దేశపతి శ్రీనివాస్
జయజయోస్తు తెలంగాణ జననీ
జయము సకల సంపత్సంధాయినీ
జయభారత మాతృహృదయ రాగసుధా సంవర్ధినీ
జయజయ జయజయ జయజయ జయజయ
జయము జగద్యశస్వినీ… ||జయ||
తరులతా సహిత సాంద్రవనములూ
నీ గళమున మరకతమణి సరములు
తనువెల్లా ఖనిజనిధుల కాంతులు
విద్యుల్లత వికసించే దీప్తులూ…. ||జయ||
అలల సొగసులలరు నదీతేజమూ
గోదావరి నీదు స్వర్ణ చేలమూ
ఘలంఘలల నీనూపుర రవళులూ
గలగలమను కృష్ణవేణి పరుగులూ….
||జయ||
సమశీతల సుఖజీవన దాయినీ
సారభూత సుక్షేత్ర సుహాసినీ
శ్రామిక జన స్వేద సిక్త పావనీ
సుశ్యామల సస్యామృత జీవనీ….
జయజయోస్తు తెలంగాణ జననీ
జయము సకల సంపత్సంధాయినీ
జయభారత మాతృహృదయ రాగసుధా సంవర్థినీ
జయజయ జయజయ జయజయ
జయజయ జయము జగద్యశస్వినీ…