jatiratnamడాక్టర్‌ అయాచితం నటేశ్వర శర్మ

తెలంగాణలోని పాఠశాల విద్యను 20వ శతాబ్దంలో క్రమశిక్షణతో తీర్చిదిద్దిన మహనీయుడు ముద్దు రామకృష్ణయ్య. 1907 అక్టోబరు 18న కరీంనగర్‌ జిల్లాలోని పవిత్ర గోదావరీ తీరంలోని మంథనిలో పుట్టిన ఈ జాతిరత్నాన్ని గూర్చి ఈ తరం తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.

నిరుపేద బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన ముద్దు రామకృష్ణయ్య బాల్యంలోనే ఆర్థిక దుస్థితి కారణంగా అనేక కష్టాలను అనుభవించాడు. రోజుల తరబడి ఉపవాసాలు చేశాడు. అయినా మొక్కవోని ధైర్యంతో, దీక్షతో, పట్టుదలతో విద్యాభ్యాసం చేశాడు. కడుపు నింపుకోవడం కోసమే గాక, చదువు కోసం వరంగల్లుకు చేరిన ముద్దు రామకృష్ణయ్య చదువులో అంచెలంచెలుగా పైదిెగాడు. 1933లో ఉపాధ్యాయ వృత్తిలోకి అడుగుపెట్టిన ఆయన 1939లో కరీంనగర్‌లో ప్రభుత్వ పాఠశాలల పర్యవేక్షణా ధికారిగా పదోన్నతిని పొంది పాఠశాల విద్యా సంస్కరణకు శ్రీకారం చుట్టారు. 1944లో యూరప్‌కు వెళ్లి పాఠశాలల ప్రమాణాలపై అధ్యయనం చేశారు. ఆ తరువాత మాతృదేశంలో అడుగుపెట్టి ప్రభుత్వ విద్యాశాఖాధికారిగా కరీంనగర్‌, నిజామాబాదు, హైదరాబాదు మొదలైన జిల్లాలలో పనిచేసి పాఠశాల విద్యానిర్వహణలో ఉన్నత ప్రమాణాలను నెలకొల్పారు.

క్రమశిక్షణలోనూ, సమయపాలనలోనూ రామకృష్ణయ్య అగ్రేసరుడు. ఆయన జగిత్యాలలో ప్రధానోపాధ్యాయుడుగా పనిచేస్తున్న సమయంలో పాఠశాలలో జాతీయపర్వదినాన పతాక వందన కార్యక్రమానికి ఒక రాజకీయ ప్రముఖుణ్ణి పిలిచా రట. ఉదయం 9.00 గంటలకు ఆ ప్రముఖుడు రావలసి ఉంది. కానీ ఆయన సమయానికి రాలేదట. సమయం కాగానే ఆ ముఖ్యుడికోసం ఎదురుచూడకుండా రామకృష్ణయ్య జెండా వందనాన్ని నిర్వహించాడట. ఆహూతుడైన ప్రముఖుడు పదినిమిషాల ఆలస్యంగా వచ్చాడట. అప్పుడు రామకృష్ణయ్య మొహమాటం లేకుండా ఆయనకు సమయపాలనను గూర్చి వివరించి, పంపేశాడట.

కొన్నాళ్లకు మరొక జాతీయ పర్వదినాన జెండావందనానికి మళ్లీ అదే ప్రముఖుణ్ణి ఆహ్వానించారట. ఈ సారి ఆ ప్రముఖుడు ముందు జాగ్రత్తగా 8.30 గంటల పాఠశాలకు వచ్చాడట. కానీ పాఠశాల గేటు తెరవలేదట. 9.00 గంటలకు పతాక వందనం ముగిశాక ఆ ప్రముఖుడు రామకృష్ణయ్యతో తాను అరగంట ముందుగా వచ్చినా, పాఠశాలగేటు తెరవలేదని ప్రస్తావించాడట. అప్పుడు రామకృష్ణయ్య ఏ మాత్రం జంకకుండా.. ”అయ్యా! మీరు రావలసింది తొమ్మిదింటికి కదా? ముందుగానే ఎందుకు వచ్చారు?” అని నిష్కర్షగా సమాధానం చెప్పాడట. ఇదీ ముద్దు రామకృష్ణయ్య గారి విధి నిర్వహణశైలి!

