tsmagazine

తెలంగాణ మీడియా అకాడమి ఆధ్వర్యంలో తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియంలో 2017 ఫిబ్రవరి 28న ‘జర్నలిస్టుల నిధి’ జర్నలిస్టు కుటుంబాలకు చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. జర్నలిస్టు కుటుంబాలు, వారి పిల్లలు, ఉద్వేగం, కుటుంబ పెద్దలను కోల్పోయిన వారి దీనమైన ముఖాలు ఈ వాతావరణమంతా హాలు నిండా ఆవరించింది. పెద్దలు మండలి ఛైర్మన్‌ స్వామిగౌడ్‌, రాజ్యసభ సభ్యులు కే కేశవరావు, ప్రభుత్వ సలహాదారు రమణాచారి, తెలంగాణ మీడియా అకాడమి పాలకమండలి సభ్యులందరూ పాల్గొన్న ఈ సమావేశంలో జర్నలిస్టుల కుటుంబాలకు ముఖ్యంగా కుటుంబ పెద్దలను పోగొట్టుకున్న వాళ్లకు గొప్ప ఊరడింపు. ఈ జర్నలిస్టు నిధి పథకం మొదటిసారి గత సంవత్సరం ఫిబ్రవరి 17న ముఖ్యమంత్రి పుట్టినరోజున జరిగింది. స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేతులమీదుగా వంద కుటుంబాలకు చెక్కుల పంపిణీ జరిగింది. ఆనాటి సమావేశంలో కూడా ఉద్విగ్న వాతావరణం, ప్రగతిభవన్‌లో భాగంగా ఉన్న జనహిత ఆనాడు జర్నలిస్టుల నిధి పంపిణీతోనే ప్రారంభం అయింది. జర్నలిస్టుల పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఉన్న ప్రేమ, ఆదరణకు ఇంతకన్నా ప్రత్యక్ష నిదర్శనం ఏముంది? అందువల్లనే ఆనాడు జర్నలిస్టు కుటుంబాలవారు కేసీఆర్‌ను దేవుడనుకున్నారు.

తెలంగాణకోసం జర్నలిస్టులు పోరాడారు. ప్రత్యక్ష, పరోక్ష పోరాటాల్లో పాల్గొన్నారు. 2001లోనే తెలంగాణ జర్నలిస్టు ఫోరం ఏర్పాటు చేసి ‘తెలంగాణ కోసమే తెలంగాణ జర్నలిస్టులు’ అనే పేరిట ఉద్యమించారు. అదే ఒక మహాఉద్యమమైంది. రాజకీయ పార్టీలతో కలిసి వేదికలు ఏర్పాటు చేసింది. ఢిల్లీ పురవీధుల్లో తెలంగాణ కోసం నినదించింది. చివరగా హైదరాబాద్‌ ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో ‘జర్నలిస్టుల జన జాతర’ దాకా తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టు ఫోరమ్‌ పాత్ర మరువలేనిది. ఆ జాతరలో కేసీఆర్‌ పాల్గొన్నారు. ఆనాడు ప్రకటించిన జర్నలిస్టు సంక్షేమ పథకాలన్నింటినీ నెరవేర్చే అవకాశం ఆ తర్వాత ముఖ్యమంత్రిగా ఆయనకు దక్కింది. ‘జర్నలిస్టు నిధి’ కూడా ఈ సంక్షేమంలో భాగమే.

తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత కేసీఆర్‌ ప్రభుత్వంలో మొట్టమొదట ఏర్పాటు చేసింది మీడియా అకాడమీయే. తెలంగాణకు ప్రత్యేకంగా అకాడమీని మొట్టమొదట ఏర్పాటు చేసింది ముఖ్యమంత్రి కేసీఆర్‌. జర్నలిస్టు సంక్షేమం, శిక్షణ ఒకే ఏజెన్సీ ద్వారా జరగాలని భావించి మొదటిసారి ప్రెస్‌ అకాడమీకి స్వయంగా వచ్చి సీనియర్‌ ఎడిటర్లు, పాత్రికేయులతో సమావేశం ఏర్పాటు చేసి సమస్యలు విన్నది కూడా కేసీఆర్‌ మాత్రమే.

