డా|| జె. చెన్నయ్య
డా||.సి. నారాయణ రెడ్డి ప్రస్థానం
విద్యార్థి దశలో అలవోకగా సీసపద్యాలనే అల్లిననాటి నుంచి నిన్న మొన్నటి వరకు 70 సంవత్సరాలపాటు మహా ప్రవాహంలా నిరంతరం సాగిన కవితాయాత్రను ఆపి శాశ్వతంగా సెలవు తీసుకున్నారు మహాకవి డా. సి. నారాయణరెడ్డి. సినారె అన్న మూడు అక్షరాలు తెలుగు సాహితీ క్షేత్రంలో భిన్న ప్రక్రియల్లో పేరెన్నికగన్న రచనల ఆవిర్భావానికి అక్షయపాత్రలై నిలిచాయి. కోట్లాదిమంది అభిమానులను ఆయనకు సంపాదించిపెట్టాయి. జానపదవాజ్ఞ్మయ ప్రభావంతో సాహితీ సృజనకు శ్రీకారం చుట్టింది మొదలు అత్యున్నతమైన జ్ఞానపీఠ గౌరవాన్ని పొందడమేగాక మరెన్నో కావ్యాలను సృష్టించిన దశ వరకు సాగిన సినారె జీవనయాత్రను, కవితా యాత్రను గురించి సంగ్రహంగా తెలుసుకుందాం.
అక్షరాస్యతేకాదు విద్యాగంధంసైతం అంతంతమాత్రంగా వున్న తెలంగాణ జనపథంలో పుట్టి జానపదుల మాట, ఆట, పాటల ఒడిలో పెరిగి ఇంతింతై విరాణ్మూర్తిగా ఎదిగి జ్ఞానపీఠాన్ని అధిరోహించినవారు డా. సి. నారాయణరెడ్డి. ఆయన జీవనగాధ స్ఫూర్తిదాయకమైంది. ఆయన నడిచివచ్చిన దారి కవితా కర్పూర కళికలమయమైంది.
1961లో సినీ గీత రచన ప్రారంభమైంది. హైదరాబాద్ సారథీ స్టూడియోలో ఒక సినిమా చిత్రీకరణలోవున్న నందమూరి తారక రామారావు సినారెతో ప్రస్తావన చేశారు. అప్పటికే తాను రాసిన పాటల్ని ఎన్టీఆర్‌కు వినిపించారు. తొలి చిత్రంలో అన్ని పాటలు తనవే ఉండాలన్న కోరికను వ్యక్త పరచారు.
1931 జూలై 29న కరీంనగర్ జిల్లా సిరిసిల్ల తాలూకా హన్మాజీ పేటలో నారాయణరెడ్డి జన్మించారు. తల్లిదండ్రులు భద్రమ్మ, సింగిరెడ్డి మల్లారెడ్డి. తనకంటే ముందు ఒక కొడుకు చనిపోతే ఊళ్ళో ఒక ఇంట్లో సత్యనారాయణస్వామి వ్రతం జరుగుతున్నప్పుడు బుచ్చమ్మ మొక్కుకున్నది. నాకు కొడుకు పుట్టి క్షేమంగా ఉంటే నీ పేరు పెట్టుకుంటానని. అలా జన్మించిన కొడుకుకు సత్యనారాయణరెడ్డి అని పెట్టుకుంది. పేరులోని సత్యం కవిత్వంలోకి, జీవితంలో ప్రవహించింది. నారాయణరెడ్డి లోకప్రసిద్ధుడైనాడు.
ఖాన్గీ బడిలో అక్షరాలు దిద్దుకొని, సిరిసిల్లలో మాధ్యమికవిద్య, కరీంనగర్‌లో ఉన్నత పాఠశాల విద్య. అనంతరం హైదరాబాద్ చాదర్‌ఘాట్ కళాశాలలో ఇంటర్, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బి.ఎ., ఎం.ఎ. పూర్తి చేశారు నారాయణరెడ్డి. పాఠశాలలో చదువు తున్నప్పుడే నిజాం వ్యతిరేక పోరాటంలో పాల్గొన్నారు. సత్యాగ్రహం చేశారు. ‘సైనికులం మేం సైనికులం’ అని పాటలు పాడుతూ ఊరేగింపులో పాల్గొన్నారు. క్విట్‌స్కూల్ ‘ఉద్యమం’లో పాఠశాల కొంతకాలం మానేశారు.
