– వెలపాటి రామరెడ్డి
tsmagazine

ఎవని కహింసయే యేకైక శస్త్రమై
స్వాతంత్య్ర సమరాన జయము గూర్చె !
ఎవనికి సత్యమే యేకైక వ్రతమునై
స్వేచ్ఛోద్యమానికి చేర్చె బలము !
ఎవనికి శాంతమే యేకైక మార్గమై
సర్వ మతాలెడ సహన మొసగె !
ఎవనికి త్యాగమే యేకైక యోగమై
సామాన్యునికి సర్వశక్తు లిడెను !

భారతీయుల కెల్లను ‘బాపు’ అతడు !
అఖిల లోకానికెల్ల ‘మహాత్ము’ డతడు !
దాస్య ముక్తులకును ‘మార్గదర్శి’ యతడు !
పండు గతనిదా? జాతికే పండుగిపుడు !!

బ్రహ్మచారిగా నున్న వివాహితుండు !
అన్ని మతముల మన్నించు హైందవుండు !
అగ్రనేతయై అధికార మంటనతడు !
ఇట్టి వ్యతిరేక తలొకర నెట్టులొదిగె !!

ఒక వైపు జవహ – రింకొక వైపు సర్దారు,
ఒకచోట మిత వాదు | లొకట బోసు,
ఒకవైపు ఆజాదు – ఒక వైపు మతవాదు;
లంబేడ్కరిట – మను అనుచరులట;
ఒకట మాంసాహారు – లొకట శాకాహారు;
లొకట మద్య ప్రియు – లొక టితరులు;
ఒకట కోటీశ్వరు – లొక్కటన్నార్థులు
ఒకట కోటీశ్వరు – లొక్క టన్నార్థులు;
పాన్పిట – నేలపై పడకలచట;

ఇట్టి భిన్న ధృవమ్ము లనేకముల ను
ఐక్య పరచిన వ్యక్తిత్వ మయ్యనీది
కాన, భిన్నత్వమందు ఏకత్వమనెడు
మూల సిద్ధాంతకర్తవు మోహనయ్య !

దేశమునకు స్వాతంత్య్రముతెచ్చినట్టి
వారిలో నొక్క పేరు చెప్పనుచునడుగ
అప్రయత్నమ్ముగా నాల్కనాడుచున్న
ఒక్క నీ పేరె బయటకు ఉబికి వచ్చు!
పండుగన నీది, యింటింట పండుగగును !!

Other Updates