తెలంగాణ రాష్ట్రసాధనకోసం జరిగిన ఉద్యమంలో తమవంతుగా కలాలతో అలుపెరుగని పోరాటం చేసిన పాత్రికేయులను సమున్నతరీతిలో ఆదరిస్తామని ఎన్నాళ్ళుగానో చెబుతూవచ్చిన ముఖ్యమంత్రి చివరకు ఆ అంశాన్ని అందరికీ ఆమోదయోగ్యంగా వుండేవిధంగా నిర్ణయం తీసుకున్నారు. ప్రెస్‌అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, ఇతర సీనియర్ జర్నలిస్టులతో ఫిబ్రవరి 21న సమావేశమేర్పాటు చేసి పలు కీలక నిర్ణయాలపై సమీక్షించారు. ఎంతోకాలంగా అపరిష్కృతంగా వున్న జర్నలిస్టుల హెల్త్‌కార్డుల అంశాన్ని ఒక కొలిక్కి తెచ్చేందుకు ముఖ్యమంత్రి కెసీఆర్ తొమ్మిదిమంది సీనియర్ పాత్రికేయులతో ఒక కమిటీని ప్రకటించారు. ఈ కమిటీ సీనియర్ పాత్రికేయులు కె.రామచంద్రమూర్తి అధ్యక్షతన వారం రోజుల్లో ప్రభుత్వానికి నివేదికను సమర్పిస్తుంది.
ఈ సమావేశంలో వివిధ అంశాలను సమీక్షించిన ముఖ్యమంత్రి జర్నలిస్టుల సంక్షేమనిధికోసం 10 కోట్ల రూపాయలను కేటాయిస్తున్నట్లుగా ప్రకటించారు. ఫిబ్రవరి 23న జర్నలిస్టుల సంక్షేమనిధికి 10 కోట్ల రూపాయలను విడుదల చేస్తూ ఉత్తర్వులపై ముఖ్యమంత్రి సంతకం చేశారు. దీనితోపాటే జర్నలిస్టుల అక్రెడిటేషన్ కమిటీ నియామకానికి సంబంధించిన ఫైలుపై కూడా కెసీఆర్ సంతకం చేశారు. 2014`15 బడ్జెట్‌లో 10 కోట్లు విడుదలచేసిన కెసీఆర్ 2015`16 బడ్జెట్‌లోకూడా 10 కోట్లు కేటాయించాలని నిర్ణయించారు. ఈ డబ్బులను ప్రెస్ అకాడమి ఖాతాలో జమచేయాలని, బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్‌చేస్తే వచ్చే వడ్డీ డబ్బులతో జర్నలిస్టుల సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ కార్పస్‌ఫండ్ మొత్తాన్ని వందకోట్లకు పెంచుతామని కెసీఆర్ పేర్కొన్నారు.