సాహిత్య వాతావరణం లేని కుటుంబ నేపథ్యంలో జన్మించినా, ఉర్దూ మాధ్యమంలో డిగ్రీ వరకు విద్యాభ్యాసం చేసినా, తెలుగుమూర్తిగా వికసించిన సినారె ఒక అసాధారణ ప్రతిభాశాలి. చిన్ననాడు పల్లె జనుల నిసర్గసుందరమైన సంభాషణారీతి, జానపదకళారూపాలు నారాయణరెడ్డి భాషా సాంస్కృతిక వ్యక్తిత్త్వాన్ని మలచాయి. హరికథలను మైమరచి వినేవారు. ఆ సమాహారకళలోని పాటలు, పద్యాలు, చతుర కథారీతి, కథనబలం ఆకట్టుకోవ డమేకాదు పాటలు, నాటకాలు అశువుగా అల్లే అభిరుచిని నూరిపోశాయి. 6, 7 తరగతుల్లో వున్నప్పుడే భక్త ప్రహ్లాద, సీతాపహరణం, రఘుదేవ రాజీయం వంటి నాటికలు రాసి మిత్రులతో కలిసి ప్రదర్శించారు. ‘ఒకనాడు ఒక నక్క ఒక అడవిలోపల’ అంటూ సీసపద్యం రాస్తే ఉపాధ్యాయుడు దూపాటి వెంకటరమణాచార్యులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మరికొన్ని మెళకువలు చెప్పారు. ఇంటర్మీడియట్‌లో ఉండగా జువ్వాడి గౌతమరావు ‘జనశక్తి’ పత్రికలో తొలి కవిత ప్రచురితమైంది. బి.ఎ.లో ఉండగా పాములపర్తి సదాశివరావు సంపాదకత్వంలో వెలువడే కాకతీయ పత్రికలో రచనలు ప్రచురితమయ్యాయి. ఇది 1950కి ముందే జరిగింది.
21 ఏళ్ళ వయసులో నారాయణరెడ్డికి రేడియోతో అనుబంధం ఏర్పడింది. 1952లో బి.ఎ. విద్యార్థిగా ఉస్మానియా విశ్వవిద్యాలయములో విద్యాభ్యాసం చేస్తున్నప్పుడు, హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌లోవున్న దక్కన్ రేడియోలో ప్రసారమైన ‘సాగుమా ఓ నీలమే గగనవీణా మృదులరావమా’ అన్న గీతం నారాయణరెడ్డి పరిణత కవిగా ఎదిగే దశలో తొలిమెట్టుగా నిలిచింది. ‘పూలపాటలు’, ‘చిరుగజ్జెలు’ ఉపద్రష్ట కృష్ణమూర్తి సంగీత దర్శకత్వం రూపొంది ప్రసారమయ్యాయి. ‘నవ్వని పువ్వు’ గేయ నాటిక ప్రసారమైంది. బుచ్చిబాబుగారు ప్రత్యేకంగా రాయించిన ‘అజంతా సుందరి’, ఆ తర్వాత ‘రామప్ప’ సంగీత రూపకం ఆకాశవాణి జాతీయ పోటీల్లో ప్రథమ బహుమతి తెచ్చిపెట్టింది. 12 భాషల్లోకి అనువాదమైంది.
ఇంటర్ రెండో సంవత్సరంలో ఉండగా రెడ్డి హాస్టల్‌లో జరిగిన అఖిలాంధ్ర కవి సమ్మేళనంలో విద్యార్థి కవిగా వానమామలై, దాశరథి, తల్లావఝ్జుల కృష్ణశాస్త్రి, జాషువా తదితర అగ్రశ్రేణి కవుల సరసన పాల్గొన్నారు సినారె. దాశరథితో పరిచయం అదే తొలిసారి. అది మొదలు దాశరథి ప్రోత్సాహం తనను మునుముందుకు నడిపిం చిందని చెప్పుకున్నారు సినారె. ఆ సోదర ప్రేమకు గుర్తుగా ‘జలపాతం’ కవితా సంపుటిని దాశరథికి అంకితం చేశారు.
