sampadakeeyamప్రకృతి కరుణించడంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసి, నీటివనరులు నిండుకుండలను తలపిస్తున్నాయి. సుదీర్ఘకాలంపాటు అనావృష్టి, కరవుతో అలమటిస్తున్న ప్రజానీకానికి సమృద్ధిగా వర్షాలు కురియడం ఊరట ఇచ్చింది. ఆయా ప్రాంతాల్లోని నీటి పారుదల ప్రాజెక్టులు దాదాపు నిండడంతో వ్యవసాయానికి మంచిరోజులు వచ్చాయని అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇక రాష్ట్రంలో చిన్న నీటివనరులైన చెర్వు, కుంటల అభివృద్ధికోసం చేపట్టిన ‘మిషన్‌ కాకతీయ’ పథకంద్వారా చక్కని ఫలితాలు అందుతుండడంతో గ్రామీణ ప్రాంతాల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. సుమారు ముప్ఫై అయిదువేల చెరువులు నిండి, మత్తడి దుంకుతున్నాయనేది అన్నివర్గాలకూ సంతోషాన్నిస్తున్నది. కాకతీయుల కాలంనాటి గొలుసుట్టు చెరువుల శాస్త్రీయ విధానాన్ని పునరుద్ధరించడంద్వారా మాత్రమే సేద్యంతోపాటు వ్యవసాయ అనుబంధ కార్యక్రమాల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధిని పునరుద్ధరించగలుగుతామని నిర్ణయించడం ప్రభుత్వ పెద్దల దూరదృష్టికి నిలువెత్తు నిదర్శనం. ఉమ్మడి పాలనలో తీవ్ర నిర్లక్ష్యానికి గురై ఒక పద్ధతి ప్రకారం అమలు చేసిన కుట్రల దెబ్బతో లక్షలాది ఎకరాల పంటపొలాలు బీడువారి పోయాయి. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో వలస పాలకులపై సంధించిన అస్త్రాల్లో ‘నీళ్ళు’ మొట్టమొదటిదని ప్రస్తావించనక్కరలేదు. రాష్ట్రం ఏర్పాటయ్యాక నీటి పారుదల రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రాధాన్యతపై పథకాల అమలు ప్రారంభించింది. ఈ క్రమంలో రూపుదిద్దుకున్న మిషన్‌ కాకతీయ పనుల కారణంగా, తాంబాళాలుగా తయారైన చెరువుకుంటలు గంగాళాలుగా రూపాంతరం చెంది ”జలసిరి”తో కళకళలాడుతున్నాయి. నీటి వనరుల కింద రబీ సేద్యం దిశగా పనులు ప్రారంభంకానున్నాయి.

ఎడతెరిపిలేకుండా కురిసిన భారీ వర్షాలవల్ల రాజధాని నగరంలోని కొన్ని ప్రాంతాల్లో వరదనీరు కాలనీల్లో ప్రవేశించడం జనజీవనాన్ని ప్రభావితం చేసింది. ప్రభుత్వం వెంటనే స్పందించి అవసరమైన సహాయకచర్యలు చేపట్టడంతో బాధితులకు ఆపదలో అండగా నిలిచింది. మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం సమన్వయంతో వ్యవహరిస్తూ తక్షణ కార్యక్రమాలు చేపట్టడం బాధితులకు భరోసా ఇచ్చింది. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు భేషజాలకు పోకుండా సైనికదళాలు, జాతీయ విపత్తు నివారణ బృందాలను రంగంలోకి దింపారు. యుద్ధ ప్రాతిపదికపై సహాయక చర్యలు చేపట్టిన తీరు సమస్యల పరిష్కారంలో సర్కారు అంకితభావాన్ని చెప్పక చెబుతున్నాయి. వాస్తవానికి చెరువుల్లో రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లు, నాలాలపై దురాక్రమణలతో పబ్బం గడుపుకుంటున్న అక్రమార్కుల ధనదాహానికి అమాయక ప్రజలు ఎదుర్కొంటున్న కష్టనష్టాలు మాటలకందనివి. ఈ దుస్థితిని శాశ్వతంగా రూపుమాపేందుకు కబ్జాల స్వాధీనమే శరణ్యమని ప్రభుత్వం గుర్తించింది. ఈ దిశగా సమగ్ర కార్యాచరణ త్వరలో కార్యరూపం ధరించనుంది. అక్రమార్కుల భరతం పట్టి, అమాయకులను ఆదుకునేవిధంగా కార్యాచరణ సాగాలని ఆశిద్దాం.

Other Updates