తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అతరించి మూడు వసంతాలు దాటింది. మలిదశ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో తన అస్తిత్వమూలాల్ని అన్వేషించుకున్న తెలంగాణ నేడు తనను తాను విస్పష్టంగా పునరావిష్కరించుకుంటున్నది. ఈ దిశలో చరిత్ర, సాహిత్యం, కళలు, ఇతరేతర రంగాలలో పలు పరిశోధనలు, విశ్లేషణలు జరుగుతున్నాయి. ప్రసిద్ధ ప్రచురణ సంస్థ ‘నీల్‌కమల్’వారు ప్రచురించి ‘తెలంగాణ వైతాళికులు’ అందులో భాగమేనని భావించాలి.
‘తెలంగాణ వైతాళికులు’ మొత్తం మూడు సంపుటాలు. పలువురు ప్రజా నాయకుల సమగ్ర పరిచయాలతో ఉన్నది ‘జన నేతలు’, ప్రతిభావంతులైన రచయితలు, కవులు పరిచయం సంకలనం ‘అక్షరమూర్తులు’, విభిన్నరంగాలకు చెందిన పలువురు ప్రజ్ఞావంతుల జీవిత విశేషాలతో ‘ప్రతిభామూర్తులు’ అనే మూడు సంపుటాలు కలిపి వేయిపుటలు దాటాయి.
ప్రచురణకర్తలు నాణ్యతలో ఎక్కడా రాజీలేకుండా ముద్రించినట్టు అర్థమవుతోంది. ఇది అభినందనీయం. అట్లాగే, ఇటీవలి కాలంలో తెలంగాణ సాహిత్యరంగంలో ప్రముఖమైన గుర్తింపును పొందుతున్న డాక్టర్ గుమ్మన్నగారి బాల శ్రీనివాసమూర్తి అత్యంత నైపుణ్యంతో సంపాదకత్వ బాధ్యతలు నిర్వహించినట్టు స్పష్టపడుతోంది. ప్రామాణికత, సమాచార గాఢత, శైలిలో సరళత వైతాళికులు వ్యాససంకలనాల వన్నెను పెంచాయి. వ్యాస రచయితల విభిన్న శైలుల్ని గుర్తిస్తూనే వ్యాసాలన్నీ ఒకే శైలిలో ఉండేటట్టు తీర్చిదిద్దడం సంపాదకులు చూపిన ప్రతిభ.
సంకలనాలకు ముందు మాటల్ని రచించే క్రమంలోనూ ప్రచురణకర్త, సంపాదకులు ఔచిత్యాన్ని పాటించారు. జననేతలు (పొత్తూరి వెంకటేశ్వరరావు), అక్షరమూర్తులు (డాక్టర్ కె.వి. రమణాచారి), ప్రతిభామూర్తులు (కె. జితేంద్రబాబు) సంపుటాల ముందుబాటలు సంక్షిప్తమే అయినా నిండుదనంతో ఉన్నాయి.
మూడు సంపుటాలూ విద్యార్థులకు, పరిశోధక విద్యార్థులకు, ప్రాథమిక స్థాయినుంచి విశ్వవిద్యాలయాల వరకు తెలంగాణ అంశాల్ని బోధించే అధ్యాపకులకు, జిజ్ఞాసువులకు ఇతోధికంగా తోడ్పడతాయనే చెప్పాలి.
– సురేష్
తెలంగాణ వైతాళికులు; మూడు సంపుటాలు:
జననేతలు, అక్షరమూర్తులు, ప్రతిభామూర్తులు. వెల: రూ. 1,000/-
ప్రతులకు నీల్‌కమల్, ప్రచురణలు, కోఠి మరియు హైదరాబాద్‌లోని
ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలలో సంప్రదించండి)