kcrకాళేశ్వరం ప్రాజెక్టు భూమిపూజ సందర్భంగా సీ.ఎం. కేసీఆర్‌

గోదావరి జలాల్లో మన రాష్ట్రానికి వచ్చిన వాటా నీటిని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటామని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తేల్చి చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ వాటా నీటిని కూడా ఆంధ్రప్రదేశ్‌కే మళ్ళించుకు పోయారని, ఇప్పుడు ఆ ఆటలు సాగబోవన్నారు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేచిందే నీళ్ళు, నిధులు, నియామకాల విషయంలో అనే విషయం మరిచిపోరాదన్నారు.

ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారమే కృష్ణా, గోదావరి నదుల్లో 1300 టిఎంసీల నీటిని తెలంగాణ వాడుకునే వీలుందన్నారు. ఆ కేటాయింపులకు లోబడే రాష్ట్రంలో ప్రాజెక్టులు నిర్మిస్తున్నట్లు సీఎం స్పష్టం చేశారు. మే 2వ తేదీన కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన పంపుహౌజ్‌ నిర్మాణానికి మహదేవ్‌పూర్‌ మండలం కన్నేపల్లి వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్‌ భూమిపూజ చేశారు. అనంతరం ముఖ్యమంత్రి సతీమణి శోభతో కలిసి ప్రాజెక్టు నిర్మాణం చేపట్టే మేడిగడ్డ వద్ద భూమిపూజ నిర్వహించి పునాదిరాయి వేశారు.

ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. ప్రజలకు అవసరమైన మేరకు సాగునీరు అందించాలనే ఉద్దేశ్యం, వారు సుఖశాంతులతో జీవించాలనే కోరికతో అనేక రకాలుగా పరిశోధించి ఈ ప్రాజెక్టుల నిర్మాణాన్ని ఎంచుకున్నట్లు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టును రెండు సంవత్సరాల్లోనే పూర్తిచేసి ఎల్లంపల్లి ప్రాజెక్టుకు నీరు తరలిస్తామన్నారు. ఎల్లంపల్లి నుంచి మధ్య మానేరు(మిడ్‌మానేరు), మెదక్‌, హైదరాబాద్‌లకు నీటిని తరలిస్తామని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టులన్నీ పూర్తయితే ఉత్తర తెలంగాణకు ఉన్న దరిద్రం తొలగిపోతుందన్నారు. దేవాదుల నుంచి వంద టీఎంసీలు వరంగల్‌ జిల్లాకు తీసుకునే అవకాశం ఉందన్నారు. ఆదిలాబాద్‌లోని తుమ్మిడిహట్టి వద్ద కూడా బ్యారేజీలు నిర్మించి ఆ జిల్లాలో లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు.

కాళేశ్వరాన్ని పర్యాటక కేంద్రంగా చేస్తాం….

కాళేశ్వరాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధిపరుస్తామన్నారు. రూ. 25 కోట్లతో ఈ పుణ్యక్షేత్రాన్ని అన్ని వసతులతో తీర్చిదిద్దుతామని సీఎం తెలిపారు. ఈ మేరకు నిధులు మంజూరీ చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. కాళేశ్వరం ప్రాజెక్టునిర్మాణంతో ఇక్కడ గోదావరిలో 54 కిలోమీటర్ల మేర నీరు నిలువ వుంటుందని, దీనితో బోటింగ్‌, ఆలయ దర్శనం, అరణ్యంలో ప్రకృతి రమణీయ దృశ్యాలు సందర్శకులను ఆకర్షిస్తాయన్నారు.

కాళేశ్వరంలో మొక్కులు చెల్లించిన కేసీఆర్‌ దంపతులు

ముఖ్యమంత్రి కేసీఆర్‌ దంపతులు కాళేశ్వరం దేవాలయంలో ముక్తేశ్వర స్వామిని దర్శించుకుని పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. తెలంగాణ వస్తే స్వర్ణ కిరీటం చేయిస్తానని మొక్కుకున్న సందర్భంగా ఆ కిరీటాన్ని ముఖ్యమంత్రి సతీమణి శోభ అమ్మవారికి అలంకరింప చేశారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, స్పీకర్‌ మధుసూదనాచారి, ఉపసభాపతి పద్మా దేవేందర్‌రెడ్డి, మంత్రులు హరీష్‌రావు, ఈటెల రాజేందర్‌, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డిలతో పాటు పలువురు ఎం.పి.లు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Other Updates