– ముహమ్మద్ వహీదుద్దీన్
చరిత్ర అధ్యయనంలో అనేకమంది ప్రముఖుల గురించి తెలుస్తుంది. కొందరు మృదుభాషణంతో అందరినీ ఆకట్టుకున్న వారు, ఉత్తేజభరితమైన ప్రసంగాలతో ఉర్రూతలూగించినవారు, తత్త్వవేత్తలు అనేక మంది ప్రతి కాలంలోను కనబడతారు. రాజులు, చక్రవర్తులు ఎంతో మంది కనబడతారు. గొప్పగొప్ప సామ్రాజ్యాలను వారు స్థాపించారు. సామ్రాజ్య విస్తరణ కాంక్షతో సైన్యాలు నడిపి అనేక రాజ్యాలను ఆక్రమించుకున్నవారు, అలాగే, నాగరికతా వికాసానికి తోడ్పడిన మేధావులు ఎంతో మంది మనకు చరిత్రలో కనబడతారు.
విప్లవ ఉద్యమాలను నడిపి మార్పు సాధించినవారు, సంస్కర్తలు ఇలా ఎందరో మనకు చరిత్ర అధ్యయనంలో కానవస్తారు. విభిన్న మత ధర్మాలను బోధించిన వారు ఉన్నారు. నైతిక ప్రమాణాలకు పెద్దపీట వేసిన వారు ఉన్నారు. కాని వారి బోధనలు, వారు సాధించిన విజయాల, ఫలితాలు పరిశీలిస్తే అందులో సమాజ శ్రేయోశుభాలు బహు కొద్దిగా మాత్రమే కానవస్తాయి. ఏదో ఒక జీవన రంగానికి మాత్రమే ఫలితాలు పరిమితమై ఉంటాయి. ఆ ప్రయోజనాలతో పాటు కొన్ని అవాంఛనీయమైన ధోరణులు కూడా అక్కడ కనబడతాయి. మానవ చరిత్రలో మనిషి జీవితాన్ని సంపూర్ణంగా, అన్ని రంగాల్లో సంస్కరించినవారు కేవలం ప్రవక్తలు తప్ప మరెవ్వరూ లేరు. మనిషి అంతరంగాన్ని, మనిషి బాహ్య ఆచరణను సమస్తాన్ని చక్కదిద్దినవారు ప్రవక్తలు మాత్రమే.
ప్రవక్త ముహమ్మద్ (స) జీవిత లక్ష్యం కూడా ఇదే. ఆయన సందేశం మనిషి జీవితాన్ని, సామాజిక జీవితాన్ని, వ్యక్తిగత జీవితాన్ని సంపూర్ణంగా మార్చివేసింది. మనిషి అంతరంగంలో మార్పు సాధించింది. ఆరాధనా స్థలమైన మస్జిదు మొదలు ఆర్థిక కార్యకలాపాలు కొనసాగే మార్కెట్టు వరకు, పాఠశాల నుంచి న్యాయస్థానం వరకు ఇంటి నుంచి యుద్ధరంగం వరకు అన్ని చోట్ల పాపభీతి, దైవభక్తి అలుముకున్నాయి. ప్రజల ఆలోచన విధానం మారింది. భావాలు మారాయి. భావావేశాల్లో మార్పు వచ్చింది. దృక్కోణం మారింది. అలవాట్లు మారాయి. ఆచరణలు మారాయి, ఆచారాలు, సంప్రదాయాలు మారిపోయాయి. హక్కులు, బాధ్యతలు తీరుతెన్ను మార్పుకు గురయ్యాయి. మంచి, చెడు ప్రమాణాలు, ధర్మ బద్ధం, ధర్మ నిషిద్దం అన్న కొలమానాలు మారిపోయాయి. నైతిక విలువలు, సంవిధాన సూత్రాలు, శాసనాలు, యుద్ధ నియమాలు, శాంతి విధానాలు అన్నీ మారిపోయాయి. ఉపాధి మార్గాలు, దాంపత్య నియమాలు అన్నీ మారిపోయాయి. నాగరికత, సామాజిక జీవనాలకు సంబంధించిన సమస్త రంగాలు విప్లవాత్మక మార్పుకు గురయ్యాయి. జీవన రంగాన్నింటిని అలుముకున్న మార్పు ఇది.
ఈ మార్పులో ప్రతిచోట మనకు శ్రేయోశుభాలే కనబడతాయి. ఈ మార్పులో ఎక్కడా చెడు మచ్చుకు కూడా కనబడదు. ఎక్కడా హాని అగుపడదు. ఎక్కడా విచ్ఛిన్నం లేదు. అన్ని వైపులా నిర్మాణమే. ఎటు చూసినా ప్రగతి వికాసాలే. నిజం చెప్పాలంటే మానవాళికి మార్గదర్శి అయిన ప్రవక్త ముహమ్మద్ (స) వల్ల మానవాళికి ఒక కొత్త ఉదయం ప్రాప్తమయ్యింది. విశ్వజనీన సోదరభావానికి పునాదులు పడ్డాయి. చరిత్రలో నూతన అధ్యాయం ప్రారంభమయ్యింది. ఆయన సాధించిన ఈ మహత్కార్యం చరిత్రలో సాటిలేనిది.
