మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు అండగా ఉండడంతో పాటు వారి సంక్షేమానికి భరోసా కల్పించిన ఘనత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానిదేనని రాష్ట్ర మీడియా అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. తెలంగాణ పోరాటంలో పాల్గొన్న జర్నలిస్టుల కోసం వంద కోట్లతో జర్నలిస్టుల సంక్షేమ నిధి ఏర్పాటు చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనని ఆయన అన్నారు.
నాంపల్లిలోని తెలుగు విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ ఆధ్వర్యంలో జర్నలిస్టుల సంక్షేమ నిధి నుండి 58 మంది మరణించిన జర్నలిస్టుల కుటుంబ సభ్యులకు, 25 మంది తీవ్ర అనారోగ్య / ప్రమాదాల బారిన పడిన జర్నలిస్టులకు 70 లక్షల 50 వేల రూపాయల చెక్కులను ఛైర్మన్ అల్లం నారాయణ, ఆందోల్ శాసనసభ్యులు చంటి క్రాంతి కిరణ్, పాలకమండలి సభ్యులు పంపిణి చేశారు.
ఈ సందర్భంగా అల్లం నారాయణ మాట్లాడుతూ, 2017 సంవత్సరంలో ముఖ్యమంత్రి పుట్టినరోజు సందర్బంగా జనహితలో బాధిత కుటుంబాలకు చెక్కుల పంపిణీని లాంఛనంగా ప్రారంభించారని, జర్నలిస్టుల సంక్షేమ నిధికి 100 కోట్ల మూల నిధిని ప్రభుత్వం ప్రకటించిందని, ఇందులో భాగంగా 34 కోట్ల 50 లక్షల రూపాయలు సంక్షేమ నిధిలో జమ అయ్యాయని గుర్తు చేశారు. ఇటువంటి ప్రయత్నం ఏ రాష్ట్రంలో జరగలేదని వివరించారు. మీడియా అకాడమీ ఒకవైపు సంక్షేమం, మరో వైపు శిక్షణ తరగతులను సమర్ధవంతంగా నిర్వహిస్తున్నదని అన్నారు.
భవిష్యత్తులో మీడియా అకాడమీ ద్వారా మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు జర్నలిస్టులకు అందించడానికి పాలకమండలి సభ్యులతో చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. జర్నలిస్టులు తమ వత్తిలో రాణించడంలో భాగంగా ఆరోగ్యం పై శ్రద్ధ చూపించడం లేదని, కుటుంబానికి పెద్ద దిక్కు మీరేనని గుర్తించి ఆరోగ్యంపై తగు శ్రద్ధ వహించాలని సూచించారు. వంద కోట్ల నిధి పూర్తిగా వచ్చిన తర్వాత జర్నలిస్టుల కుటుంబాలను ఆదుకో వడానికి మరిన్ని ప్రణాళికలు వేస్తామని, సంక్షేమానికి కొత్త పథకాలు తీసుకువస్తామని చెప్పారు.
బుద్ధవనం ప్రాజెక్టు స్పెషల్ ఆఫీసర్ మల్లేపల్లి లక్ష్మయ్య మాట్లాడుతూ, జర్నలిస్టుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని, తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చేస్తున్న కషిని అభినందించారు.
ఆందోల్ శాసనసభ్యులు చంటి క్రాంతి కిరణ్ మాట్లాడుతూ, తాను జర్నలిస్టు సమాజం నుంచి వచ్చానని, జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం దష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కషి చేస్తానని తెలిపారు. గతంలో ఏ ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమానికి కషి చేయలేదని గుర్తు చేశారు. చిన్న వయసులోనే పలువురు జర్నలిస్టులు
మరణించడం ఆందోళన కలిగిస్తున్నదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ టుడే ఎడిటర్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, శిక్షణ, సంక్షేమంతో మీడియా అకాడమీ జర్నలిస్టులకు సేవ చేస్తున్నదని అన్నారు. డెక్కన్ క్రానికల్ పొలిటికల్ ఎడిటర్ గౌరీశంకర్ మాట్లాడుతూ, ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నదని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె. శ్రీనివాస్, టి న్యూస్ సిఇఓ ఎమ్. నారాయణరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్ కొమురవెల్లి అంజయ్య, ఉస్మానియా యూనివర్సిటీ జర్నలిజం శాఖాధిపతి స్టీవెన్ సన్, జర్నలిస్టుల రాష్ట్ర నాయకులు మారుతీ సాగర్, ఇస్మాయిల్, యోగానంద్, వివిధ జిల్లాల జర్నలిస్టు ప్రతినిధులు, రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన జర్నలిస్టుల కుటుంబాలు తదితరులు పాల్గొన్నారు.