోవడం ఖాయం. దీనివల్ల కూడా పాలపిట్టను రాష్ట్రపక్షిగా ఎంపిక చేయడం సమంజసమే. ఎల్లకాలం లోకంలో నానె మూడు రామాయణాలు తెలంగాణలో పుట్టాయి. గోనబుద్దన రంగనాథ రామాయణం, మంత్రి భాస్కరుని భాస్కర రామాయణం, కవియిత్రి మొల్ల రామాయణం తెలంగాణలో పుట్టాయి. తెలంగాణ విజయపథంలో నడవడానికి శుభసూచకంగా పాలపిట్టను అధికారిక పక్షిగా ఎంపిక చేశారు.
జింక
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన చిహ్నాలలో జింక ఒకటి. దీనిని లేడిపేరుతో కూడా పిలువడం మామూలు. వీటిలో రెండు రకాలు. ఒకటి అంతటా కనిపించే జింక, మరొకటి కృష్ణ జింక. సాధారణ జింకలు మాత్రం చిట్టడవులనుంచి పెద్ద అడవుల వరకు కనిపిస్తాయి. నిజాం కాలం వరకు ఇది పెంపుడు జంతువుగా కూడా మనింది.హైదరాబాద్‌లోని పై వర్గాలు జింకను పెంచుకోవడం గొప్పగా భావించేవారు. ముఖ్యంగా స్త్రీలకు పెంపుడు జంతువుగా, వారికి నెచ్చలిగా ఉండేది.
క్రూర జంతువులైన కుక్కలను, పిల్లులను పెంచుకోవడమనే సంప్రదాయం బ్రిటీషువారితో భారతదేశానికి దిగుమతయ్యింది. అంతకు మునుపు పెంపుడు జంతు వుగా జింక,పక్షులలో నెమలి,మైనా, చిలుకలు మాత్రమే ఉండేవి. ఇంతేకాదు వీటికి సంస్కృతం సహా తెలుగు సాహిత్యంలో ఇతోధిక ప్రాముఖ్యమున్నది.అలంకార శాస్త్రంలో అందమైన కన్నుల వర్ణనకు లేడి కన్నులే ఉపమానంగా తీసుకోవడం, కవి ఎవరైనా సరే స్త్రీ కనుల వర్ణణలు చేయవల్సి వస్తే లేడి కన్నులతో పోల్చడం పరిపాటి. సాహిత్యంలో తప్ప లేడి కన్నుల వంటి కండ్లు గల స్త్రీలు చాలా అరుదు. అయితే లేడి కన్ను దాని కనుపాప తెలం గాణ శిల్పకళను, అజంతా చిత్రకళనుంచి దక్కనీ చిత్రకళ వరకు ప్రభావితం చేస్తూనే ఉన్నది. మొత్తం భారతీయ చిత్రకళ సంబంధించి తీసుకుంటే పెంపుడు జంతువులలో జింకకు ప్రముఖ స్థానం ఉన్నది. తోటలో విహరించే స్త్రీలతోపాటు జింకలు, నెమళ్లు వాటిలో ఉండడం పరిపాటి. అత్యంత సున్నితమైన, అమాయక అటవీ ప్రాణిగా పేరున్న జింక తెలంగాణ ప్రజల మనస్తత్వానికి దగ్గరగా ఉంటుంది.