శుభాంగీ దుర్యోధనుల పుత్రికయైన లక్షణను జాంబవతీ శ్రీకృష్ణుల కుమారుడగు సాంబుడు పరిణయమాడుట అనే ముఖ్య కథను 5 ఆశ్వాసాల్లో 1162 గద్య పద్యాలలో రసవంతంగా రచించిన కవి ఆసూరి మరింగంటి వెంకట నరసింహా చార్యులు. షోడశ ప్రబంధ నిర్మాతనని తెల్పుకున్న ఈయన రచనల్లో కొన్ని మాత్రమే లభించినాయి.

కవి తన గ్రంథాల్లో కొన్నిటికి ‘అభ్యుదయ’ నామాన్వితం. మరికొన్నింటికి ‘విలాస’ విశేషణాలను చేర్చి తదనుగుణంగా కథాకథనం చేయటం విశేషం. (కవి కొన్ని రచనల పరిచయం – చూ. ‘తెలంగాణ’ 2018 ఏప్రిల్‌ సంచిక). ఈ ప్రబంధనామంలోనే ‘శృంగారం’ తదనుగుణ ‘విలాసం’ వున్నాయి. కవి ఈ కథను సూతుని చేత శౌనకాది మహర్షులకు చెప్పించి, తన ఇలువేల్పయిన సిరిసెనగండ్ల నరసింహ స్వామికి అంకితం చేసినాడు. లభించిన తాళ పత్ర గ్రంథము 5 ఆశ్వాసం పూర్తిగా లేదు. వివాహ భోజనముల వద్ద ఆగిపోయినది. బహుశః లక్షణాసాంబులు ద్వారకా నగరాన్ని చేరటం. వారి శృంగార లీలా విలాసాలతో కవి కృతి సమాప్తి చేసియుందురు.

ఈ ప్రబంధ కథకు మూలం. భాగవత దశమస్కంధ

ఉత్తరభాగం (556-593 పద్యాలు)లోని చిన్న కథ దీనిని కొన్ని మార్పులతో ప్రబంధోచిత వర్ణనలతో పెంచి – వర్ణనా నిపుణః కవిః అనిపించుకున్నాడు.

తెలుగు సాహిత్యంలో సాంబవిలాస, సాంబోపాఖ్యానాలలో లక్షణను సాంబుడు పరిణయమాడినట్లు కలదు. ఇంకా లక్షణా పరిణయ, లక్షణా కల్యాణ గ్రంథాల్లో శ్రీకృష్ణ అష్టమహిషుల్లో ఒకర్తెయైన ‘లక్షణ’ను వివాహమాడిన విషయం కలదు. అందుకే కవి ఈ పేరును పెట్టవచ్చు. (సాంబశబ్దం శివార్ధంతో ప్రఖ్యాతం కాబట్టి శ్రీవైష్ణవుడైన కవి ఆ శబ్దాన్ని కృతి నామం చేయలేదు)

సంస్కృత భాగవతం మూలం (3-1-30) శ్రీధరీయవ్యాఖ్య యందు సాంబుడు పూర్వజన్మలో పార్వతీ గర్భ సంజాతుడని తెల్పినా, ఈ విషయం తెలుగు భాగవతంలోను, దాన్ని అనుసరించి చెప్పిన సాంబకథా గ్రంథాల్లోను లేదు. ప్రస్తుత కృతి కర్త కూడా ఈ ప్రసక్తిని రానీయలేదు. ఇంకా మన భాగవతంలో రాయబారం గాని, లక్షణ కొక చెలికత్తె యున్నదని గాని తెల్పలేదు. వెంకట నరసింహాచార్య కవి కథా పుష్టి కొరకు కావచ్చు. లక్షణకు గల చెలికత్తె ‘మందహాస’ అని, రాయబారిగా విప్రుడు (రుక్మిణీ కల్యాణం వలె) ఈ కథలో ప్రముఖ పాత్ర వహించినారు. వీరి ద్వారానే గాక వివిధ పాత్రలు, సన్నివేశాల వర్ణనలతో కవి ప్రబంధ రచనం చేసి

”యత్‌ స్యాదనుచితంవస్తు నాయకస్యరసస్యవా
విరుద్ధం తత్పరిత్యాజ్య అన్యథావాప్రకల్పయేత్‌-”
అనే అలంకారికోక్తిని సార్ధకం చేసినాడు.
లభించినంతవరకే ప్రబంధంలో సుదీర్ఘ వచనాలు.