ఆ సమావేశం తర్వాతనే జర్నలిస్టు నిధి కోసం ఆయన పది కోట్ల రూపాయల ఫండ్‌ ప్రకటించారు. ఏటా పది కోట్ల చొప్పున, పదేండ్లపాటు జర్నలిస్టు నిధికోసం వంద కోట్ల ఫండ్‌ను ప్రకటించి, ఈ నాలుగేళ్లలో 34.50 కోట్ల ఫండ్‌ను అకాడమికి ఇచ్చిన ఘనత కూడా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌దే. పైన చెప్పిన రెండు సందర్భాల ఉద్విగ్న వాతావరణం ఈ నిధి పంపిణీకి సంబంధించినదే. ఇలాంటి నిధి దేశంలో ఏ రాష్ట్రంలో లేదు. తెలంగాణ కోసం పోరాడిన జర్నలిస్టులకు ఇది తెలంగాణ ప్రభుత్వం కానుక. ఇది జర్నలిస్టుల బతుకును శాశ్వతంగా మార్చే ఒక భవిష్యనిధి. ఈ నిధిని భవిష్యత్తులో అందరికీ అవకాశాలు దక్కేవిధంగా తీర్చిదిద్దవలసి ఉంది.

జర్నలిస్టుల సమావేశంలో ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాల్లో ముఖ్యమైనవి. అక్రెడిటేషన్ల పాలసీ, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా హెల్త్‌కార్డులు, ఇళ్ల స్థలాలు, నిధి ఏర్పాటు వినియోగం. ఎన్నికల ప్రణాళికలో పెట్టిన తీర్మానాల్లో కానీ, జర్నలిస్టు జాతరలో స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటించిన విషయాలు, తెలంగాణ మీడియా అకాడమి కార్యాలయంలో కేసీఆర్‌ ప్రకటించిన విషయాలు కానీ ఇళ్ళ స్థలాలు తప్ప అన్నీ అమలయ్యాయి. జర్నలిస్టు నిధిని 34.50 కోట్లు మంజూరుతో నిజమయింది. ఆ పథకం విజయవంతంగా అమలవుతున్నది. తెలంగాణ సిద్ధించిన జూన్‌, 2014 నుంచి ఇప్పటివరకు మరణించిన 150మంది జర్నలిస్టు కుటుంబాలకు సహాయం అందుతున్నది. 150 కుటుంబాలకు లక్ష రూపాయల వంతున ఒక కోటి 50 లక్షలు ఒకేసారి సాయం. అయిదేళ్లపాటు ఈ కుటుంబాలకు తలా 3 వేల వంతున ఫించన్‌ ఇస్తున్నం. అట్లాగే ఈ కుటుంబాల్లో పదవ తరగతి వరకు చదువుకుంటున్న 104మంది విద్యార్థినీ, విద్యార్థులకు నెలకు వెయ్యి వంతున లక్షా నలభై వేలు ప్రతి నెలా అందుతున్నది. అంటే 150 కుటుంబాలకు ఏడాదికి దరిదాపు 50 లక్షల పైబడిన సాయం అందుతున్నది. ఇదంతా కూడా మూలనిధినుంచి వచ్చే వడ్డీతో ఏర్పాటయిందే. అట్లాగే అనారోగ్య కారణాలతో పనిచేయలేని స్థితిలోఉన్న 52మందికి 26 లక్షల రూపాయలను కూడా ఈ నిధి నుంచీ అందించాం.
tsmagazine

