తెలివితేటలు ఏ ఒక్కరి సొంతం కాదని, దీనికి ధనిక, పేద తేడా లేనేలేదని తెలంగాణ ముద్దు బిడ్డలు జాతీయ స్థాయిలో మరోసారి నిరూపించారు. ఇటీవల నిర్వహించిన సివిల్స్ పరీక్షలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన 8 మంది యువతీయువకులు ఉత్తమ ర్యాంకులు సాధించి తమ సత్తా చాటారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన సివిల్స్ పరీక్షల్లో రాష్ట్రంలోని ఎనిమిది మంది యువకులు ఎంపిక కావడం రాష్ట్రంలో ప్రతిభావంతులకు కొదువలేదనడానికి తార్కాణంగా నిలుస్తున్నది. రాష్ట్రానికి చెందిన సాకేత్‌రాజ, సాయికాంత్, లక్ష్మీకాంత్, రోషన్, క్రాంతి, సతీష్ రెడ్డి, శ్రీకాంత్, సుశీ, నాగేందర్ సివిల్స్‌లో ర్యాంకులు సాధించి రాష్ట్రప్రతిష్టను దేశ వ్యాప్తం చేశారు.
జాతీయస్థాయిలో సాకేత్ రాజా 14వ ర్యాంకు, సాయికాంత్ 18వ ర్యాంకు, లక్ష్మీకాంత్ 21వ ర్యాంకు, రోషన్ 44వ ర్యాంకు, క్రాంతి కుమార్‌కు 50వ ర్యాంకు, సతీష్ రెడ్డి 97వ ర్యాంకు, శ్రీకాంత్ 413వ ర్యాంకు, సుశీల 540వ ర్యాంకు, నాగేందర్ 1122వ ర్యాంకు సాధించారు. వీరిలో కొందరు అతి పేద కుటుంబం నుండి వచ్చి సివిల్స్ సాధించడం వారి కృషీ, పట్టుదలకు నిదర్శనం. జాతీయ స్థాయిలో యూపీపీఎస్సీ నిర్వహించిన సివిల్స్ పరీక్షల్లో మునుపెన్నడూ లేని విధంగా తెలంగాణ బిడ్డలు విజయాలు సాధించడం రాష్ట్ర ప్రజలకు గర్వకారణమయ్యింది.
మనం తులచుకుంటే భవిష్యత్తుకు బంగారుబాటలు వేయగలమనేది ఈ యువకుల విజయగాధను బట్టి తెలిసిపోతుంది. ఇందులో ముఖ్యంగా గిరిజనుడైన నాగేందర్ సాధించిన విజయం పేదవారైనా కూడా పట్టుదల ఉంటే గమ్యాన్ని చేరుకోగలమానే సత్యాన్ని స్పష్టం చేస్తున్నాయి. మన రాష్ట్రానికి చెందిన బిడ్డలు ఐఎఎస్, ఐపిఎస్ అధికారులై రాష్ట్ర ప్రజలకు సేవచేయడానికి వస్తే ఇక్కడి భౌగోళిక సామాజిక పరిస్థితున్నీ కూడా అవగాహన ఉండి బంగారు తెలంగాణకు బాటలు వేసే దిశగా పయనిస్తారని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక ర్యాంకులు సాధించిన వారిలో ఆలిండియా 97వ ర్యాంకు సాధించిన పింగళి సతీష్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో కూడా పాల్గొనడం విశేషం. క్రాంతి కుమార్ మొదటి ప్రయత్నంలోనే 50వ ర్యాంకు సాధించి అబ్బురపరిచాడు. ఈ సందర్భంగా క్రాంతి తన మనోభావాలను వ్యక్తం చేస్తూ తెలంగాణ ఉద్యమంలో తాను పాల్గొనలేకపోయానని, కాని పునర్నిర్మాణంలో తనవంతు పాత్ర పోషిస్తానన్నాడు.
నల్లగొండ జిల్లా జగ్గు తండాకు చెందిన బుక్య నాగేందర్ తన తండ్రి దూరదృష్టి వల్లనే తాను సివిల్స్‌లో ర్యాంకు సాధించగలిగానన్నాడు. తన తండ్రికి చదువురాకున్నా, తనను కాన్వెంట్ స్కూల్‌లో చదివించాడన్నాడు. తాను ఈ రోజు అత్యున్నత ఉద్యోగం సంపాదించబోతున్నానంటే తన తండ్రి పెట్టిన బిక్షగా ఆయన గర్వంగా చెప్పారు.
ఇక 21వ ర్యాంకు సాధించిన లక్ష్మీకాంత్ రెడ్డి… తాను ఒక కార్పొరేట్ కంపెనీలో సీనియర్ కన్సల్టెంట్గా పనిచేస్తుండగా ఐఏఎస్ అధికారులను తరచూ కలుసుకోవడం జరిగేదన్నారు. ఐఏఎస్ అధికారులకు ప్రభుత్వ పాలనలో ఎంతటి కీలకమైన పాత్ర ఉంటుందో అప్పుడు తాను గ్రహించానన్నారు. అప్పుడే సివిల్స్ సాధించాలని పట్టుదలతో చదివి విజయం సాధించగలిగానన్నారు. ఐఏఎస్ అధికారిగా శిక్షణ పూర్తి చేసి ఎక్కడ పోస్టింగ్ వచ్చినా తెలంగాణ రాష్ట్ర అభ్యున్నతికి తన వంతు చేయూతనందిస్తానన్నారు.
సివిల్స్‌లో 44వ ర్యాంకు సాధించిన మహ్మద్ రోషన్ బాల్యమంతా హైదరాబాద్‌లోనే గడిచింది. తన తల్లిదండ్రులు డాక్టర్లు కావడం వల్ల తనను ఐఏఎస్‌కు ప్రిపేర్ కావడానికి ప్రోత్సహించారని తెలిపారు. సివిల్స్‌లో 40 శాతం మంది గ్రామీణ ప్రాంత యువకులు విజయాలు సాధిస్తున్నారని దీన్ని బట్టి గ్రామీణ భారతం ఎంత చైతన్యవంతంగా ఉందో తెలిసిపోతుందన్నారు. తెలంగాణ ఉద్యమానికి యువకులు ఎలా ఉత్సాహంతో, పట్టుదలతో నిబద్ధతతో ముందుకు ఉరికారో అదే విధంగా ఉద్యోగ తెలంగాణ అనే నినాదాన్ని తీసుకొని తెలంగాణ యువకులు అన్ని రంగాలలో ప్రతిభ కనబరిస్తే తెలంగాణ రాష్ట్రం విద్యా, ఉద్యోగాల గనిగా మారిపోతుందన్నారు.
మొత్తంగా తెలంగాణలోని యువకులు సివిల్స్‌లో ర్యాంకు సాధించి భావితరాల్లో ఇంకా ఎక్కువ మంది ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి స్ఫూర్తినివ్వడం గర్వకారణం.