ఉత్కలికాప్రాయాలై ‘కాదంబరి’ రచనను తలపింప చేస్తున్నాయి. ఇంకా శ్రీరంగగద్య శరణాగతి గద్యలశైలీ ప్రభావం బాగా కన్పడుతున్నది. ఈ పద్ధతి వచనాలు దాదాపు ఇరువది దాకా వుంటాయి.

భాగవత సప్తమ స్కంథంలోని స్తంభోద్భవ వచన రచనా ప్రభావంతో మరింత కఠినంగా దీనిలోని వచన రచన కలదు. దీనికి తోడు పద్య రచన కూడా శ్లిష్టబంధ పూరితం.

ఇది కవి కవితా తపః ఫలం అనుకోవచ్చు. అందుకే గంభీరార్థోద్యత్పద శుంభత్పద్య ప్రబంధ శోభన రచనా రంభకుతూహలము (1-66) ‘విస్తారగభీరార్థచారు శబ్దార్థాలంకార పద పద్య శుంభదవారిత వాక్‌ జృంభణము’ కల ఈ ‘జాంబవతీ కుమార శృంగార విలాసమును రచించు నాటికే ‘మరికొన్ని’ కృతులను రచించినట్లు తెల్పుకున్నాడు. ప్రథమాశ్వాస కృత్యాది పంచాయుధ స్తుతి నుండియే కలదు. దీనికి ముందు కొన్ని పద్యాలు లేవు. ఇదేవరుసలో మరి మూడు పద్యాలు అసమగ్రాలు (తాటాకులు చినిగి ఛిద్రమైనందున) సంక్షిప్తంగా దీనిలోని కథ – ఒకనాడు లక్షణ ఉద్యానవనంలో విహరిస్తుంటే చెలికత్తెయైన ‘మందహాస’ ద్వారా సాంబుని గూర్చి తెలుసుకొని ఆయన పొందుకుత్సహిస్తుండగా – నారదుడు ప్రత్యక్షమై – నీవు సాంబుని పొందు కొరకు నారాయణ మంత్ర జపం చేయవలెనని చెప్పి వెళ్లిపోతాడు. ఒక సంవత్సరం తర్వాత సాంబుడు ‘లక్షణ’కు స్వప్నంలో ప్రత్యక్షమై ఆమెను రతి కేళి తేల్చిపోతాను. ఇదే విషయాన్ని ‘మందహాస’కు తెల్పగా ఆమె దుర్యోధనునితో సంప్రదించి వివాహార్థం స్వయంవరాన్ని ఏర్పాటు చేస్తారు. కాని బలరామునకీ విషయం తెల్పనందున ‘లక్షణ’ ఒక బ్రాహ్మణ రాయబారిని బలరాముని వద్దకు పంపి ‘సాంబుని’తో తన పరిణయమగునట్లు చేయుమనును. అందుకనుగుణంగా సాంబుడు మాయా విద్యచే స్వయం వరమంటపంలో ప్రవేశించి ‘లక్షణ’ను వివాహమాడి ఆమెనుగైకొని వెళ్లు చుండగా దుర్యోధనాదులు సాంబునితో యుద్ధం చేస్తారు. అప్పుడు భీష్ముడు దుర్యోధనునితో సంప్రతించి బలరాముని కోపాన్ని ఉపశమింపచేస్తాడు. తర్వాత కురురాజు తాలాంకుని శరణుజొచ్చి లక్షణా సాంబుల కల్యాణమును ఘనంగా జరుపుతాడు. తదనంతరం బంధు మిత్రులంతా వివాహ భోజనాలను సంతృప్తిగా చేస్తారు. (ఇంతటితో గ్రంథం పూర్తయినది – అసమగ్రంగా)

