‘‘కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం అంటే నాకు ఎంతో ఇష్టం. కొత్త రాష్ట్రం తన కాళ్ళపై తాను నిలబడేలా కేంద్ర ప్రభుత్వ సహకారం ఉంటుంది. అభివృద్ధిలో తెలంగాణ ముందుకెళ్తోంది. తెలంగాణలో ఒక జాతీయ ప్రాజెక్టు ఉండాలన్నదే నా తపన. ప్రాణహిత`చేవెళ్ళ ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి, అవసరమైన పూర్తి సహకారం అందిస్తాం’’.

kcr-meeting‘ప్రాణహిత`చేవెళ్ళ’ ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించేందుకు కేంద్ర జలవనరుల శాఖామంత్రి ఉమాభారతి సుముఖత వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు డిసెంబరు 8న ఢల్లీి పర్యటనలో కేంద్రమంత్రితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై కేంద్రమంత్రి ఉమాభారతితో ముఖ్యమంత్రి చర్చించారు. ప్రాణహిత`చేవెళ్ళ ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించే విషయమై సత్వరం నిర్ణయం గైకొనాలని ముఖ్యమంత్రి కోరగా, అందుకు కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారు.

‘‘తెలంగాణకు కూడా జాతీయ ప్రాజెక్టు ఉండాలని నేను చాలా ఆత్రుతతో ఉన్నాను. మా అధికారులతో వీలైనంత త్వరగా చర్చిస్తా. మేం చాలా సానుకూలంగా ఉన్నాం. కేంద్రం నుంచి పూర్తి సహకారం ఉంటుంది. ఇందులో ఎలాంటి సందేహాలు వద్దు’’ అని ఉమాభారతి ముఖ్యమంత్రితో అన్నారు.

తెలంగాణలోని దేవాదుల ప్రాజెక్టు పూర్తి చేసేందుకు కూడా సహకరించవలసిందిగా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు కోరారు. ఈ ప్రాజెక్టుకు మొదటి విడత కింద 64 కోట్ల రూపాయలు విడుదల చేసేందుకు కేంద్రమంత్రి అంగీకరించారు.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల మూడు లక్షల మంది గిరిజనులు ముంపుకు గురయ్యే ప్రమాదం ఉన్నదని, ప్రాజెక్టు నిర్మిస్తున్న ప్రాంతం దేశంలోనే రెండో భూకంప తీవ్రతగలదిగా నివేదికలు వచ్చాయని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గుర్తు చేశారు. పోలవరం ప్రాజెక్టు డిజైన్‌ మార్చాలని ఆయన కేంద్రమంత్రిని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో చెరువుల అభివృద్ధి, వాటిని అనుసంధానం చేసే ‘మిషన్‌ కాకతీయ’ కార్యక్రమం ప్రారంభోత్సవానికి రావలసిందిగా కేంద్రమంత్రి ఉమాభారతిని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఆహ్వానించారు. ప్రతి ఇంటికీ, నల్లా ద్వారా మంచినీరు సరఫరాకు ఉద్దేశించిన ‘వాటర్‌ గ్రిడ్‌’ పథకం గురించి మంత్రి ఆసక్తిగా తెలుసుకొని, ఈ పథకానికి కేంద్రం నుంచి పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

తెలంగాణ సాధన ఉద్యమం సందర్భంగా తాను రాష్ట్రానికి వచ్చిన విషయాన్ని ఉమాభారతి గుర్తుచేసుకున్నారు. తొలుత తన కార్యాలయానికి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రశేఖరరావును ఉమాభారతి సాదరంగా ఆహ్వానించి, కార్యాలయంలోకి తోడ్కొని వెళ్ళారు.

ముఖ్యమంత్రి వెంట పలువురు పార్లమెంటు సభ్యులు, అధికారులు కూడా కేంద్రమంత్రిని కలుసుకున్నారు.

Other Updates