తెలంగాణ జాతి గర్వించదగ్గ సాహితీవేత్త తిరునగరి రామానుజం అని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అభినందించారు. మహాకవి దాశరథి సాహితీ వారసుడిగా రామానుజం నిుస్తారని సీఎం అభిప్రాయపడ్డారు. మహాకవి దాశరథి పురస్కారం – 2020 ని ముఖ్యమంత్రి ‘ప్రగతి భవన్‌’లో రామానుజంకు అందించారు. శాలువా కప్పి సన్మానించారు. జ్ఞాపిక, రూ.1,01,116 నగదు పురస్కారం అందించారు.

దాశరథి పురస్కారానికి రామానుజం వందకు వంద శాతం అర్హుడని సీఎం అన్నారు. రామానుజం రాసిన బావీర శతకం, అక్షరధార, తిరునగరీయం లాంటి రచనలు ఎంతో ఆదరణ పొందాయని చెప్పారు. సంప్రదాయ, సంస్కృత భాష పరిజ్ఞానం కలిగి ఉండడంతోపాటు ఆధునిక సాహిత్య అవగాహన కలిగిన సాహితీవేత్తగా రామానుజం నిలుస్తారని అభినందించారు.

రామానుజం మరిన్ని రచనలు చేసి తెలుగు సాహిత్యాన్ని మరింత సుసంపన్నం చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎంపి కె. కేశవరావు, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, డిజిపి మహేందర్‌ రెడ్డి, సాంస్కృతిక శాఖ కార్యదర్శి శ్రీనివాస రాజు, డైరెక్టర్‌ మామిడి హరికృష్ణ, సిఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్‌, రామానుజం కుమారుడు శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రామానుజం ఓ పద్యం రాసి, పాడి వివినిపించారు.

‘‘శ్రీ తెలంగాణమును
శ్రీ ఖండమును సేయ
అవతరించిన యెట్టి
అపర విష్ణుడవీవు
తెలంగాణమున
కోటి ఎకరాలు పారించి
పంట భూమిగ మార్చ
ప్రతిన బూనిన యట్టి
రైతు స్వామివి నీవు
జాతి నేతవు నీవు
శ్రీ క్వకుంట్ల
క్షీరాబ్ధి చంద్రమా
శ్రీ రస్తు
శ్రీ చంద్రశేఖరా
తెలంగాణ దీపమా
విజయోస్తు’’

Other Updates