తెల్లార గట్లల్ల తలుపు గొట్టిలేపి
మా తలపులల్ల
కొత్త పొద్దు పొడిపించిన సూర్యుడు-గాయ్న
కంటికి మింటికి ఏక ధారగా
మన మట్టి ముచ్చట్లను కై కట్టి చెప్పిన
తాళపత్ర పురాణం-గాయ్న
నైజాము సర్కరోని గుండెల మీన
అచ్చరాల కచ్చురాలు ఉర్కిచ్చిన
సచ్చా ఆద్మీ-గాయ్న
గీ నేల కోసం
గీ మట్టి బిడ్డల కోసం
ఎంతటోనికైన ఎదురు తిర్గిన
గీ జమీన్ కీ షాన్ – గాయ్న
గా మోసగాళ్ళ రాజ్జంల
గిది గోసలు చెప్పుకునే కాలం గాదని
‘గొడవ’లతోనే భడవ గాండ్లకు బుద్ధి చెప్పాల్నని
ఇకమతు చెప్పిన పెద్ద మనిషి-గాయ్న
తెలంగాణ యెతలను
తీరొక్క ముచ్చట్లను ఒడ్వకుంట సెప్పి
మనందరిని ములుగర్ర లెక్క పొడ్సి లేపిన
నియ్యత్ మనిషిి-గాయ్న
కన్ను తెరిత్తే బతుకు
కన్ను మూత్తే సావు
కంటి సూపు సూపంత తెలంగాణే అని సెప్పి
తెలంగాణనే కంటి పాప లెక్క సూసుకున్న ఫౌజీ-గాయ్న
గాయ్న సెప్పిన మాటే
మా గుండెల్ని మండిచ్చింది
గాయ్న రాసిన కైతే
మా చేతుల్ని కత్తుల లెక్క మార్చింది
గాయ్న సూపిచ్చిన తొవ్వే
గీ మట్టికి విముక్తి బాట యేసింది
గాయ్న చేతి కట్టె
గిప్డు మాకందరికీ రిలే పరుగు లెక్క అయింది
1969 నుంచి 2001 పైకెళ్ళి
ఇప్పటి దాకా
ఆపకుంట, ఆగకుంట
లగాయించి బగాయించినం
గాయ్నను మతిల పెట్టుకొనే ఉర్కినం
కొసాకి
”గవాన్ని” పురాగ ఓడిచ్చినం
కాళోజీ.. కాళోజీ
నీ యాది తెలంగాణ
నీ మనాది తెలంగాణ
నీ పునాది తెలంగాణ
గిప్డు
జెండాయై నిలిచింది
నీకు వందనం చేత్తాంది