జీఎస్‌టీ బిల్లు ఆమోదం కోసం తెలంగాన శాసనసభ ప్రత్యేక సమావేశాన్ని ఆగస్టు 30న నిర్వహించారు. ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం కాగానే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జీఎస్‌టీ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ దేశమంతటా ఒకే పన్ను విధానం ఉండడానికి గాను కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును ప్రవేశపెట్టిందని తెలిపారు. ఇలాంటి విధానాన్ని ప్రపంచవ్యాప్తంగా 160 దేశాలు అమలు చేస్తున్నాయని తెలిపారు. ఒకే దేశం-ఒకే పన్ను విధానాన్ని అమలు చేయాలనే దిశగా ముందుగా యూపీఏ ప్రభుత్వమే ఈ బిల్లును తేవాలని ప్రయత్నించిందన్నారు. అయితే అప్పట్లో కొన్ని రాష్ట్రాలు వ్యతిరేకించడంతో తేలేకపోయారన్నారు. ఇప్పుడు నరేంద్రమోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అన్ని రాజకీయపార్టీలు, అన్ని రాష్ట్ర ప్రభుత్వాల మద్దతులో ఈ జీఎస్‌టీ బిల్లును లోక్‌సభ, రాజ్యసభలో ప్రవేశపెట్టి ఆమోదింపచేసిందన్నారు. అనంతరం సగం రాష్ట్రాలు ఆమోదించాల్సి ఉందన్నారు. ఇప్పటికి 9 రాష్ట్రాలు ఆమోదించాయని, మనది 10వ రాష్ట్రమని సీఎం తెలిపారు. జీఎస్‌టీ బిల్లు వల్ల ఏ రాష్ట్రాలైనా పన్నుల రూపంలో వచ్చే ఆదాయాన్ని నష్టపోతే అయిదు సంవత్సరాల వరకు ఆ లోటును కేంద్రమే భరించే విధంగా ఇందులో పొందుపరిచారని తెలిపారు. సీఎం బిల్లు ప్రవేశపెట్టి మాట్లాడిన తరువాత కాంగ్రెస్ పక్షాన చిన్నారెడ్డి మాట్లాడుతూ జీఎస్‌టీ బిల్లు ద్వారా సర్వీస్‌టాక్స్ 14.5 శాతం నుంచి 24 శాతానికి పెంచాలని కేంద్రం యోచిస్తున్నట్లు తెలుస్తుందన్నారు. అంతగా పెంచకుండా 18శాతం మాత్రమే ఉండేలా చూడాలన్నారు. ఏ పన్నులైనా ప్రజలకు ఇబ్బందిలేకుండా ఉండాలన్నారు. ఈ విషయాలను వేదవ్యాసుడు, చాణిక్యుడు తమ గ్రంథాల్లో ఉటంకించారన్నారు. 2001లో కెనడాలో జీఎస్‌టీ ప్రవేశపెట్టారన్నారు. ఆ తరువాత వచ్చిన ఎన్నికల్లో జీఎస్‌టీ ప్రవేశపెట్టిన పార్టీ ఓడిపోయిందన్నారు. ఇలా ప్రజలకు ఇబ్బందులు కలిగితే ఇలాంటి పరిణామాలే ఉంటాయని హెచ్చరించారు. జీఎస్‌టీ బిల్లు ప్రజలకు ఇబ్బందులు కలుగచేయకుండా, ప్రజలపై అధిక భారం పడకుండా చూడాలన్నారు. జాతీయ కాంగ్రెస్‌పార్టీ నిర్ణయం ప్రకారం తమపార్టీ జీఎస్‌టీ బిల్లుకు మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. బిజెపి నుంచి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ భారత ఆర్థిక సంస్కరణల చరిత్రలో ఇది ఒక మైలురాయి అన్నారు. ఈ బిల్లు వ్యాపారవేత్తలు, పారిశ్రామిక వేత్తలకు ఉపయోగపడే బిల్లు కాదని, పేద ప్రజలకు ఉపయోగపడే బిల్లు అని స్పష్టం చేశారు. జీఎస్‌టీ అంటే గ్రేట్ స్టెప్ బై టీం ఇండియా అని ప్రధాని పేర్కొన్నట్లు తెలిపారు. అందకే పూర్తిగా మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. టిడిపి సభ్యుడు సండ్ర వెంకట వీరయ్య మాట్లాడుతూ ఇది వినియోగదారుడికి మేలు కలుగచేస్తుందన్నారు. అందుకే దీనికి మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. సీపీఎం సభ్యుడు సున్నం రాజయ్య మాట్లాడుతూ బిల్లు పాస్ అయ్యేవరకు ఉన్న స్నేహ భావం ఆ తరువాత ఉండదన్నారు. అందుకే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అన్ని నెరవేరే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఎంఐఎం సభ్యులు కూడా ఈ బిల్లుకు మద్దతు ప్రకటించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ అందరు కలిసి మద్దతు పలికినందుకు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ శాసనసభ హుందాతనాన్ని చాటిచెప్పారన్నారు. స్పీకర్ టీబ్రేక్ ప్రకటించడంతో సభ అరగంట వాయిదా పడింది.
