తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్, పురపాలక శాఖల మంత్రి కె. తారకరామారావు రూపొందించి తీర్చిదిద్దిన ‘టాస్క్’ (తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్డ్) ద్వారా ఇప్పటికే రెండు వేలకు పైగా విద్యార్థులకు కార్పొరేట్ రంగాల్లో ఉద్యోగాలు లభించాయి.
రాష్ట్ర పారిశ్రామిక అవసరాలకు సరిపడే నైపుణ్యాలను విద్యార్థులలో పెంపొందించేందుకు ఏర్పాటు చేసిన ‘టాస్క్’ నిర్ధేశిత లక్ష్యాలను దాటుకుంటూ ముందుకు సాగుతున్నది.
కార్పొరేట్ కంపెనీలలో పనిచేసి అనుభవం గడించిన సుజీవ్ నాయర్‌ను ఈ సంస్థకు సీఈవోగా నియమించారు. ఏడాది కాలంలోనే యువతకు చక్కటి మార్గనిర్దేశం చేస్తూ సాగుతున్న ‘టాస్క్’ జాతీయ స్థాయిలో అత్యుత్తమ స్కిల్ ఇన్‌స్టిట్యూట్‌గా అవార్డును కూడా అందుకున్నది.
ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో పేరుమోగిన ‘ఎంబ్రీ రీడిల్ ఎరోనాటికల్’ యూనివర్సిటీతో ఒప్పందం కుదుర్చుకున్నది. విమానయాన శిక్షణలో ప్రపంచ స్థాయిలో పేరుగడించిన ఈ సంస్థ తెలంగాణ యువతకు నైపుణ్య శిక్షణను ఇవ్వబోతుంది. ప్రపంచంలోనే పెద్ద యూనివర్సిటీగా పేరొందిన ‘ఎంబ్రీరిడిల్’ ఏవియేషన్, ఏరోస్పేన్‌లలో ప్రత్యేక కోర్సులను అందించడానికి అన్నిరకాల అనుమతులు కలిగివున్న సంస్థ. ఈ యూనివర్సిటీకి యూరోప్, అమెరికా, ఆసియా, మధ్య అసియాలతో సహా ప్రపంచం మొత్తంలో 150కి పైగా కేంద్రాలను కలిగివున్నది. ఇవేగాక ఆన్‌లైన్‌లోకూడా శిక్షణనందిస్తుంది.
కేవలం యూనివర్సిటీగానే కాకుండా, పరిశోధనా విద్యాలయంగా కూడా పేరొందింది ఎంబ్రీరిడిల్. పలు యూనివర్సిటీలతో పాటు, ఏరోస్పేస్ పరిశ్రమలతో కూడా ఒప్పందాలు కుదుర్చుకున్న ఎంబ్రీడిల్ ఈ రంగంలో ఎంతో కృషి చేస్తున్నది.
సింగపూర్‌లో జరుగుతున్న ఎయిర్‌షోలో భాగంగా టాస్క్ సీఈవో సంజీవ్ నాయర్, ఎంబ్రీరిడల్ యూనివర్సిటీ (ఆసియా) హెడ్ ప్రొఫెసర్ గ్రహం హంట్ ల మధ్య ఫిబ్రవరి 19న ఒప్పందం కుదుర్చుకొని ఎంఓయూలపై సంతకాలు చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడిన గ్రాహంహంట్, ఏరోస్పేస్, ఏవియేషన్ రంగంలో ఉద్యోగ అవకాశాలు పుష్కలంగా అందుబాటులోకి రానున్నాయని, వాటిని ముందే గుర్తెరిగి భవిష్యత్ అవసరాల దృష్ట్యా మాతో ఒప్పందం కుదుర్చుకోవడం అభినందనీయం అన్నారు.
ఒప్పందం కుదుర్చుకున్న సందర్భంగా మాట్లాడిన ‘టాస్క్’ సీఈవో సుజీవ్‌నాయర్.. అత్యున్నత నైపుణ్యాలున్న యువతతో పాటు, పాక్షిక నైపుణ్యాలున్న వారికి కూడా శిక్షణను అందించే అవకాశం కలుగుతుందని అన్నారు. ఈ శిక్షణ తీసుకున్నవారు శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, ట్రైనర్లు, ఉద్యోగులుగా పలు అవకాశాలను దక్కించుకునే వీలుంటుందన్నారు.