కవికి కథా కథనంలో ప్రభావతీ ప్రద్యుమ్న, శృంగార నైషథ, భాగవత రాయబార ఘట్టాలు బాగా తోడ్పడినవి. ‘జాంబవతీకుమార…’ కృత్యాదిని చాలా వివరంగా విశేష విషయ పూరితం చేసిన ఆచార్యులవారికి కలలో కన్పడిన స్వామి యిట్లున్నాడట –

గణుతింపదైత్య ప్రకాండంబుకాండంబు
గెల్చువాడు పయోబ్ధి నిల్చువాడు
తరుణతహరుని కోదండంబుదండంబు
ద్రుంచువాడు శ్రితాళి బెంచువాడు
శారీరకాంతి మసారంబు సారంబు
దాల్చువాడు భయంబు దూల్చువాడు.
కంఠభాగమున శ్రీగంథంబు గంథంబు
దెల్పువాడు జయంబుని నిల్పువాడు.
మించుమెఱుగూను సిరిదండనుంచువాడు
కరము మణినాణి దనరు పెన్నురమువాడు
మిసిమి జిగిబూను దువ్వల్వ పసిమివాడు
కలను నేతెంచినను చాలా గౌరవించి (1-9)

ఈ గ్రంథాన్ని రచించి తనకే సమర్పించుమన్నాడట. తన రచనా ప్రణాళికాదులతో వంశావతార వర్ణన, షష్ఠ్యంతాలతో కృత్యాదిని పూర్తి చేసినాడు. వివిధ సందర్భాల్లో చక్కని పద్యరచన చేసి. అనేక మాండలికాలను. విశేష పదాలను ప్రయోగించి కావ్య గౌరవాన్ని ఇనుమడింపచేసిన కవిగారి పద్య రచన కొక వుదాహరణము –

శేషత్వమాత్మ విద్వేషవచ్ఛాత్రవ
ప్రాణానిలాపహారతులు దెలుప
కామపాలత్వమిష్టామితాశక్యదు
స్తర మనోరథ పూర్తికరతదెల్ప
నీలాంబరత్వమనేక మిత్ర బుధార్య
తారాతతాధారలై వెలుంగ
ద్వాపరస్ఫుట శ్రీశావతారమనియ
జాదు లభినుతిచేయ శేషాంశమునద
యాప్తివసుదేవతనయుడై యవతరించి
యుల్లసిల్లును బల భద్రుడొప్పుమిగుల (1-193)
పలుమఱువీనిమోవి గల పానక మానక మానకున్నెయీ
బలుగురు నగ్గివీ నిజిగి ప్రాయమపాయము పాయమున్‌ మదిం
దలపగ నేడు వీని మెయిదాగనిదాగ నిదాఘ నిష్ఠగా
దలపగరాదెదెల్పుమరుదాగలదా గల దాఖలా సఖీ – 2-41
(దాఖలా ఉర్దూపదం)

కవి పదప్రయోగాల్లో తబుకు = చిన్న పళ్లెం, వొయ్యి = పుస్తకం, ప్రౌఢాశనం = పురుడోశం, నవత్సుమ = నవసుమ, చతురయుగ = చతుర్యుగ, చతురసాగర్‌ = చతుస్సాగరం, జన్క = జనక – మొదలైనవి కొన్ని ఛందః పరంగా విశేష వృత్తాలు, తన నాటి వ్యవహార పదాలను యతి ప్రాసల్లో స్వేచ్ఛగా ప్రయోగించటం, కవి స్వతంత్రతా ప్రవృత్తి. వివరంగా – విశేషంగా – పరిశోధన చేయతగినది – జాంబవతీ కుమార శృంగార విలాసము.

డాక్టర్‌ శ్రీరంగాచార్య

Other Updates