magaజైళ్ళశాఖ ఆధ్వర్యంలో దేశంలోనే తొలి మహిళా గ్యాస్‌ బంక్‌ను హైదరాబాద్‌ చంచల్‌గూడ జైలు వద్ద హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా నాయిని మాట్లాడుతూ అందరూ మహిళలే నిర్వహించే ఇలాంటి గ్యాస్‌బంక్‌ను ప్రారంభించడం ఎంతో ముదావహమన్నారు. దీనివల్ల 25 మంది మహిళలకు ఉపాధి లభించిందని అన్నారు. ఈ మహిళలకు నెలకు రూ. 12వేలు చెల్లించడం జరుగుతుందన్నారు. ఇలా కొన్ని నెలల తరువాత ఈ వేతనాన్ని 18వేలకు పెంచుతారన్నారు. జైళ్ళలో తయారవుతున్న ఉత్పత్తులకు విపరీతమరైన గిరాకీ ఉందన్నారు. ఇటీవలి కాలంలో జైళ్ళ శాఖలో పలు సంస్కరణలు అమలవుతున్నాయన్నారు. జైళ్ళలో ఉన్న ప్రతి ఖైదీ అక్షరాస్యుడుగా తయారు కావడానికి జైళ్ళశాఖ ఎంతో కృషి చేస్తోందన్నారు. ఖైదీలకు పెరోల్‌ ఇవ్వడం కూడా జరుగుతుందన్నారు. పెరోల్‌ ఇవ్వడం ద్వారా ఖైదీలు తమ భార్య, పిలల్లతో సంతోషంగా గడిపి తిరిగి జైలుకు రావడానికి అవకాశం ఏర్పడుతుందన్నారు.

జైళ్ళలో ఉన్న పరిస్థితి చూసి ఖైదీలెవ్వరూ బయటకు పోవడానికి ఇష్టపడడంలేదని హోంమంత్రి చమత్కరించారు. ఎమర్జన్సీ కాలంలో తాను 18 నెలల పాటు ఇదే చంచల్‌గూడ జైలులో ఉన్నానని, జైలులో ఉండే పరిస్థితులు నాకు తెలుసని నాయిని పేర్కొన్నారు. తాను ఇప్పుడు ప్రారంభించిన ఈ బంక్‌ దినదినాభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షిం చారు. వివిధ రూపాల్లో జైళ్ళశాఖకు ఆదాయం వస్తుందని, భవిష్యత్తు లో జైళ్ళశాఖ తన ఆదాయంతోనే నెట్టుకు రాగలదని మంత్రి తెలిపారు.

జైళ్ళశాఖ డిజి వి.కె.సింగ్‌ మాట్లాడుతూ హోంమంత్రి నాయిని ప్రారంభించిన పథకాలన్నీ విజయవంతమవుతాయన్నారు. వారి హస్తవాసి మంచిదని కితాబు ఇచ్చారు. తమ శాఖలో అవినీతిని రూపుమాపామన్నారు. జైళ్ళశాఖలో అవినీతి నిరూపిస్తే వారికి రూ. 5వేలు నజరానా ఇవ్వనున్నట్లు తెలిపారు. జైళ్ళశాఖ టర్నోవర్‌ రూ. 1000 కోట్లు దాటాలన్నదే తమ ఆకాంక్ష అని చెప్పారు. జైళ్ళ ఉత్పత్తులు రాష్ట్ర వ్యాప్తంగా అమ్మకానికి చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ రాహూల్‌ భరద్వాజ్‌, రమణారావు, జైళ్ళశాఖ అధికారులు పాల్గొన్నారు.

Other Updates