1952లో బి.ఎ. ఫైనల్ ఇయర్ విద్యార్థిగా వున్నప్పుడు తెలంగాణ రచయితల సంఘాన్ని స్థాపించి కార్యదర్శిగా వున్నారు. సంఘానికి ఆ తర్వాత అధ్యక్షుడయ్యారు. తెలంగాణ జిల్లాల్లో అంతటా పర్యటించి కవితా పఠనాలు, కవితాత్మక ప్రసంగాలు చేసి ఆనాడే ఈ ప్రాంతంలో కవితా చైతన్యాన్ని పెంపొందించేందుకు కృషి చేశారు సినారె.
ఉస్మానియా విశ్వవిద్యాలయం నారాయణరెడ్డి కవితా మూర్తిని అంచెలంచెలుగా సమున్నతస్థాయికి తీసుకెళ్ళింది. 1954లో బి.ఎ., ఎం.ఎ. పూర్తిచేసి సికింద్రాబాద్ ఆర్ట్స్ & సైన్స్ కళాశాలలో తెలుగు అధ్యాపకునిగా ప్రవేశం, తర్వాత నిజాం కళాశాలలో, ఆ తర్వాత ఆర్ట్స్ కళాశాలలో ఆచార్యత్వం, తనకు సాహిత్య విద్య నేర్పిన గురువులు కె. గోపాలకృష్ణారావు, దివాకర్ల వెంకటావధానితో కలిసి ఆచార్యులుగా పనిచేసిన అరుదైన ఖ్యాతి సినారెకు ఆనాడే దక్కింది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో డిగ్రీ తరగతుల కు కూడా తెలుగు పాఠాలు చెప్పారు. ఆ రోజుల్లో డిగ్రీలో ఇతర అధ్యయనాంశాలు చదువుతున్న విద్యార్థులు సైతం సినారె పాఠాలు వినేందుకు గుంపులుగుంపులుగా వచ్చే వారు. ప్రాచీన, ఆధునిక సాహిత్యంలో ఏ పాఠం చెప్పినా అది విద్యార్థులపాలిట కళా ప్రదర్శనగా ఉండేది. పాఠం చెప్పడానికి అన్నివిధాలా సిద్ధమైపోవడం, సమయానికి తరగతిగదిలో ప్రవేశించడం అనర్గళంగా గంటన్నరసేపు పాఠం చెప్పడం, తనకిచ్చిన వ్యవధి పూర్తవుతుండగానే గదినుంచి నిష్క్రమించడం అదంతా ఒక మరువలేని అను భవం. ఆ రోజుల్లో పాఠాలు విన్న మధురానుభవాన్ని ఈనాటి కీ గుర్తు చేసుకునే విద్యార్థులెందరో! ఖండవల్లి లక్ష్మీరంజనం పర్యవేక్షణలో ‘ఆధునికారాధ్య కవిత్వము-కవి ప్రదామములు -ప్రయోగములు’ అన్న అంశంపై పీహెచ్‌డీ చేశారు. పరిశోధనాంశాన్ని సూచించినవారు దేవులపల్లి కృష్ణశాస్త్రి.
1961లో సినీ గీత రచన ప్రారంభమైంది. హైదరాబాద్ సారథీ స్టూడియోలో ఒక సినిమా చిత్రీకరణలోవున్న నందమూరి తారక రామారావు సినారెతో ప్రస్తావన చేశారు. అప్పటికే తాను రాసిన పాటల్ని ఎన్టీఆర్‌కు వినిపించారు. తొలి చిత్రంలో అన్ని పాటలు తనవే ఉండాలన్న కోరికను వ్యక్తపరచారు. ‘గులేబకావళి కథ’ సినిమాకు అప్పటికే ఒకరిచేత పాట రాయించి వున్నారు ఎన్టీఆర్. అయినా సినారె అభిమతాన్ని అనుసరించి ఆ కవికి నచ్చజెప్పి అన్ని పాటలు రాయించారు. పాటలు రాసేందుకు మద్రాసు రైల్లో వెళ్లిన సినారెను ఎన్టీఆర్ స్వయంగా స్టేషన్‌లో స్వాగ తించారు. ఆనాడే పెద్ద వాహనశ్రేణి అంటే కాన్వా య్‌తో సినారెను ఘనంగా గౌరవించారు. తొలుత రాసిన పాట ‘కలల అలలపై తేలెను’. కానీ తొలుత రికార్డయ్యింది ‘నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని’. ఎన్టీఆర్, జమునలపై చిత్రీకరించిన నాటినుంచి ఎన్డీఆర్‌తో గీతానుబంధం, గాఢమైన స్నేహానుబంధం ఎన్టీఆర్ చివరి దశవరకు అవిచ్ఛిన్నంగా కొనసాగింది.
