sampadakeeyam‘జై జవాన్‌ — జై కిసాన్‌’ అని దశాబ్దాల క్రితం ఆనాటి ప్రధాని లాల్‌ బహద్దూర్‌ శాస్త్రి పిలుపునిచ్చారు. ఆ పిలుపును అందుకొని ఆనాటి ప్రభుత్వాలు స్పందించి ఉంటే దేశానికి అన్నంపెట్టే అన్నదాతకు ఇంతటి దుర్గతి పట్టి వుండేదికాదు. రైతన్న గురించి ఆతరువాతి పాలకులు పట్టించుకోకపోగా, అన్నదాతల ఉసురు తీస్తున్న చర్యలను చేష్టలుడిగి చూస్తూ ఉండిపోయారు. చెరువులను చెరబట్టారు. ఎరువుల బ్లాక్‌ మార్కెటింగ్‌, విత్తువేసినా మొక్కరాని, వచ్చినా పంట పండని విత్తనాల సరఫరా, సాగునీటి కొరత, విద్యుత్‌కోతలు, అందీఅందని రుణాలు రైతన్నవెన్ను విరిచాయి.

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అవతరించడంతో రైతన్నల ఆశలు చిగురించాయి. రాష్ట్ర ప్రభుత్వం రైతుల అభ్యున్నతికి, వ్యవసాయరంగాన్ని సంక్షోభం నుంచి శాశ్వతంగా బయట పడేసేందుకు తీసుకుంటున్న చర్యలు ఇప్పుడు దేశానికే ఆదర్శప్రాయంగా, దిక్సూచిగా నిలుస్తున్నాయి. వ్యవసాయం దండుగ అన్నవారి నోళ్లు మూయించి, వ్యవసాయం పండుగ కావాలన్న ఆకాంక్షతో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు రాష్ట్రంలో చేపట్టిన పలు కార్యక్రమాలు నేడు రైతన్నకు దన్నుగా నిలిచాయి. 36 లక్షల మంది రైతాంగానికి చెందిన 17,000 కోట్ల రూపాయల రుణ బకాయిల రద్దు, రైతుల పంటలను అయినకాడికి అమ్ముకోకుండా, గిట్టుబాటు ధర వచ్చేవరకూ నిల్వ ఉంచుకొనేందుకు గిడ్డంగుల నిర్మాణం, మిషన్‌ కాకతీయ పథకంతో వేలాది చెరువుల పూడికతీత, మరమ్మతు పనులు, కోటి ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో త్వరితగతిన సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, గతంలో ఏనాడూ లేనివిధంగా, నిరంతరాయంగా నాణ్యమైన ఉచిత విద్యుత్‌ సరఫరా, రైతులకు సరైన సలహాలు ఇచ్చేందుకు తగినంత మంది వ్యవసాయాధికారుల నియామకం, భూసార పరీక్షల వంటి ఎన్నో చర్యలను ప్రభుత్వం తీసుకుంది.

వీటన్నిటికీ మిన్నగా, దేశంలోనే మరెక్కడా ఊహకు కూడా అందనివిధంగా, వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచీ రాష్ట్రంలో రైతాంగానికి ఎరువుల కొనుగోలు, తదితర వ్యవసాయ పెట్టుబడుల కోసం ప్రతీ సీజన్‌ లో ఎకరాకు 4,000 రూపాయల వంతున రైతుల బ్యాంకుఖాతాలో జమచేయాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఇటీవల తీసుకున్న తాజా నిర్ణయం రైతాంగంలో ఆనందోత్సాహాలు నింపింది. రుణ మాఫీ కంటే కూడా తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం బహుళ ప్రయోజన మైనదని నీతి ఆయోగ్‌ కూడా ప్రశంసించిందంటే ఈ నిర్ణయం దేశాన్ని ఎంతగా ప్రభావితం చేస్తోందో తెలుస్తోంది.

రైతులను సకాలంలో ఆదుకొని, వ్యవసాయ రంగంలో సంస్కరణలు అమలుచేస్తే రైతుల ఆదాయం రెట్టింపు చేయడం అసాధ్యమేమీ కాదని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు గట్టిగా భావిస్తున్నారు. అందుకే, ఈ విషయాన్ని ఇటీవల జరిగిన నీతి ఆయోగ్‌ పాలకమండలి సమావేశంలో కూడా ఆయన సూచించారు. రైతన్నను సంక్షోభం నుంచి బయటపడవేసి, వారి ఆదాయం పెంచేందుకు అనుసరించాల్సిన విధానాలను ఆయన దేశం ముందుంచారు. వీటిలో చాలా అంశాలను ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తుండటం విశేషం.

Other Updates