ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు తన పుట్టిన రోజు సందర్భంగా జర్నలిస్టులకు పలు వరాలు ప్రకటించారు. జర్నలిస్టుల సంక్షేమానికి ఇప్పటికే రూ. 20 కోట్లు కెటాయించామని, ఈ ఆర్థిక సంవత్సరం మరో 30 కోట్లు కెటాయించనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. ఫిబ్రవరి 17న తన జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రగతిభవన్‌లోనిజనహిత సమావేశ మందిరంలో మొట్టమొదటిసారి ఏర్పాటు చేసిన ”జనహితం-జర్నలిస్టులకు ఆపన్న హస్తం” కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా చనిపోయిన 69 మంది జర్నలిస్టుల కుటుంబాలకు ఒక్కొ కుటుంబానికి లక్ష రూపాయల చొప్పున, గాయపడిన, విధులు నిర్వహించలేని వారికి రూ. 50 వేల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందించారు. జర్నలిస్టుల కుటుంబాల సమస్యలను తెలుసుకున్న అనంతరం మాట్లాడుతూ మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు అయిదు సంవత్సరాల పాటు నెలకు రూ. 3వేలు పెన్షన్ అందిస్తామన్నారు. చదువుకునే విద్యార్థులు ఉంటే నెలకు రూ. వెయ్యి అందిస్తామని తెలిపారు. ఇల్లు లేనివారికి ఆయా జిల్లాలలో డబుల్ బెడ్‌రూం ఇల్లు కేటాయిస్తామన్నారు. అలాగే ఈ కుటుంబాలలో ఆడపిల్లల వివాహాలకు రూ. 3లక్షలు, జర్నలిస్టుల పిల్లలకు రెసిడెన్షియల్ స్కూళ్ళలో రిజర్వేషన్ తదితర సౌకర్యాలు కల్పించనున్నట్లు తెలిపారు. సీనియర్ జర్నలిస్టు హరికిషన్‌రెడ్డికి గుండెమార్పిడి శస్త్రచికిత్స ఉందని, పదిలక్షలు ఖర్చువుతాయని జర్నలిస్టు మిత్రులు నాతో చెప్పగా రూ. 10 లక్షలు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరీ ఇచ్చినట్లు కేసీఆర్ తెలిపారు.
జర్నలిస్టులకు తమ ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుంద న్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 13 వేలమంది జర్నలిస్టులు ఉన్నట్లు అంచనా వేశారని, వారి బాగోగుల కోసం ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. రాష్ట్రంలోని అందరు జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు సమకూరుస్తామని ప్రకటించారు. ఏ జిల్లా జర్నలిస్టులకు ఆ జిల్లాలోనే ఇండ్ల స్థలాలు సమకూరుస్తామన్నారు. జర్నలిస్టుల సంక్షేమంలో తెలంగాణ దేశానికే తలమానికంగా నిలుస్తుందన్నారు. జర్నలిస్టులు కూడా పాజిటివ్ ధృక్పదాన్ని అలవర్చుకోవాలన్నారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమాల అమలులో తోడ్పాటు అందించాలన్నారు.
చిన్నచిన్న లోపాలుంటే ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలన్నారు. అవినీతి పరుల బండారం బయటపెట్టాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మెరుగు జైహింద్ సిద్ధిపేటకు చెందిన సీనియర్ పాత్రికేయుడు కొమరవెళ్ళి అంజయ్యపై రూపొందించిన డ్యాక్యుమెంటరీ సీడీని ముఖ్యమంత్రి విడుదల చేశారు.
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడుతూ గ్రామీణ ఆర్థిక వికాసానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. తెలంగాణ సొంత రాబడులతో దేశంలోనే నంబర్‌వన్‌గా నిలిచిందన్నారు. సొంత రాబడులలో 19.5 శాతం వృద్ధి రేటు సాధించిందని తెలిపారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో పేదరికం పోవాలని ఆకాంక్షించారు. మానవవనరులు అభివృద్ధి చెందాలన్నారు. అందుకే అన్ని వర్గాల అభివృద్ధికోసం ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. మత్త్యకారులకు చేపల పెంపకం ద్వారా వారి జీవితాల్లో వెలుగులు నింపే విధంగా ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. అలాగే యాదవులకు గొర్రెల పెంపకం ద్వారా ఆర్థికంగా అభివృద్ధి చెందే విధంగా సబ్సిడీపై గొర్రెలనుసమకూరుస్తున్నట్లు తెలిపారు.
మానవ వనరులను వినియోగించుకోవాలని, అందుకు తగిన విధంగా ప్రభుత్వ అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాల్సి ఉంటుందన్నారు. స్థానిక మానవ వనరులను ఉపయోగించుకుంటే ఎంతో అభివృద్ధి సాధించవచ్చన్నారు. అలాగే పారిశ్రామిక అభివృద్ధికి టీఎస్-ఐపాస్ రూపొందించినట్లు తెలిపారు. గ్రామీణ వ్వస్థను, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చే దిశగా భారీ నీటిపారుదల ప్రాజెక్టులను చేపట్టి గ్రామీణ ప్రాంతాలు సస్యశ్యామలం కావడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఇక విద్యుత్ విషయంలో మనలో ఎన్నొ భయాలు కల్పించారని, వాటిని పటాపంచలు చేస్తూ 24 గంటలు కరంట్ ఇస్తున్నట్లు తెలిపారు. ఇప్పుడు కరంట్ ఉంటే వార్త కాదని, లేకపోతే వార్తని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ఇలా అన్ని రంగాలలోను రాష్ట్రం ప్రగతిపథంలో పయనిస్తున్నదని, బంగారు తెలంగాణ బాటలో శరవేగంగా పయనిస్తున్నామని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో హోం మంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి, మిషన్ భగీరథ చైర్మన్ ప్రశాంత్‌రెడ్డి, ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, సమాచార పౌర సంబంధాలశాఖ కమిషనర్ నవీన్ మిత్తల్ తదితరులు హాజరయ్యారు.