మిలాదున్నబి అంటే…?
మిలాదున్నబి అంటే ముహమ్మద్ ప్రవక్త (స) పుట్టిన రోజు అని అర్థం. ఈయన జననం మానవాళికి శుభోదయం. సమస్త సృష్టికీ కారుణ్యం. ఎందుకంటే, అజ్ఞానాంధకార విషవలయంలో కొట్టు మిట్టాడుతున్న మానవ జాతికి ఆయన వెలుగుబాట చూపారు. ఈనాటి ప్రపంచ పరిస్థితులు, పరిణామాల దృష్ట్యా ఇస్లామీ ధార్మిక ఉద్యమ సందేశ ప్రదాత అయిన ముహమ్మద్ ప్రవక్త (స)ను గురించి ఆయన సందేశాన్ని గురించి మిలాదున్నబి సందర్భంగానైనా మరోసారి మననం చేసుకోవడం సమంజసం, సముచితం, అవసరం కూడా.
అంతిమ మహా ప్రవక్త (స) జననం:
క్రీ.శ. 571 ఏప్రిల్ మాసం ఇరవయ్యో తేదీన సోమవారం నాడు అరేబియా దేశంలోని మక్కా నగరంలో మహా ప్రవక్త ముహమ్మద్ (స) జన్మించారు. తల్లి పేరు అమినా, తండ్రి పేరు అబ్దుల్లాహ్. ఈ మహోన్నత వ్యక్తి జన్మించక ముందే తండ్రినీ, ఆరేళ్ళ ప్రాయంలో తల్లినీ కోల్పోయారు. అనాధ అయిన ఆ ఆరేళ్ళ బాబును తాతయ్య అబ్దుల్ ముతల్లిబ్ అక్కున చేర్చుకున్నారు. ఆయన తరువాత ముహమ్మద్ ప్రవక్త (స) పోషణ, సంరక్షణ బాధ్యతను బాబాయి అబూ తాలిబ్ స్వీకరించి అల్లారుముద్దుగా పెంచిపోషించారు. చిన్నతనం నుంచే బాల ముహమ్మద్ సుగుణాల రాశిగా ప్రశంసించబడ్డారు. నీతి, నిజాయితీ, సేవా తత్పరత, సత్యసంధత, విశ్వనీయత ఆయనకు ఉగ్గుపాలతోనే అలవడ్డాయి. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవటం, నిష్పక్షపాతంగా, న్యాయంగా వ్యవహరించడం లాంటి అనేక సుగుణాల రీత్యా ఆయన ప్రజల మనసు చూరగొని సాదిక్‌గా, అమీన్‌గా అంటే సత్య సంధునిగా, విశ్వసనీయునిగా పిలవబడ్డారు.
హీరా అనే కొండ గుహలో…
ముహమ్మద్ (స) ఏకాంతంలో ప్రజల అజ్ఞానాన్ని, చెడును చూసి చాలా బాధపడేవారు. వారిని ఈ చెడు నుంచి ఎలా రక్షించాలి అని ఆలోచించేవారు. ఎక్కువగా మక్కా పట్టణానికి కొంత దూరంలో ఉన్న హీరా అనే కొండ గుహలో చేరి అల్లాహ్ ను వేడుకొనే వారు. ప్రజలను ఈ చెడు నుండి కాపాడమని ప్రార్థించారు. ఒక రోజు యదాతథంగా దైవ ధ్యానంలో ఉండగా అకస్మాత్తుగా ఒక అద్భుత వాణి ప్రతి ధ్వనించింది.
ఓ ముహమ్మద్! లే… నీ అల్లాహ్ పేరుతో పఠించు. ఏ మార్గాన్వేషణలో నువ్వు పరితపిస్తున్నావో అది నీ కొరకు తెరవబడింది అని వినిపించింది. జరిగినందంతా భార్యకు వినిపించారు. భయంగా ఉంది దుప్పటి కప్పమని చెప్పారు. ఆయన శరీరం భయంతో కంపించసాగింది. అప్పుడు ఖదీజా (రజి) ‘‘మీరు అనాధను ఆదుకుంటారు. బంధువు హక్కు చెల్లిస్తారు. రుణగ్రస్తులకు విముక్తినిస్తారు. పేదవారికి సహాయం చేస్తారు. అభాగ్యులను ఆదుకుంటారు. ఆతిథులకు మర్యాద చేస్తారు. సత్యాన్ని బలపరుస్తారు. ఆపదల్లో ఉన్నవారికి ఆపద్భాంధవుల్లా తోడ్పడతారు. అల్లాహ్ మిమ్మల్ని ఎన్నటికీ వృధా చేయడు’’ అని ఓదార్చింది. అప్పుడు ముహమ్మద్ (స) కొంత స్వాంతన చెందారు.
