ఇడ్శిపెట్టిన కొల్యాగ లెక్క
బజార్లు బట్టుకుని తిర్గుతానవని
సుట్టాకులు దెంపుకొచ్చి
తాతకిత్తాంటె అనేటోడు

ఆకును ఎన్కకుదిప్పి
నోటితోటి నారజీరి
కోమటాయన పుట్నాల పొట్లం గట్టినట్టు
బాపనాయన నెత్తినబెట్టె శఠగోపంలెక్క
ఆకు మడ్శెటోడు

అమ్మకాలి మట్టెల్లా
ఏసు నెత్తిమీది ముళ్లకిరీటంలా
పెండ్లికి అవుసులాయన కాడ
జేపిచ్చుకొచ్చిన బటువు లెక్క
నోటితోటి జీరిన నారను పేని
పెండ్లికొడుకు పెండ్లికూతురుకు
ఉంగురం తొడిగినట్టు
మడ్శిన ఆకుకు తొడిగెటోడు

నిన్ను కోనాయనేటోడు లేడనే గదా
అద్దూ అదుపులేకుంట బలాదూర్లు తిరిగేదని
పొగాకు పొట్టె జీరి
మడ్శిన ఆకుల పెట్టుకుని
గంటెలింత పొయ్యికాడ నిప్పట్టుకురమ్మని
కొర్కాసు లేకుంటనే సురుకు అంటిచ్చేటోడు

పనీపాటా లేకుంట ఎన్నొద్దులు తిర్గుతవని
గుప్పుగుప్పుమని పొగ వొదులుకుంట
తుప్కు తుప్కుమని ఊంచుకుంట
ఊశిపోయే గోశి చేతికియ్యమని
కారెడ్డం ఆడేటోడు

జెన్నెకిడ్శిన కొల్యాగకు
ముకుతాడెయ్యాలంటె
అంతకుదగ్గ బొంతనుజూశి జెయ్యాల్నని
మూలకున్న కట్టూదీస్కోని
ఎద్దును పొడ్శినట్టు తాపకోపాలి దెప్పిపొడ్శెటోడు

తాత మాటలకేంగని
కేశవరెడ్డి నవలికల…
సుక్కపంది కోసం ముసలోడు తండ్లాడినట్టు
నేను గడియ కనబడకుంటె
మాతాత గాబరగాబరయ్యేటోడు

– బండారి రాజ్‌కుమార్‌

Other Updates