1961 నుంచి 1990 వరకు డా. సి. నారాయణరెడ్డి సినీ గీత రచన ఒక స్వర్ణ యుగం. ప్రాచీనాధునిక కవిత్వాధ్యయనానుభవం వల్ల సినారె ప్రతి పాటలో తన కవిత్వముద్రను నిలిపాడు. పేర్కొనదగ్గ పాటలు ఎన్నో. సుమారు 3వేల పాటలు రాశారు. నిజానికి సినీ గీత రచన సినారె బహుముఖ ప్రజ్ఞల్లో ఒక పార్శ్యం మాత్రమే. తాను ఎదుగుతున్న నాటికే తెలుగు కవితారంగంలో ఎందరో గొప్ప కవులున్నారు. అప్పుడే అగ్ర కవులతో పోటీపడుతూ పద్యకృతులు, గేయకృతులు వెలువరిస్తున్న మేదో మథనం జరిగింది. ఏదో ప్రత్యేకత సాధించాలనుకున్నారు. అంతే, ప్రౌఢతరమైన పద్యకృతికి తుల్యంగా కథాత్మక గేయకావ్యం ‘నాగార్జునసాగరం’ రాశారు. రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ వంటి విద్యన్మణుల ప్రశంసలు లభించాయి. తర్వాత కర్పూర వసంతరాయలు రాశారు. దేశ, విదేశాల్లో కావ్యగానం చేశారు. నాటి ముఖ్య మంత్రి బూర్గుల రామకృష్ణారావు ప్రత్యేకంగా షామంజిల్‌లో ‘నాగార్జునసాగరం’ కావ్యగానం ఏర్పాటుచేసి సత్కరించారు. మద్రాసులో అక్కినేని అధ్యక్షతన జరిగిన కర్పూర వసంతరాయలు కావ్యగానం అద్భుత స్పందన కలిగించింది.
గేయ కావ్యాలతోనే మహాకవి అనిపించుకున్న సినారె అంతటితో ఆగలేదు. భావ కవిత్వం, అభ్యుదయ కవిత్వం ప్రాబల్యం సాగుతున్న కాలంతో పోటీపడా లని నిర్ణయించుకు న్నారు. సృజన పౌరుషంతో వచన కవిత రచనను ఉద్దృతం చేశారు. ‘మంటలూ మానవుడు’, ‘తేజస్సు నా తపస్సు’, ‘అక్షరాల గవాక్షాలు’, ‘మధ్య తరగతి మందహాసం’, ‘విశ్వంభర’ ఇలా కవితాయాత్ర కొనసాగింది. భారత సాహిత్యంలో అత్యున్నతమైన ‘జ్ఞానపీఠ’ పురస్కారం ‘విశ్వంభర’కు లభించింది. వచన కవిత్వంలోనూ మహా కావ్య లక్షణాలు పొదువుకున్న ‘విశ్వంభర’ దీర్ఘకవిత. ఆదిమకాలం నుంచి ఆధునిక కాలం దాకా సాగిన మానవ విజయ మహేతిహాసమే విశ్వంభర.
పద్యం, గేయం, వచన కావ్యాలు, నాటికలు, గజళ్ళు, ముక్తకాలు, అనువాదాలు, విమర్శ, పరిశోధన, బుర్రకథ, యాత్రా సాహిత్యం. ఇలా అనేక ప్రక్రియల్లో 20వ శతాబ్దం నుంచి 21వ శతాబ్దం దాకా విస్తరించి కాలంతోపాటే సాగుతూ వర్థమాన తరపు కవులతోనూ పోటీపడుతూ, సాహితీ సృతన చేశారు సినారె. 86 ఏళ్ళ వయసు, 86 రచనల సొగసు ఆయనది.