ఈ మహానుభావుడు చేసిన సంస్కరణలెన్నో. ఉదాహరణకు – ఆయన 1951లో జగిత్యాలలో ప్రధానోపాధ్యాయుడుగా పనిచేసిన కాలంలో ప్రతి తరగతి గదిలో ఆడియో స్పీకర్లు పెట్టించి, తన మాటలూ, సూచనలూ ఎప్పటికప్పుడు ఉపాధ్యాయులూ, విద్యార్థులూ తెలియజేస్తూ, వారి కర్తవ్య నిర్వహణను పర్యవేక్షించేవాడు.

ముద్దు రామకృష్ణయ్య సంస్కరణలు తమాషాగా అనిపించినా ఆయన నిబద్ధతకు అవి కొలమానాలుగా కనబడుతాయి. ఆయన పనిచేసే పాఠశాలలో గేట్‌కీపర్‌ సైతం యూనిఫాంలోనే ఉండే వాడు. గేట్‌ కీపర్‌ దగ్గర ఒక కుక్క ఉండేది. ఎవరైన పాఠశాలను సందర్శించేందుకు వస్తే మొదట తమ వివరాలతో ూడిన చీటీని గేట్‌ కీపర్‌కు ఇవ్వాలి. గేట్‌కీపర్‌ ఆ చీటీని కుక్క నోటికి అందిస్తాడు. కుక్కలోనికి వెళ్లి ఆ చీటిని రామ కృష్ణయ్యకి అందిస్తుంది. అప్పుడాయన ఆ చీటీలోని విషయాన్ని చూసి, అవసరమైతే ఆ చీటిపై అనుమతి సంతకం చేసి పంపేవాడు. అలా అనుమతి వస్తేనే ఎవరికైనా పాఠశాలలోనికి వెళ్లేందుకు అనుమతి లభిస్తుంది. ఇదీ రామకృష్ణయ్య క్రమశిక్షణ విధానం.

ఒక పర్యాయం డైరెక్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ ఇన్‌స్ట్రక్షన్‌ ఆకస్మికంగా పాఠశాలను సందర్శించేందుకు వచ్చారు. ఆయన విద్యా శాఖలో రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారి. గేట్‌కీపర్‌ రామకృష్ణయ్య పద్ధతిని ఆ అధికారికి విన్నవించాడు. చేసేదేమీ లేక ఆయన ఒక చీటీపై తన వివరాలను రాసి, కుక్కనోటికి అందించాడు. కుక్క ఆ చీటీనీ తీసుకొని లోనికి వెళ్లింది. కొంత సేపటి తరువాత ఆ చీటీతో తిరిగివచ్చింది. గేట్‌ కీపర్‌ అధికారిని లోనికి అనుమతించాడు. కానీ రామకృష్ణయ్య ఆ అధికారిని ఆహ్వానించేందుకు రాలేదు. ఆ అధికారి కోపంతో రగిలిపోతూ లోనికి వెళ్లాడు. ఆ సమయంలో రామకృష్ణయ్య పాఠశాల విద్యార్థుల మార్కుల జాబితాలను సిద్ధం చేస్తూ, ఉపాధ్యాయులు దిద్దిన పేపర్లను పరిశీలిస్తున్నాడు. అధికారిని చూడగానే లేచి నమస్కరించి, ఉచితా సనంలో కూర్చోబెట్టాడు. ఆ తరువాత కూడా తన విధి నిర్వహణ పూర్తి చేసిన తరువాత మాత్రమే అధికారితో మాట్లాడాడు. ఆయన అంకితభావానికీ, క్రమశిక్షణకూ ముగ్ధుడైన అధికారి రామకృష్ణయ్యను అభినందించి, అతిథి పుస్తకంలో సంతకం చేసి వెళ్లిపోయాడు. విధ్యుక్తధర్మాన్ని ఎవరికోసమూ మరచిపోరాదని ఆయన సిద్ధాంతం.

విధి నిర్వహణలోని ప్రతి అంశాన్నీ అక్షర రూపంలో భద్రపరచి, సంస్కరణలకు బీజం వేసిన ఈ మనీషి మహాత్మాగాంధీ వలె దినచర్యను నిరంతరం రాసి ఆరువేల పుటలకు పైగా అమూల్య మైన అంశాలను లోకానికి అందించి వెళ్లిపోయాడు. 1985 అక్టోబరు 21న కన్నుమూసిన ఈ తెలంగాణ జాతి రత్నం పాఠశాల విద్యానిర్వహణలో ఎన్నో అడుగుజాడలను ముద్రించి, చిరకీర్తిని గడించాడు.

Other Updates