జీవవైవిధ్యాన్ని పరిరక్షించేందుకు తెలంగాణ ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోందని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖమంత్రి జోగు రామన్న తెలిపారు. డిసెంబర్ 10న మెక్సికోలో ప్రారంభమైన అంతర్జాతీయ బయోడైవర్సిటీ (కాప్-13) రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి ఈ విషయం వెల్లడించారు.
ప్రపంచ పర్యావరణ స్థితిగతుల పర్యవేక్షణ, పరిశీలనలు సమగ్రంగా చర్చించడానికి ఏర్పాటు చేసుకున్న వేదిక కాప్-13. డిసెంబర్ 10వ తేదీన మెక్సికోలో ప్రారంభమైన అంతర్జాతీయ జీవవైవిధ్య సదస్సు సమావేశానికి మన రాష్ట్ర ప్రతినిధులుగా అటవీ, పర్యావరణ, బీసీ సంక్షేమ శాఖమంత్రి జోగు రామన్న, బయోడైవర్సిటీ బోర్డు మెంబర్ సెక్రటరీ డా|| సీ సువర్ణ హాజరయ్యారు. అక్కడ జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి జోగు రామన్న పాల్గొని, రాష్ట్రంలో చేపడుతున్న, అమలు జరుగుతున్న జీవవైవిధ్య సంబంధిత అంశాలను ప్రస్తావించారు.
హైదరాబాద్ నగర జీవవైవిధ్య యాజమాన్య కమిటీని ఏర్పాటు చేసి బయోడైవర్సిటీ ఇండెక్స్‌ను రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే ప్రజా జీవవైవిధ్య రిజిస్టర్లు, జీవరాశుల పట్టికతోపాటు విఫణిలో వ్యాపారాత్మక లావాదేవీలలో కొనసాగుతున్న జీవ వనరుల పట్టికలను తయారుచేస్తున్నామని తెలిపారు. అమీన్‌పూర్ చెఱువు, వలస పక్షులకు నెలవుగా మారడం మూలంగా ఇటీవలే ఆ చెఱువును జీవవైవిధ్య వారసత్వ సంపదగా తెలంగాణ ప్రభుత్వం గుర్తించిందని మంత్రి తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం చేపట్టి అమలు చేస్తున్న కార్యక్రమాలు దాదాపుగా జీవవైవిధ్యాన్ని దృష్టిలో వుంచుకునే రూపొందించడం జరుగుతున్నదని వివరించారు. అయినా జీవవైవిధ్యంపై ప్రజలకు యింకా అవగాహన కల్పించవలసిన అవసరం వున్నది, సాధారణ జీవవనరులపై పడుతున్న వత్తిడిని తగ్గించాలని జోగు రామన్న పిలుపునిచ్చారు. జీవవైవిధ్యాన్ని రక్షించడానికి తమ ప్రభుత్వం కంకణబద్ధమై వున్నదని, ఇందుకు సాక్ష్యమే హరితహారం కార్యక్రమం అని వివరించారు. తెలంగాణలో 33 శాతం పచ్చదనాన్ని పెంపొందించే దిశగా, మూడేళ్లలో 230కోట్ల మొక్కలను నాటే బృహత్తర కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు మంత్రి జోగు రామన్న వివరించారు. ఈ కార్యక్రమానికి ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల ప్రతినిధులు హాజరయ్యారు.