ఉద్యమ కర్తగా…
దేవుని ఏకత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన ఉద్యమకర్త ముహమ్మద్ (స) సృష్ఠిని పాలించేవాడు ఒక్కడే అని, అతను సజీవుడు, సంతానం లేని వాడు, ఎవరికీ సంతానం కాని వాడు, ఆకలి, కునుకు లేని అద్వితీయుడు అతడే అల్లాహ్ అని బోధించారు ప్రవక్త (స).
సంతానం పట్ల తల్లిదండ్రుల సేవ:
పిల్లలను ప్రేమించడం, మంచి విద్యాబుద్ధులు నేర్పించడం, సజ్జనులుగా తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేయడం తల్లిదండ్రుల బాధ్యత. ప్రవక్త (స) తన కుమార్తె హజ్రత్ ఫాతిమాను అమితంగా ప్రేమించేవారు. ఆమెకు మంచి విద్యను అందించి ఉన్నతంగా తీర్చిదిద్దారు.
అజ్ఞాన, అంధకారంలో కూరుకుపోయిన నాటి సమాజంలో ముహమ్మద్ (స) జ్ఞానజ్యోతులు వెలిగించారు. విద్యా కుసుమాలను వికసింపజేశారు. విద్యార్జన ప్రతి ఒక్కరి విధి అని ఆయన నిర్దేశించారు. ‘జ్ఞానం జీవితం, అజ్ఞానం మరణం’ అని విశదీకరించారు.
ఇరుగు పొరుగు వారితో మంచిగా ఉండాలనీ, వారితో సత్సంబంధాలు కలిగి ఉండాలనీ, మంచిగా ప్రవర్తించాలనీ ప్రవక్త (స) సూచించారు. అనాథలను ప్రేమించడం, పెంచడం, వారి ఆలనా, పాలనా చూడడం, మంచి విద్యాబుద్ధులు నేర్పించడం సాటి మనుషులుగా మన బాధ్యత అని ప్రవక్త (స) తెలిపారు.
భర్తగా…
దైవ ప్రవక్త (స) తన ఇరవయ్యవ యేట తనకన్నా వయసులో పెద్దగానున్న, రెండోసారి వితంతువు అయిన హజ్రత్ ఖదీజా(ర)ను వివాహమాడి స్త్రీజనోద్దరణకు శ్రీకారం చుట్టారు. ఆమెతో అత్యంత సంతోష జీవితాన్ని గడిపారు.
ప్రవక్త(స) న్యాయాధిపతిగా, ఆదర్శ ప్రాయుడిగా చరిత్రలో నిలిచిపోయారు. సమన్యాయ వ్యవస్థనూ, సామాజిక న్యాయ వ్యవస్థనూ స్థాపించారు. తద్వారా నల్లవారైనా, తెల్లవారైనా, అరబ్బైనా, అరబ్బేతరుడైనా, గొప్ప వంశస్థుడైనా, బానిస అయినా, ప్రవక్త (స) వంశానికి చెందిన వారైనా, తెగ సర్దారులైనా న్యాయం, చట్టం శిక్ష ముందు సమానులైపోయారు.
పాలకునిగా….
ఒక పాలకునిగా ప్రవక్త (స) ప్రజల కనీస అవసరాలను తీర్చడానికి అవసరమైన చర్యలన్నీ తీసుకున్నారు. ముస్లింలమైనా, ముస్లిమేతరుడైనా, స్త్రీ అయినా, పురుషుడైనా అందరు సమానులు అని పేర్కొన్నారు. పౌరులందరి ధన, మాన, ప్రాణ రక్షణకు భరోసా ఇచ్చారు. జకాత్, ఫిత్రా, సదఖాలాంటి ఆర్థిక మంత్ర దండాన్ని ప్రపంచానికి అందించారు.
ప్రపంచానికి ఆదర్శ ప్రాయుడిగా, కిరీటం లేని చక్రవర్తిగా, సంపదలేని మహారాజుగా, రాజమహల్ ఎరుగని పాలకునిగా, హంస తూలికాత్పం తెలియని మహామనిషిగా, మరణించిన రోజున దీపంలో నూనె సైతం లేని సామ్రాజ్యాధిపతిగా, ప్రపంచ చరిత్రలో కనీవిని ఎరుగని గొప్ప వ్యక్తిత్వం కలిగిన సంక్షేమ రాజ్య స్థాపకునిగా ప్రపంచానికి ప్రవక్త (స) ఆదర్శ ప్రాయుడు.
(తేది: 30-10-2020 మహా ప్రవక్త (స) జయంతి మిలాద్-ఉన్-నబి)