మడిపల్లి రాజ్‌కుమార్‌

వేనవేల ఏండ్లసంది
గీడ గీ జీవనది పార్తనె వున్నది

అన్నోల్లకు ఇన్నోల్లకు
ఏ ఈగ పెట్టని కుట్టని
పుట్లకొద్ది పుట్టతేనె తాప్తనె వున్నది

అడూలు కొండలు ఊర్లు పట్నాలు
రాజ్యాలు.. రాజ్యాలె
ఓ ఒక్క తాటనా
కుంటలై చెర్లయి వొర్రెలై
వాగులు వొంకలై కాల్వలు నదులై
అందరి గొంతుల ఆడ్తనె వున్నది

గిట్ల ఆడుతు పాడుతు పారుతున్న నదికి
రాజరాజు కట్టిపిస్తె
తొల్త నన్నయనె కట్ట కట్టి నిలిపి
పద్యాల పంట కాలల్ని తీసె

గాయిన ఎనుక తిక్కన్న ఎర్రన్నలు నడిచి
ముగ్గురు మూడుకాలాలు బారతం పండించి
పండితులకు పంచిరి

గప్పట్లనె పాలకుర్తి వూల్లె సోమన్న
మా వూరోల్ల కోసమనిజెప్పి
గీ చెరుకె తూముకట్టి
తేటతేట నీల్లు పారిచ్చి పనిపాట జేస్తు
బసవన్న కతల్ని కైగట్టి పండించె

గటెన్క ఓ కొద్దిమందా!
మారన్న ఇంకో సోమన్న గోపన్న
శ్రీనాథుడు గిట్ల శనామంది
తీరొక్క పంటదీసిరి
పోతె…. తియ్యని పంటగ
బాగోతం చెరుకును పండించి
బెల్లం రుచి చూపినోడు పోతన్ననె!

ఇగ రాయల కాలమంటవా
ఓహ్‌! బంగారం పంటనే
పెద్దన్న పేద్దకట్టగట్టి
ఆకాశమంతెత్తు మీంచి పడుతున్న
ధారలుజూపి ఖుషీజేసె!
గాయిననె కాదు
ప్రబంధాల తోటలు పెంచుడు నేర్పె!

ఆ తోటలల్ల ఒక్క తీరనా
తీరొక్క రంగు పూలచెట్లు
తీరొక్క రుచి పండ్లచెట్లు
తీగెలు పొదలు చిన్న పెంచిరా!

తిండి పంటలెన్కపడి
అందరు తోటలె పెంచుడాయె
గా దినాలల్లనె తంజావూరు నించి
గంజాయి మొక్క తెచ్చి నాటిరెవరో!
ఇగ నాశనానికి మూలమాయె
చనామంది గంజాయినే పెంచిరి
తాళ్ళూ ఈదుళ్ళు కూడ పెంచిరి

గాళ్ల నడుమలనె
బట్టకట్టని బరిమాతల కవి వేమన్న పుట్టి
ఊరూర యాపచెట్లు నాటి
పాడువడ్డ లోకానికి
చేదుమందు పెట్టిండు

తెల్లదొర ఐతె ఏంది
పాతవైనా అసలు ఇత్తనాలు మూటగట్టి
తెలుగు రంగై పోయిండు బ్రౌను

కందుకూరి చిలకమర్తి గురజాడ గిడుగు..
గంజాయి వనాల కగ్గివెట్టి
పరాయి యిత్తనాలతో
కొత్త పంటలు తియ్యనేర్పిరి

ఆల్లెన్క రాయప్రోలు దేవులపల్లి
నండూరి నాయని భావకవిత్వమని
మొదట్ల ”వొత్తు”గనె తీగె పారిచ్చి
మల్ల మర్దల్లెంట పడిరి బావలై!

పాత తొవ్వలకె పోవట్రి కదాని
వొచ్చుడొచ్చుడె మండుకుంటనె
మహాప్రస్థానం పండించె శ్రీశ్రీ
ఆకలి మంటతొ వున్నోల్ల ముందు నిలబడి
అన్నవస్త్రాల పంటల్ని పండించె తొవ్వజూపె!

దాశరథి సినారె గంగాయమునా తెహజీబ్‌
ఉరుదూ గులాబులతో తెలుగుకు అత్తరు నద్దిరి
పల్లెమాటల కాళోజి పల్లేరుకాయగ ప్రభువుల
ప్రశ్నించె

ఆ ఒడ్డున పండితుల కోసమని
విశ్వనాథ రామాయణం నాటి
కల్పవక్షాన్ని తెచ్చి నాటె!

ఇగ గిప్పటి సంగతా
చెప్పాతరం కాదు ఇనాతరం కాదు
గీడ గీ పట్నం లెక్కనె వేరున్నది
గీడోల్లు మాటమాటకు కలుపుతున్న
బయటి చెత్తను తెల్లటి నురగల తీర్గ కక్కుకుంట
జీవనది మూసినదిగ పార్తనె వున్నది

గీడి సదూలు సల్లగుండ
తెల్లారినట్లె వున్నయ్‌
పొల్లగాండ్లకు నీ కండ్లేవిరా అంటె తెల్వయ్‌
ముక్కేదిరా అంటె తెల్వది
ఐసునోసు అంటెనె తెలుస్తయట!

మా పల్లెల జీవనది బతుకులతో
పెనేసుకుని పార్తనె వున్నది
అక్కా బావ అన్నామామ
మాట నెత్తురు బంధమై అల్లుకున్నది

సిన్మలోల్లు గేలిస్తున్నరని
కండ్ల నీల్లు పెట్టుకున్న వూరు కన్నెర్రగై
ఆ మంటకు పెత్తనాలు బూడిదై పొయ్యి
మా మాటకు ఆరతి పట్టే మారాజు వచ్చిండని
మా మాటలు నదిల తడలై తలలెగరేస్తున్నై

ఎక్కిరిచ్చిన నోళ్ళే యెల్లవెట్టి చూస్తుంటే
ఎన్నీల మెరుపులతో పొంగిపొర్లుతున్నై!

Other Updates