కవితా రచన ఒకవైపు, విశ్వవిద్యాలయ ఆచారత్వం ఒకవైపు, సినీ గీత రచన ఇంకొకవైపు, సాహితీ సాంస్కృతిక సదస్సుల్లో అద్భుత ప్రసంగ పరంపర మరోవైపు అన్నట్లుగా సాగుతున్న దశలో 50వ పుట్టినరోజు అప్పటి ముఖ్యమంత్రి టి. అంజయ్య సినారెను అధికార భాషా సంఘానికి అధ్యక్షునిగా నియమిస్తున్నట్లు ప్రకటించారు. ఆచార్యత్వాన్ని అయిష్టంగానే వదలవలసి వచ్చింది. పరిపాలనా పదవుల్లో సినారె దక్షతముద్ర ప్రారంభ మైంది. ఆ తర్వాత ఎన్టీఆర్ ముఖ్య మంత్రి అయ్యారు. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విశ్వవిద్యాలయ ఉపా ధ్యక్షునిగా సినారెను గౌరవిం చారు. ఆ పదవీకాలం పూర్తి కాగానే తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులుగా నియ మించారు. తర్వాత సాంస్కృతికమండలి అధ్యక్షులయ్యారు. భాషా సాంస్కృతిక సలహాదారులయ్యారు. కవులు, కళాకారుల తరఫున రాష్ట్రపతిచేత రాజ్యసభ సభ్యులుగా నియమితులయ్యారు. కవితా రచన కొనసాగిస్తూనే విద్యా సాంస్కృతిక సంస్థల పరిపాలనా పదవులనూ వెలిగించారు సినారె.
ఏడు దశాబ్దాల కవితా సృజనానుభవాన్ని పండించు కున్న మహాకవి డా. సి. నారాయణరెడ్డి తెలంగాణ బిడ్డ కావడం గర్వకారణం. ఏపీ సాహిత్య అకాడమీ, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలు అందుకున్నారు. మీరట్ విశ్వవిద్యాలయం, నాగార్జున, కాకతీయ, సార్వత్రిక విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్‌లు అందించాయి. ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణతో సత్కరించింది. సోవియట్ ల్యాండ్ నెహ్రూ అవార్డు, రాజా లక్ష్మీ అవార్డు, తెలుగు విశ్వవిద్యాలయ విశిష్ట పురస్కారం, కేంద్ర సాహిత్య అకాడమీ ఫెలో పురస్కారం.. వంటి ఎన్నో ప్రతిష్ఠాత్మక పురస్కారాలు, లెక్కలేనన్ని సినారెను వరించాయి.
కడవరకు కవిత్వం రాస్తున్నారు. ఔత్సాహిక ప్రముఖ కవుల రచనలకు ఆశీస్సులందిస్తూనే వున్నారు. తమకు ఎవరైనా లేఖరాస్తే దానికి ప్రత్యుత్తరం రాయకపోవడం ఏనాడూలేదు. విద్యారంగంలో, పాలనారంగంలో, జన వ్యవహారంలో తెలుగు పరిఢవిల్లాలని వేదికలపైన గట్టిగా చెబుతూనే వున్నారు. మునుపటి ఆంధ్ర సారస్వత పరిషత్తు, నేటి తెలంగాణ సారస్వత పరిషత్తుకు అధ్యక్షులుగా వుంటూ తెలుగు భాషా సంస్కృతుల వికాసకృషిని అవిరళంగా, అనవరతంగా కొనసాగిస్తూనే వచ్చారు.
ఒక కవితలో ఆయన అన్న పంక్తులు.
‘అది తెలుగు కీర్తి… కదిలే కిరణమూర్తి..
సాగరాల్ దాటిపోయింది రా…
నయాగరాల్ మీటి వచ్చింది రా…’
ఈ మాటలు తెలుగు కవిత్వ కీర్తికి, తెలుగు వ్యక్తి కీర్తికి…
డా. సి.నా.రె. సాహితీమూర్తికి, ఆయన వ్యక్తిత్వ కీర్తికీ వర్తిస్తాయి. ఇంతటి మహోన్నత కవితామూర్తి… తెలం గాణలో జన్మించడం గర్వకారణం.