సభ తిరిగి ప్రారంభం కాగానే దేవాలయాల్లో పాలకమండలి సభ్యుల పెంపు, సైబరాబాద్ కమీషనరేట్‌ను రెండు కమీషనరేట్‌లుగా విభజన తదితర బిల్లులను ఆయా శాఖల మంత్రులు హరీష్‌రావు, నాయిని, ఇంద్రకరణ్‌రెడ్డిలు సభలో ప్రవేశపెట్టి ఆమోదింపచేశారు. జిల్లాలు ఏర్పాటు ముందు ఉన్నందున జిల్లాల ఏర్పాటు తరువాత సైబరాబాద్ కమీషనరేట్ విభజన జరిగితే బాగుంటుందని కాంగ్రెస్ సభ్యులు రాంమోహన్‌రెడ్డి అన్నారు. దేవాలయాల పాలక మండళ్ళలో మహిళలకు రిజర్వేషన్ కల్పించాలని కాంగ్రెస్ సభ్యులు జీవన్‌రెడ్డి కోరారు. అనంతరం బిల్లులను సభ ఆమోదించిన తరువాత స్పీకర్ సభను నిరవదికంగా వాయిదా వేశారు.
కౌన్సిల్ సమావేశం
జీఎస్‌టి బిల్లు ఆమోదానికి శాసన మండలి ప్రత్యేక సమావేశాన్ని ఆగస్టు 30వ తేదీన ఏర్పాటు చేశారు. ఉదయం 11 గంటలకు శాసన మండలి ఛైర్మన్ స్వామీ గౌడ్ సభను ప్రారంభించారు. సభ ప్రారంభం కాగానే డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి జీఎస్‌టి బిల్లును సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ పార్లమెంట్ ఉభయసభలు ఆమోదించిన ఈబిల్లు రాష్ట్ర ప్రభుత్వాల ఆమోదానికి పంపించారని సభకు తెలిపారు. దీని వల్ల దేశ వ్యాప్తంగా ఒకే దేశం ఒకే పన్ను అమల్లోకి వస్తుందని, దీని వల్ల తెలంగాణ రాష్ట్రానికి సైతం లాభం కలుగుతుందని తెలిపారు. ఈ బిల్లు ద్వారా రాష్ట్రాలకు వచ్చే నష్టాలను 5 సంవత్సరాల పాటు కేంద్ర ప్రభుత్వం భరిస్తుందని, ఈ బిల్లును ఆమోదించవలసిందిగా కడియం శ్రీహరి సభముందుంచారు.
ఈ బిల్లుపై సభ్యులు తమ అభిప్రాయాలు తెలుపవలసిందిగా మండలి ఛైర్మన్ సభ్యులను కోరారు. ఎంఐఎం సభ్యుడు రజ్వీ, టిఆర్‌ఎస్ సభ్యులు పల్లా రాజేశ్వర్ రెడ్డి, పూల రవీందర్‌లు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రానికి ఈ బిల్లు వల్ల ఎంతవరకు లాభం జరుగుతుంది, టాక్స్‌లో రాయితీ ఎంత ఉంటుందో తెలపాలన్నారు. ఈ బిల్లుకు ఆయా పార్టీల తరపున పూర్తి మద్దతు ప్రకటించారు. బిజెపి సభ్యుడు రాంచందర్‌రావు మాట్లాడుతూ 16ఏండ్ల స్వప్నం ఈనాటికి సాకారమైందన్నారు. పి.వి. నరసింహ రావు చేసిన ఆర్థిక సంస్కరణల తర్వాత అంత కీలకమైన బిల్లు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. దీని వల్ల నల్లదనాన్ని అరికట్టవచ్చని, రాష్ట్రాల ఆమోదంతో త్వరలోనే చట్టంగా మారాలని ఆకాంక్షింస్తూ జీఎస్‌టి బిల్లుకు బిజెపి పార్టీ తరపున పూర్తి మద్దతును తెలిపారు. ప్రతిపక్ష కాంగ్రెస్ సభ్యుడు షబ్బీర్ అలీ, కాంగ్రెస్ సభ్యుడు సుధాకర రెడ్డిలు మాట్లాడుతూ ఈ బిల్లుకు కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతునిస్తుందని, అయితే దీనిపై తమకు కొన్ని అనుమానాలున్నాయని, వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు. సభ్యుల ప్రశ్నలకు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి సమాధానమిస్తూ… జిఎస్‌టి బిల్లుకు మద్దతు తెలినందుకు సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ బిల్లు వల్ల కలిగే లాభ నష్టాలను సభకు వివరించారు.