అక్రెడిటేషన్‌లకోసం కమిటీ ఏర్పాటు చేసి, ఆ కమిటీ నివేదిక ఆధారంగా అక్రెడిటేషన్‌ల మార్గదర్శకాల ప్రకారం మీడియా అకాడమి ఛైర్మన్‌నే అక్రెడిటేషన్‌ కమిటీ ఛైర్మన్‌గా చేసి రాష్ట్రంలో అక్రెడిటేషన్‌లు ఇచ్చారు. మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో డెస్క్‌ జర్నలిస్టులకు కూడా అక్రెడిటేషన్లు అందించారు. ఇది ‘జర్నలిస్టు జాతర’లో కేసీఆర్‌ హామీ ప్రకారం జరిగిందే. అట్లాగే మహిళా జర్నలిస్టులకు 33 శాతం అక్రెడిటేషన్లలో రిజర్వేషన్‌ కూడా అమలు చేస్తున్నది తెలంగాణలోనే. ఉమ్మడి రాష్ట్రంలో 23 జిల్లాలకు 12000 మాత్రమే అక్రెడిటేషన్లు ఉంటే, ఒక్క తెలంగాణ రాష్ట్రంలో అక్రెడిటేషన్ల సంఖ్య 16,793గా వున్నది, ఇది తెలంగాణ ఘనత.

కేసీఆర్‌ ప్రభుత్వంలో అతి ముఖ్యమైన హామీ హెల్త్‌కార్డులు. సంస్థల గుర్తింపు, చాలా సందర్భాలలో సంస్థల గుర్తింపు కూడా లేని పాత్రికేయులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా హెల్త్‌కార్డులు ఇస్తామని కేసీఆర్‌ హామీ ఇచ్చారు. ఆ ప్రకారంగా కొన్ని ప్రభుత్వశాఖలు కొర్రీలు వేసినా కేసీఆర్‌ స్వయంగా జోక్యం చేసుకుని ఒక్క నయాపైసా కట్టకుండా, అపరిమితంగా ఎంత ఖర్చయినా వర్తించే విధంగా జర్నలిస్టులకు ఉచిత హెల్త్‌కార్డులు ఇచ్చారు. గుండె జబ్బులలాంటి అతిపెద్ద ఆపరేషన్లు కూడా ఈ కార్డు క్రింద జరిగాయి. అదనంగా జర్నలిస్టు కుటుంబాలలో తల్లీదండ్రిని కూడా ఈ పథకంలో కలిపారు. నిజంగానే ఇది ఒక ఆశాదీపంలాంటి కార్డు. ఇప్పటివరకు ఈ పథకం క్రింద 8748 మంది జర్నలిస్టులు హెల్త్‌కార్డులను పొందారు. కుటుంబ సభ్యులతోకలిసి 40,409 కార్డులు జర్నలిస్టు హెల్త్‌కార్డుల స్కీమ్‌లో ఉన్నాయి. ఐ అండ్‌ పీఆర్‌లో ఇప్పటికీ కార్డుల జారీ ఏర్పాట్లున్నాయి.