నగరంలో సినారె స్మారకభవనం
ఘనంగా నివాళులర్పించిన సి.ఎం కె.సి.ఆర్
తెలంగాణ సాహితీ మకుటంలో సి. నారాయణ రెడ్డి కలికితురాయి అని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు శ్లాఘించారు. జూన్ 12న మరణించిన సినారే పార్థివదేహానికి ముఖ్యమంత్రి పుష్పాంజలిఘటించి , ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, సినారె స్మత్యర్థ్యం హైదరాబాద్ నడిబొడ్డున స్మారకభవనాన్ని నిర్మిస్తామని, ఆ భవనంలో మ్యూజియం, సమావేశమందిరం కూడా ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. సినారె ను ప్రభుత్వం సముచితంగా గౌరవించుకుంటుందని, ఓ ప్రముఖ సంస్థకు ఆయన పేరు పెడతామని, హైదరాబాద్ ట్యాంక్ బండ్ తోపాటు కరీంనగర్ పట్టణంలోను, సిరిసిల్ల జిల్లా కేంద్రంలో, ఆయన స్వగ్రామం హన్మాజీపేటలో ప్రభుత్వపరంగా సినారె కాంస్య విగ్రహాలు ఏర్పాటుచేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. సినారె అమితంగా ప్రేమించిన సారస్వత పరిషత్ కు ప్రభుత్వం ఏటా 10 లక్షల రూపాయలు గ్రాంటు ఇస్తోందని, మున్ముందుకూడా ఆదుకుంటామని చెప్పారు.
హైదరాబాద్ మహా ప్రస్థానంలో జరిగిన సినారె అంత్యక్రియలను ప్రభుత్వం పూర్తి అధికారిక లాంఛనాలతో నిర్వహించడమేగాక, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు స్వయంగా సినారె అంతిమయాత్రలో పాల్గొని, అన్నీతానై దగ్గరుండి అంతిమసంస్కారాలు నిర్వహింపజేశారు. కవిదిగ్గజానికి ఇంత ఘనంగా కడసారివీడ్కోలు పలకడం ప్రభుత్వం, ముఖ్యంగా ముఖ్యమంత్రి కె.సి.ఆర్ కు కవులు, కళాకారులపట్ల గల గౌరవానికి నిదర్శనంగా పలువురు మేధావులు పేర్కొన్నారు.
మేధా నిలయమా
డా|| సి. నారాయణరెడ్డి
గాడ్పు విడిచిన నిట్టూర్పుతో
నా ఊర్పు ఉస్సురంది
ప్రాణదాతకు కలిగిన ఆపత్కర పరిస్థితికి
ప్రాణి సానుభూతిని ప్రకటించటం
సహజాత లక్షణం కదా.
తీగలు వాడిపోతే
వాటి బిడ్డలుగా ఎదుగుతున్న పూలు
వెలవెల పోకుండా ఎట్లా ఉంటాయి?
వాటిని తన ఒడిలో పెట్టుకుని లాలించే
అంబరానికి కలిగే ఆంతరంగిక సంతుష్టిని
నిర్వచించే సూత్రాలేవి?
పృథ్వి ప్రకంపించినప్పుడు
నిఖిల జీవన నికరం
కకా వికలై పోతుంది.
ఆ క్షణంలో
ఆ ప్రాణి సముదాయానికి
సముచిత సహకారం అందించే
సముదార హృదయులెవరు?
రాత్రి
తన నిర్దిష్ట పరిధిని మించి
ఈడ్చుకుంటూ పోతుంటే
ఆ వైపున నిల్చొని
నిక్కి నిక్కి చూసే ఉషస్సు విసుగును
అంచనా వేసేదెట్లా?
ప్రకృతి సంజాత పరిణామ వైచిత్రికి
అద్దంపట్టి చూపేది
మానవ మేధ తప్ప మరేది?
అందుకే అంటాను.
ఓ మేధా నిలయమా! నీకు
ప్రణామమని సలామని సాల్యూటని.