job-mela”నలభై సంవత్సరాలపాటు ప్రభుత్వ సర్వీసులో పని చేశాను. వివిధ శాఖల్లో విభిన్నవర్గాల వారి సంక్షేమం లక్ష్యంగా నా సర్వీసు కొనసాగింది… అయితే సర్వీసులో ఉండగా ఒక్కరంటే ఒక్క బ్రాహ్మణ అభ్యర్థికి ఉద్యోగం ఇవ్వలేకపోయాను. అన్ని అర్హతలున్న ఆ వర్గం అభ్యర్థులకు ఉద్యోగమిచ్చి ఉపాధి కల్పించాలని అడగలేని పరిస్థితి. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉదాత్త విధానంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. రిటైరయ్యాక ఇన్నాళ్ళకు అదృష్టం పట్టింది. నాలుగొందల యాభై గృహాల్లో దీపం వెలిగించే అవకాశం దక్కింది. ఇది అపూర్వం… చరిత్రాత్మకం..!” అన్నారు రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు అధ్యక్షుడు, ప్రభుత్వ సలహాదారు డాక్టర్‌ కె.వి. రమణాచారి.

పరిషత్తు ఆధ్వర్యంలో విద్యావంతులైన బ్రాహ్మణ యువజనులకు ఉద్యోగకల్పన లక్ష్యంగా మార్చి 26న నిర్వహించిన ‘జాబ్‌మేళా’ ముగింపు సమావేశంలో ఆయన ఉద్వేగంగా అన్న మాటలివి. హైదరాబాద్‌లోని ‘నిమ్స్‌మే’ ప్రాంగణంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలలనుంచి 2192 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వివిధ సంస్థల ప్రతినిధులు జరిపిన ముఖాముఖిలో 450మంది అభ్యర్థులు ఉద్యోగం పొంది నియామక పత్రాలు అందుకున్నారు. ఈ సందర్భంగా ఎంపికైన వారికి నియామకపత్రాలు అందజేస్తూ డాక్టర్‌ రమణాచారి అన్నమాటలు సభలో పాల్గొన్నవారిని ఆలోచింపజేశాయి. తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రవర్తనా నియమావళి గడువు తీరిన కొద్దిగంటల్లోనే ‘జాబ్‌మేళా’ ప్రకటనకు విశేష స్పందన వచ్చిందని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి వినూత్న యోచనకు ప్రతిరూపంగా బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు రూపుదిద్దుకుందని, అన్నివర్గాల సంక్షేమం, స్వావలంబనతోనే సమాజం సమగ్ర ప్రగతి సాధిస్తుందనే విశ్వాసంతో, దశాబ్దాలుగా ఉపేక్షితులుగా మగ్గినవారికి అన్నివిధాలా తోడ్పాటు, ఆసరా అందించే అవకాశం ఏర్పడిందని డాక్టర్‌ రమణాచారి అభిప్రాయపడ్డారు. ఈ జాబ్‌మేళా తొలి ప్రయత్నమని, త్వరలో అన్ని జిల్లాల్లో ఈ పరంపర నిర్వహించి అర్హులందరికీ ఉపాధి కల్పించేందుకు యత్నిస్తామని ఆయన వెల్లడించారు. ఇది సమష్టికృషి ఫలితమని వివరిస్తూ ఈ స్ఫూర్తితో మరింత అంకితభావంతో ముందుకు సాగుతామని డాక్టర్‌ రమణాచారి పేర్కొన్నారు.

అంతకుముందు ఉదయం జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర హోంశాఖమంత్రి నాయిని నర్సింహారెడ్డి జ్యోతి వెలిగించి ‘జాబ్‌మేళా’ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బ్రాహ్మణులతోసహా సబ్బండవర్గాల సర్వతోముఖాభివృద్ధి లక్ష్యంగా తమ ప్రభుత్వం కర్తవ్యదీక్షతో పని చేస్తుందని అన్నారు. ఉద్యోగాల కల్పనతో శ్రీకారం చుట్టిన పరిషత్తు కార్యక్రమాలు రాష్ట్రంలోని బ్రాహ్మణులందరి సేవతో మరింత విస్తరించాలని హోంమంత్రి ఆకాంక్షించారు. జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌, రాజ్యసభ సభ్యులు కెప్టెన్‌ లక్ష్మీకాంతరావు, ఎమ్మెల్సీ పురాణం సతీష్‌, సెట్విన్‌ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వైద్యనాధరావు, పరిషత్తు ఉపాధ్యక్షులు వి. జ్వాలా నరసింహారావు ప్రసంగిం చారు. నిమ్స్‌మే డైరెక్టర్‌ జనరల్‌ చంద్రశేఖర్‌రెడ్డి జాబ్‌మేళా ఆద్యంతం పర్యవేక్షించి, జయప్రదం అయ్యేందుకు సహకరించారు. కాగా ఈ జాబ్‌ మేళాలో ఉద్యోగాలు పొందిన యువజనులు, తాము పొందుతున్న అనుభూతి వర్ణించలేమని చెప్పారు. కేవలం హాజరై, అపాయింట్‌మెంట్‌ లెటర్‌ పొందడం ఏనాటికీ మరువలేమని, పరిషత్తు కార్యా చరణ ఇదే క్రమంలో కొనసాగుతూ పదుగురికీ మేలుచేసి తీరుతుందని వారు విశ్వాసం వ్యక్తం చేశారు.

Other Updates