జీరో-డిగ్రీ-2ఎంచుకున్న అంశం ఏదైతేనేంగానీ చెప్పే పద్ధతిలో ప్రత్యేకత చూపిస్తూ నచ్చే విధంగా రాసేవాళ్లు కొద్దిమంది మాత్రమే వుంటారని చెప్పినప్పుడు, అందులో మోహన్‌రుషి గారు వుంటారనడం అతిశయోక్తేమీకాదు.
ఈ మధ్యనే వచ్చిన వీరి ‘జీరో డిగ్రీ’ కవిత్వం చదివినప్పుడు కవిత్వానికి రంగూ, రుచి, వాసన గూడా వుంటుందా అనిపించింది. కవిత్వంలో జిగిబిగి గురించి చెప్పడం కాదుగానీ వీరికి కవిత్వంమీద మాత్రం మంచి పట్టుందని ఖచ్చితంగా చెప్పవచ్చు.
‘అమ్మ ముఖంమీది ముడుతలు తను పడ్డ కష్టాలకు ప్రతీకలు
పాదాల పగుళ్లు రొటీన్‌ బతుకుమీద రోతకు ఆనవాళ్లు’ ` అని చెప్తాడొకచోట. కవిత్వంలో యింతకన్నా సాంద్రత యింకెందుకండీ! వయసుమీద పడినందు క్కాదుగానీ కష్టాలకు ప్రతీకలన్నప్పుడు ఆ తరహా అమ్మలందరూ మన కళ్ల ముందుకొస్తారు. ‘‘లెక్కలేదు పత్రం లేదు’’ కవిత గూడా అలాంటిదేమరి. ఆవేదనలోంచి పుట్టినప్పుడే కవిత్వంలో మంచి బలం కన్పిస్తుంది. అలాగే మరోచోట`దినదినం వాడి అంగాంగపు బట్టలెంత ఉతికినా, పిండినా! ఒక్క సానుభూతి చుక్కా రాలదంటూ చెప్తాడు. భర్తలసేవల్లో అం‘‘తరిస్తున్న’’ భార్యలగురించి రాస్తూ, భార్యను భార్యలా చూడని అమానుష భర్తలగురించి ఏదీ దాచకుండా నర్మగర్భంగా చెప్తాడు. ‘‘ధూప’’ కవిత చదివినప్పుడు ఆరిపోయిన గొంతును తడుపుకోడానికి చెంబెడు నీళ్లు గడగడా తాగాలిమరి. ‘‘మోసం చేసే మనుషులుండొచ్చేమో కానీ మోహం కుదిరాక పాతబడిపోయిన పుస్తకాల్లేవు’’ అంటూ ‘బుక్‌పాత్‌’లో చదివినప్పుడు ఫుట్‌పాత్‌ మీది పాత పుస్తకాలు కొన్ని కొనమంటూ మనవైపు జాలిగా చూస్తున్నట్లనిపిస్తుంది. ‘తాళం చెవి’ కవితలో ఒక కావ్యానికి సరిపడా మెటీరియల్‌ కన్పిస్తుంది. ‘‘రాత్రి రాజీ తెల్లవారి మాయం ` ఏ శస్త్ర చికిత్సతోనూ మాయని గాయం’ అంటాడు. అవునుమ రి. చాలా కుటుంబాలు అంతేగదా అని గొణుక్కుంటాం.
‘‘రంగు రుచి వాసనలేని స్నేహం ` ఇరవయొక్కటవ శతాబ్దపు జీవిత సత్య మంటూ’’ చెప్తూనే అనాది నుండి ఆడదానికి మగవాడు చేస్తున్న దురాగతాల గురించి కూడా మొహమాటం లేకుండా రాస్తాడొకచోట. చదువరుల నాడి పట్టుకుని వారి అంత రంగాన్ని పసిగట్టినవాడు కాబట్టే రోజువారి జీవితాల్లోని గోస పడు తున్న వారి గోడు గురించి ఎక్క డగూడా రాజీ పడకుండా ఊపిరి బిగబట్టుకుని చదివే కవిత్వం యీ ‘‘జీరో డిగ్రీ’’లో పుష్కలంగా దొరుకుతుంది మనకు. ‘బతికిన మనుషులు’ అనే చిన్న కవితలో అతకని బతుకుల ఆలుమగల జీవితాల గురించి సింపుల్‌గా పోస్ట్‌మార్టంచేసి చూపిస్తాడీకవి. ` మనవికాని వాటినే మనమెక్కువగా మోస్తూ తిరుగుతామనుకుంటా`అంటూ అడ్డమైన టెన్షన్లను భుజానేసుకుని తిరిగే మనందరి గురించి మళ్లీమళ్లీ చదువుకునే కవిత్వాన్ని గూడా అందించాడు. ‘‘గునపానికి గుండె వుంటుందని చూడ్డం అత్యాశ’’ అనే అద్భుతమైన మాట కన్పిస్తుందొక చోట. ఇలాంటి చాలా చాలా విలువైన కవితా వస్తువులతో కూడిన ‘‘జీరో డిగ్రీ’’ చదవాల్సిన పుస్తకం.
` కన్నోజు లక్ష్మీకాంతం

Other Updates