కేసీఆర్‌ జర్నలిస్టుల జాతర సమయంలోకానీ, మీడియా అకాడమిలో జరిగిన సమావేశంలోకానీ, పార్టీ ప్రణాళికలో పేర్కొన్న విధంగానే జర్నలిస్టు సంక్షేమనిధి, హెల్త్‌కార్డులు, అక్రెడిటేషన్లను విజయవంతంగా పరిష్కరించారు. ఇళ్ల స్థలాల విషయంలో కూడా మూడుసార్లు ముఖ్యమంత్రి స్వయంగా అన్ని యూనియన్‌ నాయకులతో, సీనియర్లతో, మీడియా అకాడమీ ఛైర్మన్‌తో గంటలపాటు చర్చించారు. సుప్రీంకోర్టులో ఉన్న ఒక కేసు, కొన్ని ఇతరత్రా సమస్యలవల్ల ప్రతిష్టంభన కొనసాగుతున్నది కానీ, ఏదో ఒక మార్గంలో ఈ సమస్య పరిష్కరిస్తామని, ఇటీవలే మీడియా అకాడమి ఛైర్మన్‌తో ముఖ్యమంత్రి మాట్లాడారు. జర్నలిస్టులకు ఇళ్లస్థలాలు ఇవ్వడం అంటే ఒక్క హైదరాబాద్‌లో ఇవ్వడమేకాదు. రాష్ట్రంలో అర్హులయిన మండలస్థాయి విలేకరులతో సహా సుమారు 20,000ల మందికి ఇవ్వాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. ఆ మేరకు మీడియా అకాడమి తరఫున సీఎంవో అధికారికి సీఎం సూచన మేరకు మండలస్థాయినుంచి రాజధాని స్థాయిదాకా ఇళ్ల స్థలాలు లేదా ఇళ్ల సమ స్యకు ఎలాంటి పరిష్కారాలు ఇవ్వాలని సూచిస్తూ ఒక నివేదిక కూడా ఇవ్వడం జరిగింది. ఆ నివేదిక ప్రకారం నియోజక వర్గ, మండలస్థాయిలో ఎమ్మెల్యేలు, నగరాలు, పట్టణాలస్థాయిలో మంత్రులు, అంతిమంగా రాజధానిలో ముఖ్యమంత్రి సమక్షంలో ఈ సమస్య పరిష్కారం కావాలని సూచించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్దేశించిన ప్రకారంగా ఒక వంక సంక్షేమం, మరోవంక శిక్షణ అనే రెండు కార్యాలు నిర్వహిస్తూ మీడియా అకాడమి ఇప్పటికే తెలంగాణ ఉమ్మడి జిల్లాలు మెదక్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, ఖమ్మం, వరంగల్‌, కరీంనగర్‌, ఆదిలాబాద్‌లలో అకాడమి శిక్షణా తరగతులను నిర్వహించింది. జర్నలిస్టు తరగతులన్నింటికీ జాతరలా జర్నలిస్టులు తరలివచ్చారు. తెలంగాణ వచ్చిన నేపథ్యంలో మన సీనియర్‌ సంపాదకులు, జర్నలిస్టులు తీసుకున్న తరగతులు విజయవంతమై 5000మంది వరకు శిక్షణ పొందారు. అట్లాగే శాశ్వతంగా శిక్షణకోసం, భవిష్యత్తులో ముఖ్యమంత్రి కోరిక మేరకు ‘స్టేట్‌ ఆఫ్‌ ఆర్ట్‌ అకాడమి’లాగా తీర్చిదిద్దడానికి మీడియా అకాడమికి 15 కోట్ల రూపాయలతో కొత్త భవనం మంజూరు చేశారు. త్వరలోనే ఛాపెల్‌రోడ్‌లో అయిదు అంతస్తుల్లో మీడియా అకాడమి భవనం రానున్నది. శాశ్వతంగా ఈ అకాడమి ద్వారా కోర్సుల రూపకల్పన జరుగనున్నది.

ఇవేకాక క్యాన్సర్‌ బారిన పడిన జర్నలిస్టు నాగరాజుకు 8 లక్షలు, గుండె జబ్బు బాధితుడు హరికృష్ణారెడ్డికి 10 లక్షలు, దరిదాపు రెండువందలమంది జర్నలిస్టులకు సీఎం సహాయనిధి నుండి రెండు కోట్ల రూపాయల పైబడి సాయం ఈ నాలుగేళ్లలో జరిగింది. జర్నలిస్టుల సంక్షేమానికి సంబంధించి కూడా కొత్త రాష్ట్రమైన తెలంగాణ కొత్త ఒరవడి. అందువల్లనే ఇతర రాష్ట్రాల యూనియన్లు, ఇతర రాష్ట్రాల మీడియా అకాడమిలు ఇక్కడ అమలు జరుగుతున్న పనుల పరిశీలనకు వస్తున్నారు. జర్నలిస్టుల సంక్షేమంలో కూడా తెలంగాణ రాష్ట్ర నమూనాగా నిలుస్తున్నది. తెలంగాణ కొత్త రాష్ట్రమే అయినా భారతదేశానికి ఆదర్శప్రాయంగా ఉన్నది కనుకనే అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది.

అల్లం నారాయణ

Other Updates